Skin Cycling: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు… గ్లోయింగ్ స్కిన్ కోసం రోజుకో కొత్త బ్యూటీ ప్రొడక్ట్, గంటల తరబడి సాగే పొడవైన స్కిన్‌కేర్ రొటీన్‌లు దర్శనమిస్తుంటాయి. అయితే, రకరకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్‌ను చర్మంపై వాడటం వల్ల ముఖం అందంగా మారడం దేవుడెరుగు, ఉన్న గ్లో కాస్తా పోయి స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు సౌందర్య నిపుణులు. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ లవర్స్ అందరి దృష్టినీ ఒక సరికొత్త ట్రెండ్ ఆకర్షిస్తోంది. అదే ‘స్కిన్ సైక్లింగ్’. ఎక్కువ ప్రొడక్ట్స్ వాడటం ముఖ్యం కాదు, సరైన క్రమంలో, చర్మానికి తగినంత విశ్రాంతి ఇస్తూ వాడటమే ఈ ట్రెండ్ యొక్క అసలు రహస్యం. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పద్ధతిని పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్, టిక్‌టాక్‌లలో పోస్టులు పెడుతుండటంతో ఈ సరికొత్త విధానం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సమస్యలు వచ్చే అవకాశాలు దాదాపు మాయం
సాధారణంగా చాలామంది ప్రతిరోజూ ఒకే రకమైన స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. కానీ స్కిన్ సైక్లింగ్ అనేది అలా కాకుండా, నాలుగు రోజుల సైకిల్‌లో ప్రొడక్ట్స్‌ను మారుస్తూ ఉపయోగించే పద్ధతి. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే, చర్మానికి యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్ అందించడంతో పాటు, అది కోలుకోవడానికి తగినంత సమయం ఇవ్వడం. దీనివల్ల చర్మంపై ఒత్తిడి తగ్గి, అలర్జీలు లేదా ఇరిటేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు దాదాపు మాయం అయిపోతాయి . ఈ నాలుగు రోజుల ఫార్ములాలో మొదటి రోజును ఎక్స్‌ఫోలియేషన్‌కు కేటాయించాలి. ముఖంపై పేరుకుపోయిన మృత చర్మాన్ని, రంధ్రాలలో ఉన్న మురికిని తొలగించేందుకు తేలికపాటి కెమికల్ ఎక్స్‌ఫోలియేటర్ (AHA లేదా BHA) వాడాలి. ఇది చర్మాన్ని తర్వాతి రోజుల్లో వాడే ప్రొడక్ట్స్‌ను బాగా పీల్చుకునేలా సిద్ధం చేస్తుంది.
ఐదో రోజు నుండి మళ్లీ ఇదే సైకిల్
ఇక రెండో రోజు రాత్రి ‘రెటినాల్ నైట్’ గా పిలుస్తారు. వయసు పైబడటం వల్ల వచ్చే ముడతలను తగ్గించడానికి, చర్మ కణాల పునరుద్ధరణకు రెటినాల్ ఆధారిత ఉత్పత్తులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి, ముఖానికి మంచి యవ్వనత్వాన్ని ఇస్తుంది. అయితే, మొదటి రెండు రోజులు చర్మంపై తీవ్రమైన ప్రొడక్ట్స్ వాడాం కాబట్టి, ఆ తర్వాత వచ్చే మూడు మరియు నాలుగో రోజులను ‘రికవరీ డేస్’గా పరిగణిస్తారు. ఈ రెండు రోజులు చర్మానికి ఎలాంటి యాక్టివ్ కెమికల్స్ జోడించకుండా కేవలం మంచి మాయిశ్చరైజర్, హైడ్రేటింగ్ సెరమ్స్ (హైలురోనిక్ యాసిడ్ వంటివి) మాత్రమే వాడాలి. దీనివల్ల చర్మం తన సహజసిద్ధమైన తేమను తిరిగి పొంది, లోపలి నుంచి కోలుకునేందుకు వీలు కలుగుతుంది. ఐదో రోజు నుండి మళ్లీ ఇదే సైకిల్‌ను మొదటి నుండి ప్రారంభించాల్సి ఉంటుంది.
ఈ పద్దతి ఒకసారి పాటిస్తారా ?
ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ఈ పద్ధతి ఇంతలా ట్రెండింగ్ కావడానికి ప్రధాన కారణం ‘ఓవర్ స్కిన్‌కేర్’కు ఇది ముగింపు పలకడమే. మార్కెట్లో దొరికే ప్రతీ ప్రొడక్ట్‌ను కొనేసి ముఖానికి పూసేయడం వల్ల స్కిన్ బారియర్ దెబ్బతింటుంది. కానీ స్కిన్ సైక్లింగ్ వల్ల తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే మెరుగైన చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ (సున్నితమైన చర్మ తత్వం) ఉన్నవారికి ఈ పద్ధతి ఒక వరం లాంటిదని చెప్పాలి. ఎందుకంటే ఇది చర్మానికి విశ్రాంతినిస్తూనే, కావాల్సిన పోషణను అందిస్తుంది. అనవసరమైన బ్యూటీ ప్రొడక్ట్స్ కొనే ఖర్చు తగ్గడం, రాత్రి పూట ఎక్కువ సమయం కేటాయించాల్సిన పని లేకపోవడంతో నేటి తరం యువత, వర్కింగ్ ఉమెన్స్ ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్కిన్‌కేర్ ట్రెండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి, ఇలా సైంటిఫిక్ విధానంలో చర్మాన్ని కాపాడుకోవడం ద్వారా సహజమైన మెరుపును మీ సొంతం చేసుకోవచ్చని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ గట్టిగా చెప్తున్నారు.మరి మీ స్కిన్ కి కాపాడుకోవడానికి ఈ పద్దతి ఒకసారి పాటిస్తారా ?
also read :‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్