శరీరం ఆరోగ్యకరంగా ఉంటే మనిషి కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అందుకే మానసిక ఆరోగ్యం శారీరక, భావోద్వేగ కారణాలపై ఆధారపడి ఉంటుంది. మానసిక ఆందోళన, డిప్రెషన్‌కు కారణం.. జీవితంలో ఒత్తిడి మాత్రమే కాదు శరీరంలో విటమిన్ లోపాల వల్ల కూడా జరుగుతుందని ఇప్పుడు డాక్టర్లు చెబుతున్నారు.
అవసరమైన పోషకాలు లోపించడం వల్ల మూడ్, నిద్ర, శక్తి, భావోద్వేగ సమతుల్యత దెబ్బతింటాయి. చాలా మంది ఈ సంకేతాలను పట్టించుకోరు.
మెదడు ఆరోగ్యంగా పని చేయడానికి విటమిన్లు, మినరల్స్ అవసరం. ఈ పోషకాలు మూడ్, భావోద్వేగాలను నియంత్రించే రసాయనాల ఉత్పత్తికి సహాయపడతాయి. విటమిన్ లోపం ఉంటే మెదడు పనితీరు దెబ్బతింటుంది. దీంతో విషాదం, ఒత్తిడి, అలసట, ఉత్సాహం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సరైన పోషకాహారం మానసిక సమతుల్యతను కాపాడుతుంది.
విటమిన్ డికి మరోపేరు సన్‌షైన్ విటమిన్ అని అంటారు. శరీరంలో దీని స్థాయి తక్కువగా ఉంటే డిప్రెషన్, ఆందోళన లక్షణాలు పెరుగుతాయి. ఇది సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. శరీరానికి ఉదయం వేళ లభించే సూర్యకాంతి కూడా చాలా అవసరం. ఇది విటమిన్ డి గ్రహించడానికి సాయపడుతుంది. సూర్యకాంతి తక్కువగా ఉండటం, ఇంటి లోపలే ఉండటం వల్ల ఈ లోపం ఎక్కువవుతుంది. దీంతో అలసట, విషాదం, ఉత్సాహం లోపం సాధారణమవుతాయి.
విటమిన్ బి12 శరీరంలో నరాలు, మెదడు పనితీరుకు చాలా ముఖ్యం. దీని లోపం అలసట, గందరగోళం, ఆందోళన, డిప్రెషన్‌ను పెంచుతుంది. మాంసాహారం తినని వారు, వృద్ధులు ఈ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. రక్త పరీక్షలు చేయించుకుని, సప్లిమెంట్స్, ఆహారం ద్వారా సరిదిద్దాలి.
ఫోలేట్‌ని విటమిన్ B9 మెదడులో న్యూరోట్రాన్స్‌మిటర్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. దీని లోపం మూడ్‌ను దెబ్బతీసి, ఒత్తిడిని పెంచుతుంది. పచ్చని కూరగాయలు, పండ్లు, బీన్స్ తినడం ద్వారా ఫోలేట్ లెవెల్స్ పెంచవచ్చు.
మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేసి, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. దీని లోపం ఒత్తిడి, నిద్ర సమస్యలు, ఆందోళనను పెంచుతుంది. ఆకు కూరలు, హోల్ గ్రెయిన్స్ తినడం మంచిది.
అలసట, మూడ్ సరిగా లేకపోవడం, నిద్ర లోపం, ఏకాగ్రత తగ్గడం, చిరాకు, కండరాల బలహీనత వంటివి సాధారణ లక్షణాలు. ఇవి నెమ్మదిగా వస్తాయి కాబట్టి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు.
Also Read: మీరు ప్రేమించే వ్యక్తులు మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్లిపోతారు.. దీనికి కారణాలు ఇవే
ప్రాసెస్డ్ ఫుడ్, ఇండోర్ లైఫ్‌స్టైల్, ఒత్తిడి వల్ల విటమిన్లు తగ్గుతాయి. సమతుల్య ఆహారం, వ్యాయామం, సూర్యకాంతి అవసరం.
సమతుల్య పోషాకాహారం, సూర్యకాంతి, వ్యాయామం, యోగా, మంచి నిద్ర ద్వారా విటమిన్లను పెంచవచ్చు. డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవాలి.
నిరంతర అలసట, ఆందోళనగా ఉండడం, ఏదీ నచ్చకపోవడం వంటి సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలి. రక్త పరీక్షలు చేయించుకోవాలి.
విటమిన్ డి, బి12, ఫోలేట్, మెగ్నీషియం లోపాలు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సమతుల్య ఆహారం, ఆరోగ్యకర అలవాట్లు, వైద్య సలహా ద్వారా మానసిక సమతుల్యతను కాపాడుకోవచ్చు.