Akkineni Multistarrer:టాలీవుడ్ లో ఎన్ని సీజన్లు వచ్చినా సంక్రాంతి సీజన్ కి ఉండే క్రేజే వేరు. అలాంటి పండక్కి ఇప్పటికె చిరు, బాలయ్య, వెంకి ఖర్చీప్ వేసుకొని సిద్ధం కాగా ఇపుడు నేనూ బరిలోకి దిగుతానంటూ రెడీ అవుతున్నాడు కింగ్. నిజానికి పొంగల్ ని నాగ్ టార్గెట్ చేస్తూ మళ్లీ ‘బంగార్రాజు’ గెటప్‌లో వస్తున్నాడనే న్యూస్ వినడానికి బాగానే ఉన్నా కాస్త డెప్త్ గా ఆలోచిస్తే అసలు విషయం కంటే ‘సేఫ్ గేమ్’ ఆడే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తుంది.
అక్కినేని ఫ్యాన్స్‌కు కూడా బోర్ కొట్టించేదే
నిజానికి కళ్యాణ్ కృష్ణ తీసిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సాలిడ్ సక్సెస్ చూసిందే. కానీ అది హిట్టయిందని అదే నాస్టాల్జియాను పదే పదే అమ్ముకోవాలని చూడటం అక్కినేని ఫ్యాన్స్‌కు కూడా బోర్ కొట్టించేదే. ఇప్పటికే ఇండస్ట్రీ అంతా సరికొత్త కథల వేటలో పడితే అక్కినేని వారు మాత్రం ఇంకా ఇంకా పాత కాలపు ఫార్ములాలు, మాయలు, మంత్రాల చుట్టూ తిరిగే కథలనే నమ్ముకుంటున్నారంటే కెరీర్ ని రిస్క్ లో పడేస్తున్నట్టే.
అయితే ఈసారి మాములుగా నాగ్ సింగిల్ గా రాకుండా తన ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ ను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకురావడమే ఇపుడు కొత్త డిబేట్లకి దారి తీస్తుంది. నిజానికి చూడ్డానికి ఇదొక క్రేజీ మల్టీస్టారర్ లా కనిపిస్తుంది. కానీ హిట్స్ చూడలేక పోతున్న కొడుకులని ఇందులోకి కావాలనే తీసుకొచ్చి వాళ్ళకి హిట్టు ఇవ్వడమే లక్ష్యంగా నాగ్ ఈ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడన్న కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయ్.
సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న హీరోలు
రియాలిటీగా చూస్తే నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ తమ కెరీర్‌లో సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న వారే.చైతు తండేల్ తో కాస్త పర్లేదనిపించినా సక్సెస్ అంతా సాయి పల్లవికే వెళ్ళిన పరిస్థితి.ముఖ్యంగా అఖిల్ ‘ఏజెంట్’ వంటి డిజాస్టర్ తర్వాత తనని తానూ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇది. అలాంటిది స్వంతంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిన వీరు ఇలా తండ్రి చాటు బిడ్డలుగా మళ్ళీ ఫ్యామిలీ డ్రామాలో కనిపించడం వారి ఇండివిడ్యువల్ స్టార్‌డమ్‌కు ఏమాత్రం ప్లస్ అవుతుందో వారికే తెలియాలి. ముగ్గురు హీరోలను ఒకే సినిమాలో ఇరికిస్తే ఎవరి పాత్రకూ సరైన జస్టిస్ జరగకపోగా, స్క్రీన్ స్పేస్ కోసం కథను పక్కదారి పట్టించే ప్రమాదం పుష్కలంగా ఉంది.
పాత చింతకాయ పచ్చడి లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
మరోవైపు ప్రస్తుతం ఇండియన్ సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు పాన్ ఇండియా రేంజ్ యాక్షన్ డ్రామాలను, సాలిడ్ కంటెంట్‌ను కోరుకుంటున్నారు. ఇలాంటి టైమ్‌లో కేవలం ‘సంక్రాంతి’ సీజన్‌ను అడ్డం పెట్టుకుని పాత చింతకాయ పచ్చడి లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వస్తే జనం థియేటర్ల వైపు కనీసం చూడకపోవచ్చు కూడా. కళ్యాణ్ కృష్ణ గతంలో హిట్లు ఇచ్చినప్పటికీ ముగ్గురు అక్కినేని హీరోలను హ్యాండిల్ చేసే సత్తా ఆయనకు ఉందా అన్నది కూడా అనుమానమే. కేవలం ‘బంగార్రాజు’ అనే బ్రాండ్ నేమ్ చుట్టూ తిరిగితే అది మరో ‘మిక్స్డ్ టాక్’ సినిమాగా మిగిలిపోవడం ఖాయం.
పెద్ద పెద్ద హీరోలకే కేవలం స్టార్‌డమ్ సరిపోదు, బలమైన కంటెంట్ ఉండాలని బాక్సాఫీస్ పాఠాలు నేర్పిస్తున్న టైంలో అక్కినేని ఫ్యామిలీ కేవలం తమ ఫేస్ వాల్యూతో సినిమాను నెట్టుకొస్తామనుకోవడం భ్రమే. దీనికి తోడు పోటీలో వేరే పెద్ద సినిమాలు ఉంటే ఈ రొటీన్ డ్రామాను ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించే అవకాశమే ఎక్కువ. చూడాలి మరి కలిసి దిగుతామంటున్న అక్కినేని హీరోలకి పొంగల్ ఎలా కలిసి వస్తుందో!
also read:‘సెకండ్ హ్యాండ్’ స్క్రిప్ట్‌తోనే సరిపెట్టుకుంటున్న రౌడీ స్టార్?