Eating With Hands: ఈ రోజుల్లో స్పూన్లు, ఫోర్కులతో తినడమే ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది చేత్తో తింటే ఏదో పద్ధతి లేనట్టు, వెనుకబడిపోయినట్టు చూస్తుంటారు. కానీ నిజానికి, చేత్తో భోజనం చేయడం వెనుక ఒక మంచి సైకాలజీ ఉంది అని నిపుణులు చెప్తున్నారు. ఇది కేవలం మన పూర్వీకుల నుండి వచ్చిన అలవాటు మాత్రమే కాదు… మన మనసుకి, శరీరానికి కూడా ఎంతో మంచిది.
మనం తినే ఆహారం రుచి కేవలం నాలుకకే కాదు.. మన మెదడుకు కూడా తెలుస్తుంది. దాన్నే సైన్స్ భాషలో ‘మల్టీసెన్సరీ ఇంటిగ్రేషన్’ అంటారు. ఆహారాన్ని చేత్తో పట్టుకున్నప్పుడు, దానికి సంబంధించిన వేడి, మెత్తదనం వంటి విషయాలు ముందుగానే మెదడుకు అందుతాయి. దీంతో మన జ్ఞానేంద్రియాలు ముందే అప్రమత్తమై, ఆహారాన్ని మరింత ఇష్టంగా ఆస్వాదించేలా చేస్తాయి.
Also Read: UPI యూజర్లకు బిగ్ రిలీఫ్.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆఫీషియల్ క్లారిటీ వచ్చేసింది!
స్పూన్‌తో తిన్నప్పుడు మనం వేగంగా తినేస్తుంటాం. అదే చేత్తో తింటే.. ప్రతీ ముద్దను గమనిస్తూ చాలా ప్రశాంతంగా తింటాం. ఈ రకమైన ఆలోచనతో కూడిన భోజనం వల్ల ఆహారం బాగా నమిలి తింటాం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, కడుపు నిండిన భావనను త్వరగా కలిగిస్తుంది. ఫలితంగా అతిగా తినే అలవాటు కూడా తగ్గుతుంది.
భారతదేశంతో పాటు అనేక దేశాల్లో చేత్తో తినడం అనేది శతాబ్దాల నాటి సంప్రదాయం. కుటుంబంతో కలిసి చేత్తో భోజనం చేయడం వల్ల ఒక రకమైన ఆత్మీయత, మన సంస్కృతితో బలమైన అనుబంధం ఏర్పడతాయి. మన మూలాలను, పద్ధతులను గుర్తుచేసే ఒక అద్భుతమైన వంతెన లాంటిది ఈ అలవాటు.
రోజూ చేత్తో భోజనం చేయడం అనేది ఒక రకమైన అలవాటైన సైకలాజికల్ ప్రక్రియగా మారుతుంది. భోజనం చేసేటప్పుడు దేని గురించి ఆలోచించకుండా కేవలం ఆహారంపైనే దృష్టి పెట్టడం వల్ల రోజంతా ఉన్న ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అందుకే చేత్తో తినడం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడం మాత్రమే కాదు, అదొక గొప్ప మానసిక ఉపశమనం.