Rose Petals For Skin: అందంగా విరబూసిన రోజా పూలంటే నచ్చని వాళ్లుంటారా చెప్పండి! అందుకే గులాబీ పువ్వులను కవులు అందానికి మారుపేరుగా చెబుతుంటారు. గులాబీ పువ్వుల అంత అందంగా ఉన్నావని అంటుంటారు. అయితే, రోజా పూలను వివిధ రకాల సౌందర్య సాధన ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తారు. అయితే ఆయా ఉత్పత్తులు అన్నీ కృత్రిమమైనవి. వాటిల్లో రసాయనాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ ఉత్పత్తులను వాడటం కంటే.. సృష్టి నుంచి దొరికే గులాబీ పువ్వులను నేరుగా వాడితే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గులాబీ పువ్వులతో కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ముఖంపై ఉండే ముడతలు, మొటిమలు, మచ్చలు ఇట్లే పారిపోతాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
కొన్ని రోజా పువ్వుల రెక్కలను 48 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. దీంతో ఆ రెక్కల్లోని సారం నీటిలోకి చేరుతుంది. దీనివల్ల ఇంట్లోనే నేచురల్ రోజ్ వాటర్ రెడీ అయిపోతుంది. ఈ వాటర్‌ను గాజు సీసాలో నిల్వ చేసుకుంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ప్రతి రోజూ పడుకునే ముందు ముఖానికి రాసి మరుసటి రోజు ఉదయం కడిగేసుకుంటే సరి. ఇది మన చర్మానికి మంచి టోనర్‌లా పనిచేస్తుంది. ముఖంపై ఉండే మృత కణాలు తొలగిపోయి.. చర్మానికి కాంతి లభిస్తుంది. ఈ రోజ్ వాటర్‌లో కాస్త గంధం, కొద్దిగా తేనెను వేసి కలిపి ఫేస్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి.
Read Also: దానిమ్మతో అదిరే అందం.. ఇలా వాడారంటే దగ దగా మెరిసిపోవాల్సిందే!
ఇంట్లో తయారు చేసుకున్న నేచురల్ రోజ్ వాటర్‌లో దూది ఉండల్ని నానబెట్టి.. వాటిని కళ్ల మీద ఉంచుకోవాలి. అలా పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు చేయాలి. దీనివల్ల కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు తొలగిపోతాయి. అలాగే పొడి చర్మం ఉన్నవారికి గులాబీ పువ్వుల రెక్కలు ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి కావల్సిన తేమను అందించి చర్మం మృదువుగా మారేలా చేస్తాయి. శీతాకాలంలో గులాబీ పువ్వుల్లోని సహజసిద్ధమైన నూనెలు చర్మాన్ని పొడిబారకుండా చూస్తాయి. దీని కోసం గులాబీ రెక్కలను మెత్తని పేస్ట్‌లా చేసుకుని, ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం ముఖం కాంతివంతంగా నిగారిస్తుంది.
రోజా పువ్వుల రెక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మ సౌందర్యం పెరుగుతుంది. అలాగే గులాబీ పువ్వుల రెక్కలతో సహజసిద్ధమైన సన్ స్క్రీన్ లోషన్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. దీని కోసం గులాబీ రెక్కలను మెత్తని పేస్ట్‌లా చేసుకుని, అందులో కీరదోస రసం, గ్లిజరిన్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిల్వ చేసుకుని ముఖం, మెడ, కంటి కింది భాగాల్లో లోషన్ మాదిరి అప్లై చేసుకోవచ్చు. ఇది సహజసిద్ధమైన సన్ స్క్రీన్ లోషన్ మాదిరి పనిచేస్తుంది.
Read Also: పింక్ సాల్ట్ కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో తెలిస్తే మీరూ కొంటారు!