Muntha Masala recipe: సాయంత్రం అయిందంటే చాలు ఏదో ఒకటి తినాలనిపించడం కామన్. అప్పట్లో మనకు రోడ్డు బండ్ల దగ్గర వేడివేడిగా దొరికే ముంతమసాలా రుచి ఎప్పటికీ మరువలేం. ఆ గుమగుమలాడే కారం, ఉల్లిపాయల కరకరలాడే.. టేస్ట్ మళ్లీ తినాలనిపిస్తుందా? అయితే ఎలాంటి కష్టం లేకుండా.. పిల్లలు కూడా ఎంతో ఈజీగా చేసుకునేలా బండి దగ్గరి రుచితో ముంతమసాలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం!
మరమరాలు – 4 కప్పులు
పల్లీలు – అర కప్పు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినవి)
టమాట – 1 (చిన్న ముక్కలు)
పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
కారం – 1 స్పూన్
ధనియాల పొడి – అర స్పూన్
చాట్ మసాలా – అర స్పూన్
నిమ్మకాయ – 1
పుట్నాల పప్పు లేదా కారప్పూస – కొద్దిగా
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నూనె – 2 స్పూన్లు
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
1. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు మంచి రంగు వచ్చే వరకు వేయించిన తర్వాత, అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఇది ముంతమసాలాకు అసలైన టేస్ట్‌ను ఇస్తుంది.
2.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఆ వేడి మీదనే కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, రుచికి సరి పడా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా.. చూసుకోవడం ముఖ్యం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయడం వల్ల మసాలా సువాసన అద్భుతంగా వస్తుంది.
3. ఒక పెద్ద గిన్నెలో ముందుగా.. సిద్ధం చేసుకున్న మరమరాలను తీసుకోవాలి. అందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీల పోపు మిశ్రమాన్ని వేయాలి. దీనికి తోడుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు వేయాలి. టమాటాలు వేసేటప్పుడు.. గింజలు తీసేస్తే ముంతమసాలా మెత్తగా అవ్వకుండా కరకరలాడుతూ వస్తుంది.
4.ఇప్పుడు ఈ మిశ్రమంపై తాజా నిమ్మకాయ రసాన్ని పిండాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తి మీర, పైన కొద్దిగా కారప్పూస లేదా పుట్నాల పప్పు వేసి చేతితో.. లేదా గరిటెతో అన్ని పదార్థాలు బాగా కలిసేలా వేగంగా కలపాలి. ఎక్కువ సేపు ఉంచితే మరమరాలు మెత్తబడిపోతాయి కాబట్టి, కలిపిన వెంటనే సర్వ్ చేసుకోవడం మంచిది.
Also Read: నాన్ వెజ్ లవర్స్ కోసం..స్పెషల్ చికెన్ కారం పొడి రెసిపీ
ముంతమసాలాలో కొద్దిగా కారప్పూస లేదా సేవ్ వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది.
మీకు ఇష్టమైతే కొద్దిగా మామిడికాయ తురుము కూడా కలుపుకోవచ్చు,ఇది పుల్లపుల్లగా టేస్ట్‌ను పెంచుతుంది.
ఇలా ఎంతో ఈజీగా, కేవలం ఐదు నిమిషాల్లో బండి రుచితో ముంతమసాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట తిని ఆరోగ్య పాడుచేసుకునే బదులు, ఇంట్లోనే పరిశుభ్రంగా ఈ టేస్టీ స్నాక్ చేసి మీ పిల్లలకు పెట్టండి. వారు కూడా చాలా ఇష్టంగా తింటారు!