Eye Health After 40: ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నప్పుడు లేదా ఫోన్‌లో మెసేజ్ చూసేటప్పుడు స్క్రీన్‌ను కాస్త దూరంగా జరిపి పట్టుకుంటున్నారా? హోటల్‌కి వెళ్లినప్పుడు తక్కువ వెలుతురులో మెనూ కార్డ్ చదవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు 40 ఏళ్ల వయసుకి దగ్గరపడ్డారని లేదా దాటారని అర్థం. ఈ వయసులో చూపులో ఇలాంటి మార్పులు రావడం చాలా సహజం. మన కంటిలోని లెన్స్ తన నాజూకుతనాన్ని, స్థితిస్థాపకతను కోల్పోవడం వల్ల దగ్గరి వస్తువులను స్పష్టంగా చూడటం కాస్త కష్టమవుతుంది. దీనినే ‘ప్రెస్బయోపియా’ అంటారు. అయితే ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ.. నిర్లక్ష్యం చేస్తే ఇతర తీవ్రమైన కంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
40 ఏళ్లు దాటిన తర్వాత కేవలం సైట్ పెరగడమే కాదు.. ఇతర కంటి జబ్బుల ముప్పు కూడా పెరుగుతుంది. కంటి చూపును క్రమంగా తగ్గించే కేటరాక్ట్ (శుక్లాలు), ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు చూపించకుండానే చూపును దెబ్బతీసే గ్లకోమా, మధుమేహం ఉన్నవారిలో వచ్చే డయాబెటిక్ రెటినోపతీ, అలాగే వయసుతో పాటు వచ్చే మాక్యులార్ డిజెనరేషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ వయసులో కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.
Also Read: రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!
కళ్లను కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రతి ఏడాదీ లేదా రెండేళ్లకు ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎలాంటి సమస్యలనైనా ప్రారంభంలోనే గుర్తించవచ్చు. రోజూ స్క్రీన్ల ముందు గడిపేవారు ‘20-20-20’ సూత్రాన్ని పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకి ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. ఇది కంటి అలసటను తగ్గిస్తుంది. అలాగే ఎండలోకి వెళ్లేటప్పుడు యువి (UV) కిరణాల నుండి రక్షణ ఇచ్చే సన్‌గ్లాసెస్ వాడటం, రోజూ తగినంత నీళ్లు తాగుతూ కళ్లు పొడిబారకుండా చూసుకోవడం మంచిది.
కంటి చూపు బాగుండాలంటే మనం తినే ఆహారం కూడా ముఖ్యమే. ఆకుకూరలు, రంగురంగుల పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. వీటితో పాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కంటిలో నొప్పులు, ఉన్నట్లుండి వెలుగు జిలుగులు కనిపించడం లేదా మసకబారడం వంటివి అనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. సరైన జాగ్రత్తలతో 40 తర్వాత కూడా మన చూపును ఎప్పటికీ పదిలంగా ఉంచుకోవచ్చు.
Also Read: ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!