చిలుకకు చెప్పినట్టు చెప్పిండట పెద్దసారు జనాలకు. ఏమని? కాంగ్రెస్‌కు ఓటెయ్యకండని. అయినా వినలేదట జనాలు. పోలోమని అంతా కాంగ్రెస్‌కే గుద్దిర్రట. ఇగ చెప్పంగ ఇననోడిని చెడంగ చూడాలంటరు పెద్దలు. ఇప్పుడు పెద్దసారు గదే చేస్తున్నడట. ఇప్పుడు గీ ముచ్చటెందుకొచ్చిందని అనుకుంటున్నవ? గదే నిన్న జగితాల మీటింగుల చెప్పలే. గప్పుడు చెప్పిన గా మాటలు మల్లా గుర్తు చేసి తెగ బాధపడ్డడు. అవును .. ఆయన మాకే ఓటెయ్యుర్రని చెబితే అయిపోవు గదా..! గా కాంగ్రెస్‌కు ఎయ్యకుర్రి ఎయ్యకుర్రి అని ఎందుకు చెప్పినట్టు.
ఏమో ఆయనకు గప్పటికే డౌటేమన్నా ఒచ్చిందేమో. అటే ఏస్తరని. ఆళ్ల సైడే సూస్తుండ్రని. అవ్.. అందుకే చిలుకకు చెప్పినట్టు చెప్పిన అని అంటుండు.అంటే బుదిరికిచ్చిండా? బెదిరిచ్చిండా? అంటే… అంటే.. బుదిరికిచ్చుకుంటనే బెదిరిచ్చిండు. ఏహె.. ఈడ బెదిరిచ్చుడేండుంది? అటు ఓటేస్తే నాకేం కాదు.. మీకే నష్టమని కూడా చెప్పిండు. పోయి ఫామ్‌హౌజుల పంటనని కూడా చెప్పిండు. అవు మరి గంతగనం మంచిగా చిలుకకు చెప్పినట్టు చెప్పినా.. జనం ఎందుకినలేరంటవు? జనం విసుగెత్తిపోయిర్రా బై. ఎందుకు? ఎందుకంటవేంది? ఇచ్చినోడికే టికెట్లిచ్చిండు. ఆడినే మూడు సార్లు నెత్తిమీద పెడతానంటే జనానికి విసుగు రాదా? అసహ్యం రాదా? కోపం రాదా? ఎందుకొస్తది?? వాళ్లు చేసిన ఘనకార్యాలు చాలనే ఉన్నయ్.
పెద్దాయన ముఖం చూసి ఒక్కసారేశినం….. రెండోసారి భరించినం.. ఇగ ఎవడూ లేనట్టు.. ఆళ్లకే ఇయ్యవట్టే. మార్చుమని చెప్పినా… మార్చలే. ఎవలూ దొరకకనా? ఉన్నోడ్ని కాదని ఎవనికి ఇయ్యలేకనా? నేను కుక్కను పెడితే కుక్కకేస్తరు అనే ధీమానా? అయితే అందరూ అసొంటోళ్లేనా! ఏ పాపం.. అందరు కాద్రా బై. కానీ చానా మందే జమైర్రు. రెండు టర్ములు కదా.. బాగా మితిమీరిపోయిర్రు. పెయ్‌ల భయం లేకుండా వోయింది. గంతదాన్కే ఆయన్నోడగొట్టిర్రా! అదే కాదు.. పెద్దసారు సుక మస్తు తప్పులు చేసిండ్రా? గాయనేం చేసిండే..! ఎప్పుడు సూసినా తెలంగాణ .. తెలంగాణ అనుడే తప్ప పాపం… ఇంకోటి తెల్వదు కదా.
అగో గా తెలంగాణనే లేకుండా చేస్కుండు. పార్టీ పేర్ల కెళ్లి తెలంగాణ తీసేసి ఇగ దేశాన్ని ఉద్దరిస్తందుకు వోయిండు. మహారాష్ట్రలకు వొయ్యి ఇక్కడి పైసలు కర్చు చేసుడు షురూ చేసిండు. గాడేడ్నో రైతులు సచ్చివోతే మన కాడికెళ్లి పైసలు తీస్కవొయ్యి ఆళ్లకు పంచిండు. మంచిదే గార.. మన తెలంగాన పేరు దేశ మొత్తం తలుచుకోవాలనే శేషుంటడు. ఈడ ఇంక బతుకులే సక్కవడ్లే. అంతా గవే ఏడుపులు. ఇంకా ఎవని సంసారం కుదటవడ్లే. ఇగ అంతా బంగారుతున్క అయిపోయింది ఈడ.. అని ఎగేసుకుని దేశాలు పట్క తిర్గవట్టెర. దళితబంధని వెట్టిండు.
ఇగో శూసినవా.. నేను పెట్టిన స్కీము.. మీరేనాడైనా ఇసొంటియ్యి వెట్టిర్రా అని ఆళ్ల కాడికి వోయి ఎక్కిరిచ్చినట్టు చేసిండు. ఈడ సక్కగా అమలే లేకపాయె.. నేనే నెంబర్ వన్.. దేశంలనే నాయసొంటి సిపాయి లేడని ఇగ చెప్క తిర్గిండు. తిక్కరేగింది ఈడ పబ్లిక్కు. కాపలా కుక్క లెక్క ఉంటనన్నవ్. ఇప్పుడేమో మేమే కండ్లకు కనవడ్తలేమా? అని కోపానికొచ్చిండ్రు. అయినా ఇన్లే. నేనేం చేసినా తెలంగాణ కోసమేనన్నడు. కానీ ఎందుకో ఈ తేప పెద్దసారును నమ్మబుద్దికాలేరా? ఫస్టులనే అన్నడు. మాది ఫక్తు రాజకీయ పార్టీ అని. గప్పుడు అర్థంకాలె. ఇగో పదేండ్లు పట్టింది. ఇగ ఎంత చెప్పినా ఇనబుద్దికాలె. ఆయన చిలుకకు చెప్పనట్టు చెప్పినా.. ఇనలే. ఇగో ఇప్పుడొచ్చి మళ్లా దెప్పి పొడుస్తుండు.. మంచిగైంది మంచిగైందని సంకలు గుద్దుకుంటుండు. ఇగ మనసారు మారెదెప్పుడ్రా? మనమే మారినమంటుండు. ఆయన మాత్రం అట్లనే ఉంటడంట. గందుకే అన్నరు చెప్పంగ ఇననోడ్ని చెడంగ చూడాలని.