Ponnam Prabhakar: కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వాన్ని నిర్ణయించేది ప్రజలే తప్ప వ్యక్తులు కాదని.. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆశించడం ఒక రాజకీయ పార్టీగా తమ హక్కు అని ఆయన స్పష్టం చేశారు. పదవులు శాశ్వతం కాదని, అవి కేవలం ప్రజల విశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయని ఆయన గుర్తు చేశారు.
గత 12 ఏళ్లుగా దేశ ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని, దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి సార్వభౌమత్వాన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్నారని పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిపాలనా వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారని ఆరోపించారు. నిత్యావసర ధరలు పెంచి పేదలను విస్మరించడమే కాకుండా, విద్వేషాలను రెచ్చగొట్టి మైనార్టీలను, అణగారిన వర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను అడ్డుపెట్టుకుని విపక్ష ప్రభుత్వాలను కూలుస్తూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టి దేశ ఐక్యత కోసం పాటుపడుతున్న రాహుల్ గాంధీని విమర్శించడం, ఆకాశం వైపు చూసి ఉమ్మివేయడమేనని హితవు పలికారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురాలేని ‘దద్దమ్మ’ బండి సంజయ్ అని, ఆయన వెంటనే తన వ్యవహారశైలిని మార్చుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Also Read: వీఐపీలైనా.. సామాన్యులైనా ఒక్కటే! కొండగట్టులో కొత్త ఈఓ సంచలన నిర్ణయాలు