Watermelon: ఎండలు మండిపోతున్న వేళ, దాహాన్ని తీర్చి శరీరాన్ని చల్లబరిచే పండ్లలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో 92 శాతం నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి మనల్ని రక్షిస్తుంది. విటమిన్ ఎ, సి , పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే.. నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్లుగానే.. పుచ్చకాయ అందరికీ మేలు చేయదు. కొన్నిఆరోగ్య సమస్యలు ఉన్నవారు పుచ్చకాయను అతిగా తినడం మంచిది కాదు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ – ఎప్పుడు, ఎవరికి ప్రమాదం?
ప్రతి ఆహార పదార్థానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా కింద పేర్కొన్న సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
1. మధుమేహం ఉన్నవారు:
పుచ్చకాయలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ సుమారు 72 వరకు ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. కాబట్టి.. డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయను పరిమితంగా తీసుకోవాలి లేదా డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలి. అతిగా తింటే.. ఇన్సులిన్ స్థాయిలలో అకస్మాత్తుగా మార్పులు వచ్చే అవకాశం ఉంది.
2. కిడ్నీ సమస్యలు ఉన్నవారు:
పుచ్చకాయలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. సాధారణంగా పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచిదే. కానీ, కిడ్నీలు సరిగ్గా పనిచేయని వారికి శరీరంలోని అదనపు పొటాషియంను బయటకు పంపడం కష్టమవుతుంది. దీని వల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి ‘హైపర్ కలేమియా’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గుండె లయ తప్పడానికి దారితీస్తుంది.
3. జీర్ణక్రియ సమస్యలు:
పుచ్చకాయలో ‘లైకోపిన్’ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండెకు మంచిదే అయినప్పటికీ.. కొందరిలో ఇది గ్యాస్, ఉబ్బరం, విరేచనాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నవారు పుచ్చకాయ తింటే.. కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇందులో ఉండే ‘సార్బిటాల్’ అనే చక్కెర పదార్థం విరేచనాలకు దారితీస్తుంది.
4. గర్భిణీలు:
గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల చాలా మందికి ‘జెస్టేషనల్ డయాబెటిస్’ వచ్చే అవకాశం ఉంటుంది. పుచ్చకాయ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది కాబట్టి.. గర్భిణీలు దీనిని అతిగా తీసుకోకూడదు. ఇది తల్లి ఆరోగ్యంతో పాటు శిశువుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
5. ఆస్తమా లేదా అలర్జీలు:
కొందరికి పుచ్చకాయ తిన్న వెంటనే గొంతులో దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. దీనిని ‘లాటెక్స్ అలర్జీ’ ఉన్నవారిలో ఎక్కువగా గమనించవచ్చు.
తినేటప్పుడు పాటించాల్సిన నియమాలు:
రాత్రి పూట వద్దు: పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల రాత్రిపూట తింటే తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అంతే కాకుండా రాత్రి పూట జీర్ణక్రియ మందగిస్తుంది.
నీళ్లు తాగొద్దు: పుచ్చకాయ తిన్న వెంటనే.. నీళ్లు తాగడం వల్ల జీర్ణరసాలు పలచబడి అజీర్తికి దారి తీస్తుంది.
పరిమితి : ఆరోగ్యవంతులు కూడా రోజుకు 200 నుంచి 300 గ్రాముల కంటే ఎక్కువ పుచ్చకాయ తీసుకోకపోవడం మంచిది.
పుచ్చకాయ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ.. శరీర తత్వాన్ని బట్టి అది స్పందిస్తుంది. పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ ని సంప్రదించి, ఎంత మోతాదులో తినాలో తెలుసుకోవడం మంచిది.