Rabi Crops MSP Hike: పండుగ పూట రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశంలో అన్నదాతలకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంపునకు ఆమోదం తెలిపారు.
2026-27 మార్కెటింగ్ సీజన్‌కు అన్ని రబీ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను (MSP) పెంచింది. కుసుమ పంటకు అత్యధిక ధరను పెంచారు. కుసుమ క్వింటాలుకు 600 రూపాయలు, ఆ తరువాత పప్పు(మసూర్) క్వింటాలుకు 300 రూపాయల ధర పెంచారు. క్వింటాలుకు ఆవాలు రూ. 250, శనగ రూ.225, బార్లీ రూ.170, గోధుమలు రూ.160 పెంచారు.
కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు ఈ వివరాలు వివరించారు. ఎంఎస్పీ పెంపుదలతో రైతులకు మరింత లాభదాయకం అవుతుందన్నారు. దేశీయ పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడం, స్వయం సమృద్ధిని సాధించడం లక్ష్యంగా ‘మిషన్ ఫర్ ఆత్మ నిర్భరత ఇన్ పల్సస్’ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ మిషన్ 2025-26 నుండి 2030-31 వరకు ఆరు సంవత్సరాలలో 11,440 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో అమలు చేయనున్నారు. 2030-31 నాటికి పప్పుధాన్యాల మిషన్ ఉత్పత్తిని 350 లక్షల టన్నులకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని అశ్విని వైష్ణవ్ అన్నారు.
ఈ మిషన్ లో రైతులకు మెరుగైన విత్తనాలు అందించడం, పంట కోత తర్వాత మౌలిక సదుపాయాలు కల్పన, హామీ ఇచ్చిన మేరకు పంట సేకరణ చేపట్టనున్నారు. దీంతో రెండు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. అధిక ఉత్పత్తి, తెగుళ్లు, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా పప్పుధాన్యాలను అభివృద్ధి చేయడంపై కేంద్రం పెట్టిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
గోధుమ మద్దతు ధరలో 6.59 శాతం పెరిగింది. గత సీజన్‌లో గోధుమ ఎంఎస్పీ రూ.2,425 ఉండగా, కొత్తగా 2026-27 మార్కెటింగ్ ఏడాదికి రూ.2,585గా నిర్ణయించారు. గోధుమ ప్రధానంగా రబీ పంటగా కావడంతో మద్దతు ధర పెంపు రైతులకు భారీ ఊరట నిస్తుంది.
ఆరు రబీ పంటలకు ఎంఎస్పీ పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026-27 రబీ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం ధాన్యం కొనుగోలు పరిమాణం 297 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. ప్రతిపాదిత ఎంఎస్పీ ఆధారంగా రైతులకు రూ.84,263 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
గోధుమ ఉత్పత్తిలో ప్రభుత్వం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది. 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి 119 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 సంవత్సరంలో 117.5 మిలియన్ టన్నుల గోధుమలు ఉత్పత్తి అయ్యాయి.