Child Care in Summer: వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండల తీవ్రతతో పాటు వేడిగాలులు జనాన్ని వణికించేస్తుంటాయి. ముఖ్యంగా పెద్దల కంటే.. పిల్లలపై ఈ ఎండల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నారుల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారు త్వరగా వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఈ తీవ్రమైన వేడిగాలుల సమయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లలను ఆరోగ్యంగా.. ఉల్లాసంగా ఉంచడానికి పాటించాల్సిన వేసవి ఆరోగ్య చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండలు ముదురుతున్న కొద్దీ వేడిగాలుల తీవ్రత పెరుగుతుంది. బడికి సెలవలు కావడంతో పిల్లలు ఎండను సైతం లెక్కచేయకుండా బయట తిరగడానికి ఇష్టపడతారు. అయితే.. మధ్యాహ్నం పూట వీచే వేడిగాలులు పిల్లల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. వారి శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల త్వరగా నీరసించిపోతారు. కాబట్టి ఈ సీజన్‌లో వారిని సురక్షితంగా ఉంచడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరి.
1.డీహైడ్రేషన్ అడ్డుకోండి:
పిల్లలు ఆడుకునే మూడ్‌లో పడి సరిగ్గా నీళ్లు తాగరు. కాబట్టి తల్లిదండ్రులే చొరవ తీసుకుని వారిని హైడ్రేటెడ్‌గా ఉంచాలి. రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగేలా చూడండి. కేవలం మంచినీళ్లే కాకుండా కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్‌ఎస్ లవణాల మిశ్రమాన్ని ఇవ్వడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందుతాయి. ఐస్ క్రీములు,కూల్ డ్రింక్స్ కంటే ఇంట్లో తయారుచేసిన సహజసిద్ధమైన జ్యూస్‌లు ఇవ్వడం చాలా మంచిది.
2. ఆహార నియమాలు:
వేసవిలో జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే పిల్లలకు జీర్ణం కావడానికి ఇబ్బంది కలిగించే మసాలాలు, జంక్ ఫుడ్, వేపుళ్లకు దూరంగా ఉంచాలి. కీరా దోసకాయ, పుచ్చకాయ, తర్బూజ, ద్రాక్ష వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను స్నాక్స్‌గా ఇవ్వండి. రాత్రి పూట వండిన అన్నంలో పాలు లేదా పెరుగు వేసి చేసిన చద్ది అన్నం ఉదయాన్నే తినిపించడం వల్ల పిల్లల శరీరం రోజంతా చల్లగా ఉంటుంది.
3. బట్టలు ఎంపిక, బయటకు వెళ్లే సమయాలు:
పిల్లలకు బిగుతుగా ఉండే సింథటిక్ బట్టలు కాకుండా.. వదులుగా ఉండే కాటన్ (నూలు)బట్టలను మాత్రమే వేయాలి. ఇవి చెమటను త్వరగా పీల్చుకుని శరీరాన్ని చల్లబరుస్తాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలను అస్సలు బయటకు పంపకండి. ఇండోర్ గేమ్స్ (ఇంట్లోనే ఆడుకునే ఆటలు) ఆడేలా ప్రోత్సహించండి. ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే.. సన్‌స్క్రీన్ లోషన్ రాయడం, టోపీ వాడటం, గొడుగు లేదా స్కార్ఫ్ వాడటం మర్చిపోవద్దు.
Also Read: సమ్మర్‌లో .. బీపీ, షుగర్ పేషెంట్లు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు
వడదెబ్బ తగిలితే.. గుర్తించడం ఎలా?
పిల్లల్లో అధిక శరీర ఉష్ణోగ్రత, వికారం, వాంతులు, తలనొప్పి, విపరీతమైన నీరసం, చర్మం ఎర్రబడటం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే.. అది వడదెబ్బ కావచ్చు.
తక్షణ ఉపశమనం: వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే పిల్లాడిని చల్లని గదిలోకి తీసుకెళ్లాలి. తడి క్లాత్ తో శరీరాన్ని తుడవాలి. ఓఆర్‌ఎస్ నీటిని కొద్దికొద్దిగా తాగించాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి.
చిన్నపాటి జాగ్రత్తలు, సరైన ఆహార అలవాట్లతో వేడిగాలుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ వేసవిలో మీ పిల్లలను సురక్షితంగా ఉంచుతూ.. వారి సెలవులను ఆనందమయం చేయండి.