Tickling and scaring children| పిల్లలను నవ్వించేందుకు తల్లిదండ్రులు చక్కిలిగింతలు పెడుతుంటారు. వారు మాట వినకపోతే దెయ్యాలు వస్తాయని, పోలీసులు తీసుకెళ్తారని భయపెడుతుంటారు. అయితే, ఈ అలవాట్లు పిల్లల మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసా? పిల్లలు నవ్వుతున్నంత మాత్రాన వారు సంతోషంగా ఉన్నారని అర్థం కాదు. అలాగే, భయపెట్టి పిల్లలను నియంత్రించడంతో సరైన క్రమశిక్షణ అలవడదు. పిల్లల భావోద్వేగాలు, భద్రత, తల్లిదండ్రులపై నమ్మకాన్ని కాపాడేందుకు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.
పిల్లలకు గిలిగింతలు పెడితే వారు నవ్వుతారు. అయితే, ఆ నవ్వు వారికి నచ్చిందని కాదు. కొన్నిసార్లు పిల్లలు ఇబ్బందిగా భావించినా గిలిగింతల వల్ల నవ్వుతారు. అందుకే తల్లిదండ్రులు వారి ముఖ కవళికలు, శరీర కదలికలను గమనించాలి. పిల్లలు ఆపమని అడిగితే వెంటనే ఆపాలి. వారు అసౌకర్యంగా ఉన్నా, ఇబ్బంది పడుతున్నా బలవంతంగా కొనసాగించకూడదు. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. సాధారణంగా చక్కిలిగింతలు పెట్టడం వల్ల మెదడుకు నష్టం కలుగుతుందని నిరూపించే ఆధారాలు లేవు. కాబట్టి నిరాధారమైన వైద్య సమాచారాన్ని నమ్మకూడదు.
పిల్లలను నవ్వించడానికి గిలిగింతలే అవసరం లేదు. సరదా కథలు చెప్పడం, బొమ్మలతో ఆడటం, చిన్న చిన్న ఆటలు ఆడటం వంటి మార్గాలను ప్రయత్నించవచ్చు. పిల్లలు ఏడుస్తున్నప్పుడు లేదా బాధపడుతున్నప్పుడు ముందుగా వారి సమస్యను అర్థం చేసుకోవాలి.
వారితో ప్రశాంతంగా మాట్లాడి, తమ భావాలను చెప్పేందుకు అవకాశం ఇవ్వాలి. పిల్లలకు ఇష్టం లేని ఆటల్లో పాల్గొనాలని బలవంతం చేయకూడదు. వారి ఇష్టాయిష్టాలను గౌరవించడం వల్ల భద్రతా భావం పెరుగుతుంది.
పిల్లలు మాట వినకపోతే కొందరు తల్లిదండ్రులు దెయ్యాలు వస్తాయని, పోలీసులు తీసుకెళ్తారని బెదిరిస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలు అప్పటికప్పుడు మాట వినవచ్చు. కానీ పదేపదే భయపెట్టడం వల్ల వారిలో ఆందోళన పెరగవచ్చు.
చీకటంటే భయం, ఒంటరిగా నిద్రపోవడానికి ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవవచ్చు. అంతేకాకుండా, తమ భయాలను తల్లిదండ్రులతో పంచుకోవడానికి కూడా పిల్లలు వెనుకాడవచ్చు. భయపెట్టడం వల్ల తప్పు ఎందుకో పిల్లలకు అర్థం కాదు.
Also Read: కుటుంబ సభ్యులకు కూడా ఈ 5 విషయాలు చెప్పకూడదు.. జీవితం సంతోషంగా సాగడానికి చాణక్య సూచనలు
పిల్లలు తప్పు చేసినప్పుడు కోపపడటం లేదా బెదిరించడం కంటే, ఆ పని ఎందుకు చేయకూడదో వివరించాలి. ఉదాహరణకు, ఇతరులను కొట్టకూడదని, అలా చేస్తే వారికి నొప్పి కలుగుతుందని చెప్పాలి. పిల్లలు మంచి ప్రవర్తన చూపినప్పుడు ప్రశంసించాలి. వారి మాటలను శ్రద్ధగా వినాలి. తప్పులు చేసినప్పుడు ఓపికగా సరిదిద్దాలి. ప్రేమ, స్పష్టమైన నియమాలు, ప్రశాంతమైన సంభాషణ పిల్లల్లో మంచి అలవాట్లను పెంపొందిస్తాయి.
Also Read: చాణక్య నీతి.. పిల్లలు చేసే ఈ తప్పులను తల్లిదండ్రులు అసలు నిర్లక్ష్యం చేయకూడదు
పిల్లలతో ఆడుకోవడం కుటుంబ బంధాలను బలపరుస్తుంది. అయితే, వారి ఇష్టాలను, భావాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. పిల్లలు భయం లేకుండా తమ సమస్యలను చెప్పగలిగే వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి. ప్రేమతో కూడిన మార్గదర్శకత్వం పిల్లల భావోద్వేగ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు, తల్లిదండ్రులపై వారి నమ్మకాన్ని మరింత పెంచుతుంది.