Blood test predicts lung cancer early: క్యాన్సర్ పేరు వినగానే గుండెల్లో వణుకు పుడుతుంది.. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ (ఊపిరితిత్తుల క్యాన్సర్) చాలా సైలెంట్‌గా వచ్చి ప్రాణాలు తీసేస్తుంది. ఇది ముదిరిన తర్వాతే బయటపడటం వల్ల ట్రీట్‌మెంట్ కూడా కష్టంగా మారుతోంది. కానీ ఇప్పుడు మెడికల్ హిస్టరీలోనే ఒక అద్భుతమైన బ్రేక్‌థ్రూ రికార్డ్ అయింది. లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కొన్ని సంవత్సరాల ముందే పసిగట్టే ఒక సరికొత్త బ్లడ్ టెస్ట్‌ను సైంటిస్టులు కనుగొన్నారు. కేవలం ఒక చిన్న రక్త పరీక్షతో ప్రాణాంతక క్యాన్సర్‌కు ముందే బ్రేక్ వేయవచ్చని లండన్‌కు చెందిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
లంగ్ క్యాన్సర్‌ను ముందే పసిగట్టే ’14-ప్రోటీన్ సిగ్నేచర్’:
లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రముఖ సైంటిస్ట్ చార్లెస్ స్వాంటన్ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతాన్ని సాధించింది. దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు ‘సెల్’ (Cell) జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. శాస్త్రవేత్తలు రక్తంలోని ప్లాస్మాను పరీక్షించి.. అందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన మార్పులను గమనించారు. మన బాడీలో క్యాన్సర్ కణాలు పెరగడానికి ముందే రక్తంలో కొన్ని ప్రోటీన్లలో మార్పులు వస్తాయి.
ఈ రీసెర్చ్‌లో భాగంగా సైంటిస్టులు “14-ప్రోటీన్ సిగ్నేచర్” (14-Protein Signature) అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ల సమూహాన్ని గుర్తించారు. రక్తంలో ఈ 14 ప్రోటీన్ల హెచ్చుతగ్గులను బట్టి.. రాబోయే కొన్నేళ్లలో ఆ వ్యక్తికి లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందో లేదో ముందే చెప్పేయవచ్చు.
ఇది ఒక రకంగా ‘లిక్విడ్ బయాప్సీ’లాంటిదే. అంటే ఎలాంటి సర్జరీ లేదా ముక్క పరీక్ష అవసరం లేకుండా.. కేవలం ప్లాస్మా ప్రొటెమిక్స్ ప్రొఫైల్ ద్వారా రియల్-టైమ్‌లో మన ఊపిరితిత్తుల ఆరోగ్యం ఎలా ఉందో ఈ బ్లడ్ టెస్ట్ స్నాప్‌షాట్ తీసి చూపిస్తుంది.
ఈ టెస్ట్ ఎందుకు ముఖ్యం?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 25 లక్షల కొత్త లంగ్ క్యాన్సర్ కేసులు నమోదవుతుంటే.. దాదాపు 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పొగతాగడం, విపరీతమైన వాయు కాలుష్యం, కెమికల్స్ ఎక్స్‌పోజర్ వల్ల ఈ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకవేళ క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే నివారణ చాలా ఈజీ అవుతుంది.
ప్రస్తుతానికి ఈ రీసెర్చ్‌ను యూకే, యూఎస్ , తూర్పు ఆసియా దేశాల ప్రజలపైనే ప్రయోగించారు. ఈ 14-ప్రోటీన్ల ఫార్ములా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రజలకు సెట్ అవుతుందా లేదా అనేది ఇంకాస్త క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. ఇది పూర్తిగా సక్సెస్ అయితే.. అతి తక్కువ ఖర్చుతో లంగ్ క్యాన్సర్‌ను ముందే గుర్తించే డయాగ్నోస్టిక్ బ్లడ్ టెస్ట్ కిట్లు మార్కెట్లోకి వస్తాయి. మెడికల్ రంగంలో ఇదొక అద్భుతం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.