Wine Vs Beer Vs Spirit: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ తాజాగా జరిగిన ఒక పరిశోధన మాత్రం మద్యపానం గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సుమారు 3.4 లక్షల మందిపై 13 ఏళ్ల పాటు సాగిన ఈ అధ్యయనం ప్రకారం.. అన్ని రకాల మద్యపానాలు ఆరోగ్యంపై ఒకే రకమైన ప్రభావాన్ని చూపవు. ముఖ్యంగా బీర్, ఇతర రకాల కంటే మితంగా వైన్ తాగే వారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే.. ఇది కేవలం తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే వర్తిస్తుందని, అధికంగా తాగితే ప్రాణాపాయం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
వైన్‌తో గుండె ఆరోగ్యం: కొత్త పరిశోధన ఏం చెబుతోంది?
బ్రిటన్ దేశంలోని బయోబ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వ్యక్తుల ఆహారపు అలవాట్లు , వారు తీసుకునే మద్యపాన రకాలను సుదీర్ఘ కాలం పాటు గమనించారు. ఈ విశ్లేషణలో తేలింది ఏమిటంటే.. బీర్ లేదా ఇతర ఘాటైన మద్యపానాలు తాగే వారి కంటే, తక్కువగా వైన్ తాగే వారిలో మరణాల రేటు తక్కువగా ఉంది. ముఖ్యంగా గుండె సంబంధిత మరణాల ముప్పు వైన్ తాగే వారిలో 21 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. అదే సమయంలో ఇతర రకాలను తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ.. మరణాల ముప్పు 9 శాతం ఎక్కువగా ఉందని తేలింది.
ధాన్యాలు లేదా పండ్లను పులియబెట్టి, మరగించి వడగట్టడం ద్వారా తయారు చేసే అధిక ఆల్కహాల్ కలిగిన ఘాటైన డ్రింక్‌ను ‘స్పిరిట్స్’ అంటారు. వీటిలో ముఖ్యంగా వోడ్కా, జిన్, రమ్, విస్కీ, టెకిలా, బ్రాందీ వంటి రకాలు ఉంటాయి. వైన్ , బీర్‌తో పోలిస్తే వీటిలో మత్తు కలిగించే ఆల్కహాల్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగ తాగితే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది
వైన్ ఎందుకు మేలు చేస్తుంది?
వైన్ తీసుకునే వారిలో ముప్పు తక్కువగా ఉండటానికి కేవలం వైన్ ఒకటే కారణం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వైన్‌లో ఉండే మొక్కల సంబంధిత పోషకాలు, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు గుండెకు మేలు చేస్తాయి. అంతేకాకుండా.. వైన్ తాగే వారు సాధారణంగా మంచి ఆహారం తీసుకుంటారని అంతే కాకుండా వారి వైఫ్ స్టైల్ కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. దీనికి విరుద్ధంగా బీర్ లేదా ఇతర రకాలు తాగే వారిలో ఆహార నియమాలు అంతగా ఉండవని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
అధిక మోతాదుతో ముప్పు:
పరిశోధనలో తేలిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఏ రకమైన మద్యపానం అయినా సరే, అది మోతాదు మించితే తీవ్ర నష్టం కలిగిస్తుంది. పరిమితికి మంచి తాగే వారిలో మరణించే అవకాశం 24 శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 36 శాతం, గుండె జబ్బుల ముప్పు 14 శాతం పెరుగుతుందని ఈ అధ్యయనం హెచ్చరించింది. అంటే మద్యాపాన రకంతో సంబంధం లేకుండా.. మోతాదు పెరిగితే అది ప్రాణాంతకమవుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మద్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మెదడు ఆరోగ్యంపై ప్రభావం:
కేవలం గుండె మాత్రమే కాకుండా.. మెదడుపై కూడా మద్యపానం తీవ్ర ప్రభావం చూపుతుంది. గతంలో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం.. క్రమం తప్పకుండా మద్యం తాగడం వల్ల మెదడు పరిమాణం తగ్గే అవకాశం ఉంది. ఇది జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి అంతే కాకుండా మతిమరుపు వ్యాధికి దారితీస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మద్యం తీసుకున్నా సరే, అది మెదడు పని తీరులో మార్పులను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మద్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
Also Read: మీ గుండె పదిలంగా.. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే మార్గాలివే!
మద్యపానం విషయంలో రకాన్ని బట్టి ప్రభావాలు మారుతున్నా, అది పూర్తిగా సురక్షితం కాదు. వైన్ వల్ల కొంత మేలు జరుగుతున్నట్లు అనిపించినా, అది ఆ వ్యక్తుల లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం వైన్ మీద ఆధారపడకుండా, సరైన వ్యాయామం , పౌష్టికాహారం తీసుకోవడం బెస్ట్. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, అందుకే జాగ్రత్తగా ఉండటం మేలు.
గమనిక: ఈ ఆర్టికల్‌కు సంబంధించిన వివరాలు బ్రిటన్ బయోబ్యాంక్ (UK Biobank) నిర్వహించిన తాజా పరిశోధన , అంతర్జాతీయ ఆరోగ్య నివేదికల ఆధారంగా మాత్రమే అందించడమైంది. ఏదైనా ఆరోగ్య సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా నిపుణులను సంప్రదించాలి.