Sleep Quality Tips: రాత్రి 7-8 గంటలు హాయిగా పడుకున్నా.. ఉదయం లేవగానే ఏదో కొంపలు మునిగిపోయినట్లు నీరసంగా, బద్ధకంగా అనిపిస్తోందా? నిజానికి సమస్య నిద్రపోతున్న సమయంలో కాదు.. మనం పొందుతున్న నిద్ర నాణ్యతలో ఉందనేది నిపుణుల మాట. మారిన మన జీవనశైలి వల్ల ప్రస్తుత రోజుల్లో ఇది చాలామందికి పెద్ద సమస్యగా మారింది. అసలు ఈ నీరసానికి కారణమేంటి? ప్రశాంతమైన నిద్ర కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
రాత్రి పడుకుందాం అని బెడ్ ఎక్కిన తర్వాత చాలామంది చాలా సహజంగా చేసే ఒకే ఒక్క చిన్న అలవాటు ఈ సమస్య అంతటికీ ప్రధాన కారణం. అదేంటంటే.. పడుకునే ముందు మొబైల్ ఫోన్ చూడటం. పడకపై వాలిన తర్వాత కాసేపు సోషల్ మీడియా చూద్దామని, వార్తలు చదువుదామని లేదా ఏదైనా వీడియో చూద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంటాం. ఆ కాసేపు కాస్తా గంటలు గడిచిపోతుంది. దీనివల్ల మన మెదడు విశ్రాంతి స్థితిలోకి వెళ్లలేకపోతుంది. మనం నిద్రపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఫోన్ వాడటం వల్ల శరీరానికి అందాల్సిన పూర్తి విశ్రాంతి దక్కకుండా పోతుంది.
ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ కలర్ లైటింగ్ మన శరీరంలోని మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పూర్తిగా తగ్గించేస్తుంది. ఈ హార్మోన్ చేసే పనేంటంటే.. మనకు హాయిగా, ప్రశాంతంగా నిద్ర పట్టడానికి సహాయ పడుతుంటుంది. స్క్రీన్ వెలుతురు కంటిపై పడటం వల్ల మెదడు ఇంకా పగలే అనుకుని చురుగ్గా పనిచేస్తూనే ఉంటుంది. దీంతో మనం కళ్లు మూసుకుని పడుకున్నప్పటికీ.. అది గాఢ నిద్రలోకి మారదు. రాత్రంతా నిద్రలోనే పదే పదే మెలకువ రావడం, కలలు రావడం వంటివి జరుగుతాయి. ఫలితంగా ఎంతసేపు పడుకున్నా ఉదయానికి శరీరానికి కావలసిన శక్తి అందక అలసట బయటపడుతుంది.
Also Read: ఈ చిన్న లక్షణం కనిపిస్తే జాగ్రత్త.. 40 దాటాక మీ కళ్లు మీకు ఇస్తున్న వార్నింగ్ కావచ్చు!
ఈ సమస్య నుంచి బయటపడటానికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు మొబైల్, టీవీ, లాప్‌టాప్‌లను పూర్తిగా దూరంగా ఉంచాలి. ఫోన్ చూడటానికి బదులుగా ఏదైనా మంచి పుస్తకం చదవడం లేదా ప్రశాంతమైన సంగీతం వినొచ్చు. అలాగే రాత్రి వేళల్లో గదిలో లైటింగ్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే దానిని పూర్తిగా మానుకోవడం ఉత్తమం. రాత్రి వేళ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కూడా శరీరం తేలికపడి హాయిగా నిద్ర పడుతుంది.
మన రోజువారీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా నిద్ర నాణ్యతను పెంచుకోవచ్చు. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. శని, ఆదివారాలు వచ్చాయని రాత్రి వేళల్లో ఎక్కువ సమయం మేల్కొని ఉండటం మంచిది కాదు. రోజూ ఒకే సమయాన్ని పాటించడం వల్ల మన శరీరం ఒక క్రమపద్ధతికి అలవాటు పడుతుంది. రాత్రి త్వరగా పడుకుని ఉదయాన్నే లేవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. మీ నిద్ర అలవాట్లలో ఈ చిన్న మార్పు చేసుకుంటే ఉదయాన్నే నిద్రలేచేటప్పుడు రోజంతా లభించే ఆ ఉత్సాహాన్ని మీరే స్వయంగా గమనించవచ్చు.
Also Read: చేత్తో అన్నం తినడాన్ని నామోషీ అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. రీసెర్చ్‌లో ఏం తేలిందంటే?