Yellow vs Red Watermelon: ఎండాకాలంలో పుచ్చకాయలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎండ నుంచి రక్షణ పొందేలా పుచ్చకాయలో.. నీరు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మనం మార్కెట్‌కు వెళ్లినప్పుడుల్లా మనకు ఎక్కువగా ఎర్రటి పుచ్చకాయలు మాత్రమే దర్శనమిస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో పసుపు రంగు పుచ్చకాయలు కూడా సందడి చేస్తున్నాయి. ఇవి చూడగానే చాలామంది ‘అమ్మో.. వీటికి ఏదైనా ఇంజెక్షన్లు ఇచ్చి పండించారా? లేక ఇది హైబ్రిడ్ కాయా?’ అని భయపడుతుంటారు. కానీ నిజానికి ఇవి కూడా ప్రకృతి సిద్ధంగా లభించేవే. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో, ఆయా రంగుల వెనుక ఉన్న సీక్రెంట్ ఏంటో తెలుసుకుందాం.
ఎరుపు రంగు పుచ్చకాయకు ఆ రంగు రావడానికి అందులో ఉండే ‘లైకోపీన్’ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కారణం. అదే పసుపు పుచ్చకాయలో లైకోపీన్ ఉండదు. దానికి బదులుగా ‘బీటా కెరోటిన్’ అనే పోషకం ఉంటుంది. సాధారణంగా క్యారెట్లకు పసుపు లేదా నారింజ రంగును ఇచ్చే ఈ బీటా కెరోటిన్ వల్లే ఈ పుచ్చకాయలు కూడా అలా మెరిసిపోతుంటాయి. ఇక రుచి విషయానికి వస్తే.. ఎర్రటి కాయ కంటే పసుపు రంగుది కొంచెం ఎక్కువ తియ్యగా ఉంటుంది.
Also Read: పసుపు పుచ్చకాయలకు పెరిగిన డిమాండ్.. బెనిఫిట్స్ తెలిస్తే మీరూ వదలరు!
మనం రెగ్యులర్‌గా తినే ఎర్రటి పుచ్చకాయలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే ‘సిట్రుల్లైన్’ అనే అమైనో ఆమ్లం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఎండలో ఎక్కువగా తిరిగే వారికి, వ్యాయామం చేసేవారికి వచ్చే కండరాల నొప్పులను తగ్గించడంలో ఎర్రటి పుచ్చకాయ భేష్‌గా పనిచేస్తుంది. ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండాలన్నా దీనిని తినవచ్చు.
పసుపు రంగు పుచ్చకాయలో విటమిన్ ఏ (బీటా కెరోటిన్) పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. చర్మం నిగనిగలాడాలని కోరుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు దీనిని చాలామంది ఇష్టంగా తింటున్నారు.
నిజానికి ఈ రెండింటిలోనూ 90 శాతం పైగా నీరే ఉంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడంలో రెండూ సమానంగానే పనిచేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే.. ఎరుపు రంగు పుచ్చకాయను, కంటి చూపు మెరుగుపడాలంటే పసుపు రంగు పుచ్చకాయను ఎంచుకోవచ్చు. వీలైతే అప్పుడప్పుడూ రెండు రకాలను తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు అందుతాయి. అయితే పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని, రాత్రిపూట ఎక్కువగా తీసుకోకూడదని గుర్తుంచుకోండి. పగటిపూట తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది.
Also Read: మనుషులకే కాదు.. ఈ జంతువులకూ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్!