Fatty Liver Disease: కాలేయం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి, జీర్ణక్రియ నుంచి నిర్విషీకరణ వరకు 500 కంటే ఎక్కువ విధులను ఇది నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటే.. ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ అవయవాన్ని తీవ్రమైన ప్రమాదంలో పడేస్తున్నాయి. నేడు.. ఇండియాలో దాదాపు ముగ్గురిలో ఒకరు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అనే తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
ఫ్యాటీ లివర్ సమస్య తక్కువ మద్యం సేవించే లేదా మద్యం సేవించని వ్యక్తులలో కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. చాలా ఆందోళనకరంగా.. ఇది ఒక “నిశ్శబ్ద” వ్యాధిలా వ్యాపిస్తోంది. దీని ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. గుర్తించే సమయానికి, చాలా వరకు కాలేయం పాడవుతుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలను గురించడం ఎంతైనా అవసరం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రారంభ లక్షణాలు ఏంటి ?
ఫ్యాటీ లివర్ యొక్క ప్రారంభ లక్షణాలు చాలా సాధారణం. అంతే కాకుండా అస్పష్టంగా కూడా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి తీవ్రమైన అలసట, బలహీనత.
కొంతమందికి కుడి ఎగువ ఉదరంలో తేలికపాటి నొప్పి లేదా బరువు, తిన్న తర్వాత ఉబ్బరం కూడా అనిపించవచ్చు. ఈ లక్షణాలు కొనసాగితే.. వాటిని సాధారణమైనవిగా నిర్లక్ష్యం చేయకూడదు. డాక్టర్‌ని సంప్రదించాలి.
ఎవరికి ఎక్కువ ప్రమాదం:
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రధానంగా జీవనశైలికి సంబంధించిన వ్యాధి. ఊబకాయం లేదా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి ఫ్యాటీ లివర్ సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అదనంగా.. టైప్ 2 డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారికి ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
ఫ్యాటీ లివర్‌కు వెంటనే చికిత్స చేయకపోతే.. అది తీవ్రంగా మారవచ్చు. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది. ఈ పరిస్థితిని NASH (నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్) అని పిలుస్తారు.
ఈ వాపు క్రమంగా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఫైబ్రోసిస్ లేదా సిర్రోసిస్ (కాలేయం కుంచించుకుపోవడం) వంటివి కలిగిస్తుంది. మరి కొన్ని సందర్భాల్లో.. ఇది కాలేయ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది.
Also Read: ఒత్తిడితో బాధపడుతున్నారా ? ఈ చిట్కాలు పాటించండి చాలు !
దీన్ని ఎలా నివారించాలి ?
ఇది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. కాబట్టి దీనిని నివారించవచ్చు కూడా. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం దీనిని నివారించడానికి ఉత్తమ మార్గం. వేయించిన.. తియ్యటి, ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు , తృణధాన్యాలు చేర్చండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. మీకు డయాబెటిస్ లేదా అధిక కొలెస్ట్రాల్ ఉంటే.. దానిని నియంత్రణలో ఉంచండి. ఈ సాధారణ దశలు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయి.