Fruits for workout: ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌లో వ్యాయామం ఎంత ముఖ్యమో, దానికి తగిన పోషకాహారం అందించడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో వర్కవుట్ చేస్తుంటారు. కానీ ఇది త్వరగా అలసిపోయేలా చేస్తుంది. వర్కవుట్‌కు 30-45 నిమిషాల ముందు ఏదైనా ఒక ఫ్రూట్ తిన్నా కూడా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. పండ్లలో ఉండే సహజ చక్కెరలు (ఫ్రక్టోజ్), ఫైబర్, విటమిన్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచి, వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు అవసరమైన ఇంధనాన్ని అందిస్తాయి. దీని వల్ల మీ పనితీరు మెరుగుపడటమే కాకుండా.. కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. వర్కవుట్‌కు ముందు ఎలాంటి ఫ్రూట్స్ తినాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే ఫ్రూట్స్ ఎందుకు తినాలి ?
1. తక్షణ శక్తి లభిస్తుంది: పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ , సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలోకి త్వరగా చేరి, మెదడుకు, కండరాలకు తక్షణ శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా అరటిపండు వంటి పండ్లు కార్బోహైడ్రేట్లకు నిలయాలు, ఇవి వ్యాయామం పూర్తయ్యే వరకు మీ శక్తి స్థాయిలను పడిపోకుండా చూస్తాయి.
2. జీర్ణక్రియకు సులభం: ఎక్కువగా ఆహారం తిని వ్యాయామం చేయడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. కానీ పండ్లు తేలికగా ఉండి, త్వరగా జీర్ణమవుతాయి. వీటిలోని ఫైబర్ నెమ్మదిగా శక్తిని విడుదల చేయడానికి సహాయ పడుతుంది. దీనివల్ల వర్కవుట్ మధ్యలో ఆకలి వేయదు.
3. ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత: వ్యాయామం చేసేటప్పుడు చెమట ద్వారా పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను కోల్పోతాము. అరటిపండ్లు, నారింజ వంటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాలు పట్టేయకుండా కాపాడుతుంది. అంతే కాకుండా గుండె స్పందనను క్రమబద్ధీకరిస్తుంది.
4. యాంటీ ఆక్సిడెంట్ల రక్షణ: బెర్రీలు, యాపిల్స్, ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. పండ్లలోని పోషకాలు కణాల నష్టాన్ని నివారించి, కండరాలు త్వరగా కోలుకోవడానికి తోడ్పడతాయి.
5. హైడ్రేషన్ : పుచ్చకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే వర్కవుట్ చేసేటప్పుడు శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా ఇవి కాపాడతాయి.
Also Read: డయాబెటిస్ తగ్గుతుంది కానీ.. కిడ్నీలపై కాకరకాయ ప్రభావం ఇదే !
ఏ పండ్లు ఎంచుకోవాలి?
అరటిపండు: ఇది బెస్ట్ ప్రీ-వర్కవుట్ ఫుడ్. ఇందులోని పొటాషియం కండరాల పని తీరును మెరుగు పరుస్తుంది.
యాపిల్: దీనిలోని పీచు పదార్థం, సహజ చక్కెరలు స్థిరమైన శక్తిని ఇస్తాయి.
నారింజ: విటమిన్ సి, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
దానిమ్మ: శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
వ్యాయామం కేవలం కష్టపడటం మాత్రమే కాదు.. శరీరానికి సరైన ఇంధనాన్ని అందించడం కూడా.. రేపటి నుంచి మీ ఉదయం వర్కవుట్‌కు 30 నిమిషాల ముందు ఒక అరటి పండు లేదా యాపిల్ తిని చూడండి. మీ పని తీరులో మార్పును మీరే గమనిస్తారు.