Nighttime Cough Causes: రోజంతా హాయిగా ఉన్నా, రాత్రి పడుకోగానే దగ్గు మొదలవుతుందా? గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపిస్తూ నిద్రకు ఆటంకం కలుగుతోందా? అయితే ఇది కేవలం సాధారణ జలుబు మాత్రమే కాకపోవచ్చు. రాత్రిVపూట వచ్చే దగ్గు వెనక రకరకాల ఆరోగ్య సమస్యలు దాగి ఉంటాయి. వాతావరణ మార్పుల నుంచి గ్యాస్ సమస్యల వరకు దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అసలు రాత్రి పూట దగ్గు ఎందుకు వస్తుంది? మన శరీరం ఇచ్చే సంకేతాలేంటి? దీనిని ఎలా అధిగమించాలో వివరంగా తెలుసుకుందాం.
రాత్రిపూట దగ్గు ఎందుకు వస్తుంది?
పగటిపూట మనల్ని ఇబ్బంది పెట్టని దగ్గు, రాత్రి పడుకోగానే ఎందుకు తీవ్రమవుతుంది అనేది చాలా మందిని వేధించే ప్రశ్న. మనం నిటారుగా ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల శ్లేష్మం కిందికి వెళ్తుంది. కానీ పడుకున్నప్పుడు అది గొంతు వెనక భాగంలో చేరి దగ్గును ప్రేరేపిస్తుంది.
ప్రధాన కారణాలు:
1. పోస్ట్ నాసల్ డ్రిప్ :
జలుబు, అలర్జీ లేదా సైనస్ సమస్యలు ఉన్నప్పుడు ముక్కు నుంచి శ్లేష్మం గొంతులోకి జారుతుంది. పడుకున్నప్పుడు ఇది గొంతును ఇరిటేట్ చేసి దగ్గుకు కారణమవుతుంది. గొంతు గరగరగా అనిపించడం దీని ముఖ్య లక్షణం.
2. యాసిడ్ రిఫ్లక్స్ :
చాలా మంది దగ్గు అంటే ఊపిరితిత్తుల సమస్య అనుకుంటారు. కానీ కడుపులో ఉన్న యాసిడ్ వల్ల కూడా దగ్గు వస్తుంది. పడుకున్నప్పుడు కడుపులోని ఆమ్లాలు ఆహారనాళం ద్వారా గొంతులోకి ప్రవహిస్తాయి. దీని వల్ల పొడి దగ్గు రావడం, గొంతు మంట కలగడం జరుగుతుంది. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
3. ఆస్తమా :
ఆస్తమా ఉన్నవారిలో రాత్రిపూట శ్వాసనాళాలు మరింత సున్నితంగా మారతాయి. రాత్రిపూట గాలిలో తేమ పెరగడం లేదా చల్లని గాలి వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి, దగ్గు తీవ్రమవుతుంది. దీనిని ‘నోక్టర్నల్ ఆస్తమా’ అంటారు.
4. గాలిలో అలర్జీ కారకాలు:
బెడ్‌రూమ్‌లో ఉండే దుమ్ము , పెంపుడు జంతువుల వెంట్రుకలు, పాత పరుపుల వల్ల కలిగే అలర్జీలు రాత్రి పూట దగ్గును ప్రేరేపిస్తాయి. కిటికీలు తెరిచి ఉంచినప్పుడు వచ్చే పరాగ రేణువులు కూడా సమస్యను పెంచుతాయి.
5. ఇతర ఆరోగ్య సమస్యలు:
కొన్ని సందర్భాల్లో.. గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు కూడా రాత్రిపూట ఊపిరి ఆడకపోవడం, దగ్గు రావడం జరుగుతుంది. అలాగే అధిక రక్తపోటు కోసం వాడే కొన్ని మందుల వల్ల కూడా పొడి దగ్గు రావచ్చు.
ఉపశమనం పొందే మార్గాలు:
తల కింద దిండు: పడుకునేటప్పుడు తల భాగం కాస్త ఎత్తులో ఉండేలా చూసుకోండి. దీని వల్ల శ్లేష్మం గొంతులో చేరకుండా ఉంటుంది.
గోరువెచ్చని నీరు: నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం లేదా కొద్దిగా తేనె కలిపిన నీరు తాగడం వల్ల గొంతు ఉపశమనం పొందుతుంది.
ఆవిరి పట్టడం: పడుకునే ముందు వేడి నీటి ఆవిరి పట్టడం వల్ల శ్వాసనాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి.
ఆహార నియమాలు: నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం చేయండి. దీని వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య తగ్గుతుంది.
డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి?
దగ్గు వారం రోజులకు పైగా తగ్గకపోయినా.. దగ్గుతో పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా దగ్గులో రక్తం పడుతున్నట్లయితే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.