Akhil Akkineni:సిసింద్రీ(Sisindri) మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. అఖిల్ , హలో వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న అఖిల్(Akhil).. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఆ ఎదురుచూపుకు తెరపడుతూ ఎట్టకేలకు ఈ ఏడాది తన ఖాతాలో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని చేర్చుకున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు(Murali Kishore abburu)దర్శకత్వంలో.. అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే(Bhagya Shri Borse) హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘లెనిన్’.. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. 15 రోజుల్లో రూ.65 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 100 కోట్ల టార్గెట్ గా దూసుకుపోతోంది. మరొకవైపు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అఖిల్.. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే కాకుండా తన తల్లి అక్కినేని అమల (Akkineni Amala) స్థాపించిన ‘బ్లూ క్రాస్’ వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.
9 నెలల వయసులోనే సిసింద్రీ చిత్రంలో ప్రధాన పాత్రతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అఖిల్. ఇక ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “నాకు 8 లేదా 9 నెలల వయసున్నప్పుడు సిసింద్రీ సినిమాలో నటించాను. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి భారీ లాభాలను అందించింది . ఆ లాభాలతోనే మా అమ్మ ‘బ్లూ క్రాస్’ సంస్థను ప్రారంభించింది. అయితే ఆ సినిమా సమయంలో నాపై ఎలాంటి రిస్కు తీసుకోకూడదని మా నాన్న భావించారు. అందుకే తన సన్నిహితుల సహకారంతోనే ఈ చిత్రీకరణ చేపట్టారు. నేను రోజుకు నాలుగు గంటలు మాత్రమే మెలకువగా ఉండేవాడిని. ఆ సమయంలో కూడా నా మూడ్ బాగుంటేనే షూటింగ్ చేసేవారు. 10 గంటల పాటు పడుకునే వాడిని . బాబు లేస్తేనే షూటింగ్.. బాబు నవ్వితేనే షూటింగ్ అన్నట్టుగా సాగింది.
also read:ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. సంచలన పోస్ట్ చేసిన జ్యోతిక!
ఈ సినిమాలో నేను నవ్వాల్సిన సన్నివేశాలలో కెమెరా వెనుక మా నాన్న నిలబడి సైగలు చేస్తే.. నేను నవ్వేవాడిని. ఏడవాల్సిన సన్నివేశాలలో మా అమ్మ కారు ఎక్కి వెళ్ళిపోతే అది చూసి నేను ఏడ్చే వాడిని.. నా భావాలను కెమెరా వాళ్ళు క్యాప్చర్ చేసేవారు. ఇలా ఎన్నో వినూత్న పద్ధతులతో సిసింద్రీ మూవీ ని తెరకెక్కించారు. ముఖ్యంగా మా అమ్మ దగ్గర ఉన్న ఫీలింగ్ కలగాలంటే ఆమని గారు మా అమ్మ కట్టుకున్న చీర కట్టుకునే వారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా నన్ను ఇబ్బంది పెట్టకుండా.. మా నాన్న చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సెట్లో వాళ్లు కూడా నన్ను అంతే జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ సినిమా విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నాకు ఫిలింఫేర్ అవార్డును కూడా అందించింది. పైగా నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన చిత్రం కూడా అదే” అంటూ అఖిల్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం అఖిల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా అందించిన లాభాలతోనే బ్లూ క్రాస్ పెట్టామని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.