Over Thinking: మన రోజువారీ జీవితంలో చిన్నచిన్న సమస్యలు ఎదురుకావడం సహజమే. వాటి గురించి కాసేపు ఆలోచించడం తప్పు కాదు. కానీ అదే పనిగా ఒక చిన్న విషయం చుట్టూనే మనసు తిరుగుతుంటే, అది మనకు తెలియకుండానే పెద్ద భారంగా మారుతుంది. అతి ఆలోచనల వల్ల మన మూడ్ దెబ్బతినడమే కాకుండా.. శరీరం మీద కూడా ప్రభావం పడుతుంది. ఒత్తిడి పెరగడం, ఆందోళన చెందడం, చిరాకుగా అనిపించడం.. ఇలా క్రమంగా మానసిక ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఓవర్ థింకింగ్‌ను కంట్రోల్ చేయడం అసాధ్యమేమీ కాదు. రోజూ పాటించగల కొన్ని చిన్న అలవాట్లు మనసుకు తక్షణ ఉపశమనం ఇస్తాయి.
మీ మెదడులో తిరుగుతున్న ఆలోచనలు ఆందోళనగా మారక ముందే.. దానిని ఏదైనా కాగితం మీద రాయండి. ఇలా చేయడం వల్ల మనసు కాస్త తేలిక పడుతుంది. మీరు పేపరు మీద రాసుకన్న సమస్యను చూస్తున్నప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని మీకే అనిపిస్తుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అని స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం దొరకదు. వెంటనే పరిష్కరించాల్సినవి ఏవి? కొంత సమయం తీసుకునేవి ఏవి? అని మీ ఆలోచనలను వేరు చేస్తే.. మనసుపై పడ్డ ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. అన్నింటినీ ఒకేసారి మోయాల్సిన అవసరం లేదని మనసుకు అర్థమవుతుంది.
మీ బుర్రలో ఆలోచనలు ఎక్కువైపోతున్నాయని అనిపించినప్పుడు.. వెంటనే మీరు కూర్చున్న ప్రదేశం నుంచి లేవాలి. కొన్ని నిమిషాలు నడవటం, ఇష్టమైన పాట వినడం, లేదా లోతుగా శ్వాస తీసుకోవడం వంటి చిన్న బ్రేక్స్ కూడా మనసును రీఫ్రెష్ చేస్తాయి.
రోజుకు 5 నుంచి 10 నిమిషాలు అయినా ధ్యానం చేయడం చాలా ఉపయోగపడుతుంది. ఇది గతం గురించి గానీ, భవిష్యత్తు గురించి గానీ కాకుండా.. ప్రస్తుతంపై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది. దాంతో అక్కర్లేని ఆలోచనలను అన్నీ మన నుంచి పారిపోతాయి.
ప్రతి సమస్యను మనమే పరిష్కరించలేం. కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. అలాంటి వాటిని అంగీకరించి.. ‘ఇది ఇప్పుడు నా చేతిలో లేదు’ అని మనసుకు సర్ధి చెప్పుకోవడం వల్ల ఆలోచనల భారం తగ్గిపోతుంది.
ముఖ్యంగా చిన్న విషయానికే పదే పదే ఆలోచించడం మానుకోవాలి. ఎందుకంటే.. ఇది ఆలోచనల వరకే ఆగదు.. ఆందోళనకు దారితీస్తుంది. అది దీర్ఘకాలంలో మన ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి.. ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలంటే.. పైన చెప్పిన ఈ సులభమైన మార్గాలను అలవాటు చేసుకుంటే మనసుకు ప్రశాంతతే కాదు.. ఒత్తిడి కూడా తగ్గుతుంది.