Electric Flying Car: లక్ష్యం పట్ల స్పష్టత, అంకితభావం ఉంటే ఇంజినీరింగ్ డిగ్రీ లేకపోయినా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక సాధారణ యువకుడు. ఇంటర్నెట్ ద్వారా నాలెడ్జ్ పెంచుకుంటూ.. దాదాపు 13 ఏళ్లపాటు నిరంతరం శ్రమించి ఒక ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ (ఎగిరే కారు)ను అతడు రూపొందించాడు. దానిని విజయవంతంగా నడిపి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ ఎగిరే కారుకు సంబంధించి దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యువకుడి చూపిన ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందిన రవి తమ్తా.. బిఏ (BA) గ్రాడ్యుయేట్. చదువులో టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఆయనను ఆపలేకపోయింది. ఆన్‌లైన్ లెర్నింగ్, సొంతంగా చేసిన రకరకాల ప్రయోగాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. పట్టువదలకుండా చేసిన 13 ఏళ్ల కృషి ఫలితంగా ‘హపిడా స్కైలెక్స్’ (HAPIDA SKYNeX) పేరుతో ఒకే ఒక్క సీటు కలిగిన ఎలక్ట్రిక్ ఎగిరే వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనం గతేడాది ఆగస్టులో విజయవంతంగా టెస్ట్ డ్రైవ్ కూడా పూర్తి చేసుకోవడం విశేషం.
ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాల్లో ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు చేరుకోవడం, రవాణా లేని మారుమూల ప్రాంతాలకు వెళ్లడం చాలా సవాలుతో కూడుకున్న పని. ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలనే ఆలోచనే రవి తమ్తాను ఈ ఆవిష్కరణ వైపు అడుగులు వేయించింది. భవిష్యత్తులో ఈ ఎగిరే కారు స్వల్ప దూరాల ప్రయాణాలకు, ముఖ్యంగా కొండ ప్రాంతాల మెడికల్ ఎమర్జెన్సీలకు ఎంతో ఉపయోగపడుతుందని రవి ఆశిస్తున్నారు.
రవి తమ్తా కేవలం ఎగిరే కారుకే పరిమితం కాలేదు. గతంలో కూడా సమాజానికి ఉపయోగపడే పలు ఆవిష్కరణలు చేశారు. నడుస్తూనే మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేసుకునే ప్రత్యేక బూట్లను అతడు తయారు చేసి ఆశ్చర్యపరిచారు. అలాగే దృష్టిలోపం ఉన్నవారు సురక్షితంగా నడవడానికి సహాయపడే స్మార్ట్ వాకింగ్ స్టిక్ ను కూడా తయారు చేశారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉపయోగపడే అగ్నిమాపక పరికరాలు వంటివి ఎన్నో ఆయన ఇదివరకే రూపొందించడం గమనార్హం.
Also Read: రూ.25 వేల జీతమా? నెలకు ఎంత పొదుపు చేస్తే సేఫ్? నిపుణులు చెప్పే సూపర్ ప్లాన్ ఇదే!
ఇదిలా ఉంటే ప్రొటోటైప్ ఫ్లైయింగ్ కార్ ప్రాథమిక పరీక్షల్లో నెగ్గినప్పటికీ.. ఇది సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని పరీక్షలు, ప్రభుత్వ నిబంధనలకు సంబంధించిన అనుమతులు (Regulatory Approvals) పొందాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే రవాణా రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా మారే అవకాశం ఉంది. మెుత్తంగా.. కఠినమైన శ్రమ, నేర్చుకోవాలనే తపన ఉంటే తరగతి గది విద్య సరిపోకపోయినా సరికొత్త ఆవిష్కరణలు చేయవచ్చని రవి తమ్తా ప్రయాణం మరోసారి రుజువు చేసింది.
Also Read: మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే దళారులకే అమ్ముకోండి.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!