చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల దంత సంరక్షణ గురించి స్పష్టత ఉండదు. పిల్లల చేత వారి పళ్లకు బ్రష్ చేయించడం ఎప్పుడు మొదలు పెట్టాలో గందరగోళానికి గురవుతారు. కొందరు తల్లిదండ్రులు.. పిల్లల నోట్లో కొన్ని దంతాలు వచ్చినట్ల గమనించి ఆ తరువాత బ్రష్ చేయడం ప్రారంభిస్తారు. కానీ డాక్టర్లు దీనికి భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రవి మలిక్ ప్రకారం.. పిల్లల నోట్లో పళ్లురాక ముందుగానే బ్రష్ చేయడం మొదలు పెట్టాలని సలహా ఇస్తారు. సరైన దంత సంరక్షణ పాటిస్తే పిల్లల నోట్లో కెవెటీస్, దుర్వాసన, దంతాలు పసుపు రంగులో పాచి పట్టడం వంటి సమస్యలు నుంచి కాపాడుకోవచ్చు. చిన్నప్పటి నుంచి పిల్లల్లో అలవాట్లు పెంపొందిస్తే జీవితాంతం మంచి దంత ఆరోగ్యం ఉంటుంది.
పిల్లల మొదటి దంతం వచ్చిన వెంటనే బ్రష్ చేయడం మొదలు పెట్టాలి. ఇది సాధారణంగా ఆరు నెలల వయస్సులో జరుగుతుంది. మొదటి దంతం వచ్చినప్పుడు బ్రష్ చేయడం వల్ల బ్యాక్టీరియా తొలగిపోతుంది. పిల్లల నోరు శుభ్రంగా ఉంటుంది. ఈ అలవాటు పిల్లలు బ్రష్ చేయడానికి అలవాటు పడటానికి సహాయపడుతుంది.
తల్లిదండ్రులు పిల్లలకు మెత్తటి బ్రష్ ఎంచుకోవాలి. బ్రష్ తల చిన్నగా ఉండాలి. రంగులు ఉన్న ఆకర్షణీయమైన బ్రష్‌లు పిల్లలు ఇష్టపడతారు. పెద్ద బ్రష్‌లు పిల్లల చిన్న నోటికి సరిపోవు. అవి చిగుళ్లను గాయపరచవచ్చు. నాలుగు నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలి. పాత బ్రష్ గట్టిపడితే సరిగా శుభ్రం చేయదు.
పిల్లల దంతాలు బ్రష్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ పేస్ట్ ఉపయోగించకూడదు. ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు వరకు బియ్యపు గింజంత పేస్ట్ చాలు. ఎందుకంటే మీరు ఇచ్చే పేస్ట్ పిల్లలు మింగేసే ప్రమాదముంది. అందుకే చాలా తక్కువ మొత్తంలో ఇస్తే పేస్ట్ మింగేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మూడు సంవత్సరాలు పైబడిన పిల్లలకు ఒక బఠానీ గింజ అంత పేస్ట్ వాడవచ్చు. తల్లిదండ్రులు ఎప్పుడూ పర్యవేక్షణ చేయాలి.
నిపుణులు.. పిల్లల కోసం 1000 పిపిఎం ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. దంతాల ఎనామెల్‌ను ఫ్లోరైడ్ బలపరుస్తుంది. దంతాల కుళ్లిపోవడం (కెవిటీస్) రాకుండా కాపాడుతుంది. దీని కోసం ప్రత్యేక పిల్లల పేస్ట్ అవసరం లేదు. సాధారణ ఫ్లోరైడ్ పేస్ట్ సరిగ్గా వాడితే సరిపోతుంది. బ్రష్ చేసిన తర్వాత పిల్లలు నోటి నుంచి నురుగు తీసివేయడం నేర్చుకోవాలి.
చిన్న పిల్లలు మొదట్లో బ్రష్ చేయడం ఇష్టపడరు. తల్లిదండ్రులు వారికి బ్రష్ చేయడం ఒక ఆటగా మార్చాలి. అద్దం ముందు వారిని నిలబెట్టి మ్యూజిక్ వినిపించడం, రివార్డ్ చార్ట్‌లు చూపించడం సహాయపడతాయి. పిల్లలను ముందు స్వయంగా బ్రష్ చేయనివ్వండి. తర్వాత తల్లిదండ్రులు సరిగ్గా శుభ్రం చేయాలి. రోజూ క్రమం తప్పకుండా చేయడం చాలా ముఖ్యం.
చిన్న పిల్లలు ఒంటరిగా పళ్లు బ్రష్ చేయడం సరికాదు. వారు సరిగ్గా ఆ పని చేయలేరు. వారి చేతుల సమన్వయం నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల వరకు తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. వెనుక దంతాలు, చిగుళ్లు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడే ఆహారం, ప్లాక్ ఎక్కువగా అంటుకుంటాయి.
పిల్లలు క్రమం తప్పకుండా చేస్తే త్వరగా నేర్చుకుంటారు. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. ఉదయం, రాత్రి బ్రష్ చేయడం మంచిది. రాత్రి బ్రష్ చేయడం ఎక్కువ ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి బ్రష్ చేస్తే పిల్లలు అనుకరిస్తారు.
మొదటి దంతం వచ్చిన తర్వాత డెంటిస్ట్‌ను సందర్శించాలి. మొదటి పుట్టినరోజు లోపు డాక్టర్‌కు చూపించాలి. డెంటిస్ట్ సమస్యలను త్వరగా గుర్తిస్తారు. బ్రష్ చేసే విధానం గురించి సలహాలు ఇస్తారు. ఇలా చేస్తే పిల్లల దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Also Read: ఆన్‌లైన్ డేటింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.. లేకపోతే జీవితం నాశనమే
ఈ సాధారణ చిట్కాలు అనుసరిస్తే పిల్లల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు పెంపొందిచడం వల్ల భవిష్యత్తులో దంత సమస్యలు నివారించవచ్చు.