Healthy relationship self sabotage| అంతా బాగానే ఉంది. ప్రేమించే వ్యక్తి మీతో మంచిగా మాట్లాడుతున్నారు, మీ భావాలను అర్థం చేసుకుంటున్నారు, మీకు అండగా నిలుస్తున్నారు. అయినప్పటికీ, ఒక్కసారిగా మీ మనసులో మాత్రం ఏదో భయం. మంచి లవర్ దొరికినప్పుడు కూడా ఇలా ఎందుకు అనిపిస్తుంది? చాలాసార్లు సమస్య ఎదుటి వ్యక్తిలో ఉండదు. మనలో దాగి ఉన్న భయం ఈ పరిస్థితికి కారణం కావచ్చు.
ఒక మంచి, ఆరోగ్యకరమైన రిలేషన్‌లో ప్రేమ, నమ్మకం, గౌరవం, స్థిరత్వం ఉంటాయి. కానీ గతంలో తప్పుడు సంబంధాలను ఎదుర్కొన్న వారికి ఈ ప్రశాంతత కొత్తగా అనిపిస్తుంది. గతంలో ప్రేమతో పాటు గొడవలు, నిర్లక్ష్యం లేదా అనిశ్చితి ఉంటే, మనసు వాటికి అలవాటు పడుతుంది. అందుకే ప్రశాంతమైన సంబంధం కూడా కొన్నిసార్లు అనుమానంగా అనిపిస్తుంది. అప్పుడు భాగస్వామిలో చిన్న చిన్న లోపాలు కూడా పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. వారి మాటలు, అలవాట్లు లేదా మెసేజ్‌లు కూడా అకస్మాత్తుగా చిరాకు కలిగించవచ్చు.
సంబంధం బలపడుతున్నప్పుడు మన భావాలను పూర్తిగా బయటపెట్టాల్సి వస్తుంది. అదే సమయంలో తిరస్కరణ, విడిచిపెట్టడం లేదా బాధపడటం గురించి భయం మొదలవుతుంది. కొంతమంది ప్రేమను కోరుకుంటూనే, అది నిజంగా దగ్గరైనప్పుడు వెనక్కి తగ్గుతారు. అలాంటివారు దూరంగా వెళ్లి.. మళ్లీ భాగస్వామిని మిస్ అవుతారు. ఇలా దగ్గర కావడం, దూరం కావడం అనే చక్రం పదేపదే కొనసాగుతతుంది. చివరికి ఇద్దరూ అయోమయానికి, మానసిక అలసటకు గురవుతారు.
“ప్రేమించిన వ్యక్తి నన్ను ఎప్పటికైనా వదిలేస్తారు” అనే భయం కొందరిని ముందుగానే సంబంధం ముగించేలా చేస్తుంది. ముందుగా విడిపోతే బాధను తామే నియంత్రించగలమని భావిస్తారు.
కానీ ఈ నిర్ణయం వారు భయపడిన ఫలితాన్నే తీసుకురావచ్చు. పదేపదే గొడవలు పెట్టడం, ప్రేమను దూరం చేయడం, భాగస్వామిని పరీక్షించడం నమ్మకాన్ని తగ్గిస్తాయి.
Also Read: లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు
ప్రతి సంబంధంతో సందేహాన్ని స్వీయ విధ్వంసంగా భావించకూడదు. కొన్ని సంబంధాలు నిజంగానే సరిపోకపోవచ్చు లేదా అనారోగ్యకరంగా ఉండవచ్చు. అందుకే ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్న మీరు స్వయంగా వేసుకోవాలి. “నాలో భయం పెరుగుతోందా, లేక నిజంగా ఈ సంబంధంలో సమస్య ఉందా?” ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం వెతకడం సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది.
మొదట, భయం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం ఆగాలి. నిజంగా ఏదైనా సమస్య జరిగిందా లేదా మీ లవర్‌కు మీరు దగ్గర కావడం వల్ల అసౌకర్యంగా అనిపించిందా అని ఆలోచించాలి. తర్వాత మీ భావాలను భాగస్వామితో ప్రశాంతంగా చెప్పాలి. అకస్మాత్తుగా దూరం కావడం కంటే, మీకు భయం ఎందుకు కలుగుతుందో చెప్పడం మంచిది. ఆరోగ్యకరమైన ప్రేమకు నమ్మకం, సహనం, స్పష్టమైన సంభాషణ అవసరం. సురక్షితమైన సంబంధానికి అలవాటు పడటానికి కొంత సమయం పట్టవచ్చు. కొన్నిసార్లు మనం పారిపోవాలనుకునే వ్యక్తే మనకు నిజమైన భద్రతను అందిస్తున్న వ్యక్తి కావచ్చు. ఆ భయాన్ని అర్థం చేసుకోవడం ఆరోగ్యకరమైన ప్రేమకు మొదటి అడుగు.
Also Read: కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి