ముఖం కిందే మెడ ఉంటుంది. కానీ ముఖాన్ని పదేపదే రుద్దుతారు. కానీ మెడను మాత్రం రుద్దరు. అందుకే మెడ చుట్టూ నల్లగా మురికి పేరుకుపోతుంది. అదంతా కూడా మృతకణాలుగా చెప్పుకుంటారు. చర్మ కణాలు మరణించిన తర్వాత ఇలా మెడ చుట్టూ పేరుకుపోతూ ఉంటాయి. దీని వల్ల మెడ ముదురు రంగులో కనిపిస్తూ ఉంటుంది.
సాధారణంగా చెమట, దుమ్ము వంటివన్నీ కూడా మెడ భాగంలోనే అధికంగా చేరుతూ ఉంటాయి. ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ప్రత్యేక సబ్బులు వంటివి ఉండవు. మెడ దగ్గర నల్లదనాన్ని సహజంగా తొలగించుకోవాలంటే మీరు చిన్న చిట్కాను పాటిస్తే సరిపోతుంది. కేవలం రెండు రూపాయలతో కొన్న ఒక వస్తువు మీ మెడ దగ్గర ఉన్న నలుపుదనాన్ని పూర్తిగా పోగొడుతుంది.
నిమ్మకాయతో…
రెండు రూపాయలకు ఒక నిమ్మకాయ వస్తుంది. ఆ నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేయండి. ఆ నిమ్మకాయ పై చిటికెడు పసుపు, చిటికెడు కాఫీ పొడి, రెండు చుక్కల కొబ్బరినూనె, కొద్దిగా షాంపూ వేయండి. దానితో మీ మెడ ప్రాంతాన్ని బాగా రుద్దండి. రెండు మూడు నిమిషాల పాటు అలా రుద్దుతూనే ఉండండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి మూడు నుండి నాలుగు సార్లు ఇలా చేయండి. మీ నల్లటి మెడ మురికిపోయి తెల్లగా మారుతుంది.
ఎలా పనిచేస్తుంది?
పైన చెప్పిన చిట్కా ఎలా పనిచేస్తుందని ఎంతో మందికి సందేహం రావచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. చనిపోయిన మృత కణాలను కూడా తొలగిస్తుంది. ఇక ఇందులో వాడిన పసుపులో క్రిమినాశక లక్షణాలు, శోధ నిరోధక లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని శుభ్రపరిచి మెరిసేలా చేస్తుంది. ఇక కాఫీ పొడిలో స్క్రబ్బింగ్ ఏజెంట్ ఉంటుంది. కాబట్టి ముడత కణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనె చర్మానికి తేమను అందిస్తుంది. ఇవన్నీ కలిపి మెడను మృదువుగా హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. అలాగే మురికిని కూడా తొలగిస్తాయి. షాంపూ అదనపు నూనెను మురికిని తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.
పైన చెప్పిన చిట్కా నే కాదు ఇంకా మరెన్నో చిట్కాలు ద్వారా మెడను మెరిపించుకోవచ్చు. ఇందుకోసం మీరు ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకోండి. ఆ రసంలో పావు స్పూను శెనగపిండి వేసి ఆ పేస్టును మెడ ప్రాంతంలో స్క్రబ్ చేయండి. పావుగంట పాటు వదిలేయండి. ఆ తర్వాత శుభ్రం చేసుకోండి.
అలాగే ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కూడా మెడ చుట్టూ రాసుకోండి. పావుగంట పాటు అలా వదిలేస్తే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవచ్చు.
పచ్చిపాలు, చిటికెడు పసుపు కూడా కలిపి నల్లటి మెడ ప్రాంతంలో అప్లై చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చెంచా పెరుగు, పావు స్పూను పసుపు, రెండు మూడు చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దాన్ని మెడపై బాగా స్క్రబ్ చేయాలి. ఒక అరగంట తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇది మెడను అందంగా మారుస్తుంది.
అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ముఖాన్ని ఎలా రుద్దుతారో.. మెడ ప్రాంతాన్ని కూడా బాగా రుద్దండి. అలాగే స్నానం చేశాక మాయిశ్చరైజర్ ను మెడకు కూడా రాయండి. ఎక్కువ సేపు ఎండలో ఉండాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్ ను మెడకు అప్లై చేయండి. ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగేందుకు ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మెడ దగ్గర చర్మాన్ని హైడ్రెటెడ్ గా ఉంచేందుకు పనికొస్తాయి.