ఇంట్లో మొక్కలు పెంచడం అంటే చాలా మందికి అలవాటు. కొందరు ఇంటిని అందంగా చూపించడానికి పెంచుతారు, మరికొందరు హాబీగా చూసుకుంటారు. కానీ కొన్ని మొక్కలు అందం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. అలాంటి మొక్కల్లో స్నేక్ ప్లాంట్ ఒకటి. ఇది ఎక్కడైనా సులభంగా పెంచుకోవచ్చు. అందుకే ప్రతి ఇంట్లో ఈ మొక్క ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో కాలుష్యం ఎక్కువగా ఉండే చోట ఈ మొక్క ఎంతో ఉపయోగకరం.
స్నేక్ ప్లాంట్ తో ఉపయోగాలు
స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల గాలిని శుభ్రపడుతుంది. మన ఇళ్లలో ఉండే ఫర్నిచర్, పెయింట్, ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల గాలిలో హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఈ మొక్క వాటిని కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా ఇది ప్రత్యేకంగా రాత్రి సమయంలో కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. సాధారణంగా చాలా మొక్కలు పగలు ఆక్సిజన్ ఇస్తాయి, రాత్రి కాదు. కానీ స్నేక్ ప్లాంట్ మాత్రం రాత్రిపూట కూడా గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. అందువల్ల దీన్ని బెడ్‌రూమ్‌లో ఉంచితే నిద్ర బాగా పడుతుంది, శరీరం తాజాగా ఉంటుంది.
ఈ మొక్క మన మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇంట్లో పచ్చదనం ఉంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. రోజంతా పని ఒత్తిడితో అలసిపోయినప్పుడు ఇంట్లో గ్రీన్ మొక్కలు కనిపిస్తే స్ట్రెస్ తగ్గుతుంది. స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు మన మూడ్‌ను మెరుగుపరుస్తాయి. అలాగే కొందరు ఫెంగ్‌షుయ్ నమ్మకాల ప్రకారం ఈ మొక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని చెబుతారు. అందుకే చాలా మంది దీన్ని హాల్‌లో లేదా ఇంటి ప్రవేశద్వారం దగ్గర ఉంచుతారు.
Also read: Breast Cancer: మనదేశంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు ఆలస్యంగా బయటపడుతుంది
దీన్ని పెంచడం చాలా సులువు
స్నేక్ ప్లాంట్‌ను పెంచడం చాలా ఈజీ. దీనికి ఎక్కువగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మట్టిలో తేమ పూర్తిగా తగ్గిన తర్వాతే నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్లు పోస్తే మొక్క పాడయ్యే అవకాశం ఉంది. అలాగే ఇది ఎక్కువ వెలుతురు లేకపోయినా బాగా పెరుగుతుంది. కాబట్టి కిటికీ పక్కన లేదా లోపలి గదుల్లో కూడా ఉంచుకోవచ్చు. బిజీగా ఉండే వాళ్లకు ఇది చాలా మంచిది, ఎందుకంటే ప్రతిరోజూ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి పెట్టుకుంటే చాలా కాలం పాటు బాగా పెరుగుతుంది.
ఈ మొక్కను ఎలా చూసుకోవాలో కూడా చాలా సులభం. మంచి డ్రైనేజ్ ఉన్న మట్టిలో పెంచాలి. నీళ్లు నిల్వ ఉండకూడదు. నేరుగా గట్టిగా ఎండ పడే చోట కాకుండా మోస్తరు వెలుతురు ఉన్న చోట ఉంచితే మంచిది. అప్పుడప్పుడు ఆకులు తుడిచి శుభ్రం చేస్తే మరింత అందంగా కనిపిస్తుంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే స్నేక్ ప్లాంట్ మీ ఇంటిని అందంగా మార్చడమే కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కూడా కల్పిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో కనీసం ఒక స్నేక్ ప్లాంట్ ఉండటం చాలా మంచిది.