ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనపై జోకులు పేలుతున్నాయి. ఈ సెటైర్లు వినిపిస్తోంది కూడా పాక్ నుంచే కావడం మరింత విశేషం. అమెరికా పర్యటనలో వారిద్దరూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలసి ఉన్న ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఆ ఫొటో పైనే ఇప్పుడు జోకులు పేలుతున్నాయి.
ఆ ఫొటోలో ఏముంది?
రేర్ ఎర్త్ మెటల్స్, ఆయిల్ నిక్షేపాల వెలికితీత విషయంలో పాకిస్తాన్ తో అమెరికా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో ట్రంప్ కొడుకుకి చెందిన కంపెనీది ప్రధాన భాగస్వామ్యం కావడం విశేషం. అయితే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ బలూచిస్తాన్ ప్రాంతానివి కావడం, ఆ ప్రాంతంపై పాకిస్తాన్ కి హక్కు లేదని స్థానిక ప్రభుత్వం స్పష్టం చేయడం మరో విశేషం. ఈ వివాదం కొనసాగుతుండగానే.. పాకిస్తాన్ నుంచే సెటైర్లు మొదలయ్యాయి. ఇటీవల వాషింట్గన్ పర్యటనలో డొనాల్డ్ ట్రంప్ ని కలసిన సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఒక సూట్ కేసులో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ ని ఆయనకు చూపిస్తున్నారు. ఆ పక్కనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ సంఘటనను ఆసక్తిగా గమనిస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంపై పాకిస్తాన్ సెనెటర్ ఐమల్ వలీ తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఏ అధికారంతో ఆర్మీ చీఫ్ ఇలా డీల్స్ కుదుర్చుకుంటున్నారని మండిపడ్డారు.
ఆయనో మేనేజర్, ఈయనో సేల్స్ మెన్..
ట్రంప్ కి రేర్ ఎర్త్ మెటల్స్ ని చూపిస్తున్న ఆసిమ్ మునీర్ ఒక సేల్స్ మెన్ లాగా ఉన్నారని, పక్కనే ఆ సీన్ ని ఆసక్తికరంగా గమనిస్తున్న ప్రధాని షోరూమ్ మేనేజర్ లాగా చూస్తున్నారని జోక్ చేశారు ఐమల్ వలీ. వారిద్దరి వ్యవహారం అలాగే ఉందన్నారు. వైట్ హౌస్ ఫొటోగ్రాఫర్ ఒకరు ఆసిమ్ మునీర్ ఒక చెక్క సూట్ కేస్ లో రేర్ ఎర్త్ మెటల్స్ ని తీసుకెళ్తున్న ఫొటో తీశారని.. అసలు వాటిని తీసుకుని వెళ్లడానికి ఆర్మీ చీఫ్ కి ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు ఐమల్ వలీ. ఆయన ఆర్మీ చీఫ్ లాగా లేరని, సేల్స్ చీఫ్ గా ఉన్నారని సెటైర్లు పేల్చారు. వీరిద్దరినీ నమ్మి డీల్ కుదుర్చుకున్న అమెరికా ప్రెసిడెంట్ మరింత అమాయకంగా కనపడుతున్నారనే జోకులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: పహల్గాం ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్
ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికాతో పాకిస్తాన్ అంటకాగుతోంది. అటు అమెరికా కూడా పాకిస్తాన్ పై ఎక్కడలేని ప్రేమ చూపిస్తోంది. ఇదంతా కేవలం డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం అనుకుంటే పొరపాటే. అంతకు మించి ట్రంప్ ఆ దేశం నుంచి ఏదో ఆశిస్తున్నారు. అయితే ట్రంప్ ఆశిస్తున్నట్టుగా పాకిస్తాన్ లో ఖనిజ నిక్షేపాలేవీ లేవని, అదంతా డూప్ షాట్ అని కూడా వార్తలు వినపడుతున్నాయి. అయితే ఆపరేష్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధాని.. వరుసగా అమెరికా పర్యటనలు చేస్తున్నారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలను బలపరచుకుంటున్నారు. ఇటు భారత్ పై అమెరికా వాణిజ్య సుంకాలతో విరుచుకుపడుతోంది.