Bharathiraja Death: చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. తనదైన అద్భుతమైన కథా చిత్రాలతో, గ్రామీణ నేపథ్యాలతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో పరిశ్రమకు పరిచయమై, స్టార్స్‌గా ఎదిగిన ప్రముఖ నటులు ఆలీ, ముచ్చర్ల అరుణ ఈ వార్త విని తట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ఒక షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల తమ గురువుగారిని ఆఖరి చూపు చూసేందుకు చెన్నై వెళ్లలేకపోతున్నామని వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
Read also-దర్శకుడు భారతీరాజాకు నివాళులర్పించిన సినీ ప్రముఖులు.. సీఎం విజయ్ అయితే..
భారతీరాజా గారి మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని నటుడు ఆలీ ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక దర్శకుడు గొప్పవాడైతేనే నటుడు అనేవాడు పుడతాడు. శివాజీ గణేశన్ వంటి మహానటుడిని డైరెక్ట్ చేసిన గొప్ప హిస్టరీ భారతీరాజా గారిది. తెలుగులో ఆయన తెరకెక్కించిన క్లాసిక్ మూవీ ‘సీతాకోక చిలుక’ సినిమా విడుదలై దాదాపు 46 ఏళ్లు అవుతోంది. ఆ సినిమాతోనే ముచ్చర్ల అరుణ గారిని హీరోయిన్‌గా, నన్ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆయన పరిచయం చేశారు. ఆ ఒక్క సినిమాతోనే ఇద్దరం స్టార్స్ అయ్యాం. ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగువాడికి ఆలీ తెలుసంటే దానికి కారణం భారతీరాజా గారు పెట్టిన భిక్షే. ఆయన వల్లే ఇవాళ వందలాది సినిమాలు చేస్తూ ఒక నటుడిగా ఈ స్థాయిలో నిలబడ్డాను” అని ఆలీ భావోద్వేగానికి లోనయ్యారు.
గతంలో భారతీరాజా గారి 85వ జన్మదినం సందర్భంగా తాను, సీనియర్ నటి రాధిక కలిసి చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపామని, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. “ప్రస్తుతం ఇక్కడ ‘కుక్ విత్ జాతిరత్నాలు’ షూటింగ్‌లో ఉన్నాము. ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కూడిన భారీ యూనిట్ ఇక్కడ ఉంది. ఈ సమయంలో షూటింగ్ ఆపేసి చెన్నై వెళ్లలేని పరిస్థితి. ఇవాళ గనక షూటింగ్ లేకపోతే ఎలాగైనా వెళ్లి నా గురువుగారి ఆఖరి చూపు చూసుకునేవాడిని” అంటూ ఆలీ విచారం వ్యక్తం చేశారు.
Read also-YRF స్పై యూనివర్స్ నుంచి ‘ఆల్ఫా’ టీజర్ అవుట్.. యాక్షన్ మోడ్‌లో అలియా భట్..
తమను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువుగారు ఇక లేరనే నిజాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని నటి ముచ్చర్ల అరుణ అన్నారు. “ఇవాళ నేను ఒక ఆర్టిస్ట్‌గా మీ ముందు ఉన్నానన్నా.. సమాజంలో ‘ముచ్చర్ల అరుణ’గా నాకు గుర్తింపు ఉందన్నా.. అందులో మా గురువుగారు భారతీరాజా గారి పాత్ర ఎంతో కీలకం. ఆయన మొదట నన్ను తమిళంలో పరిచయం చేసి, ఆ తర్వాత ‘సీతాకోక చిలుక’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. మనుషులు పక్కన ఉన్నప్పుడు వారి విలువ పూర్తిగా తెలియదు, కానీ దూరమయ్యాక ఆ బాధ వర్ణనాతీతం. మా గురువుగారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి భారతీరాజా చేసిన సేవలు అనన్యసామాన్యమైనవని, ఆయన భౌతికంగా దూరమైనా ఆయన సృష్టించిన అద్భుతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారని చిత్ర పరిశ్రమ నివాళులర్పిస్తోంది.
భారతీరాజా మృతి.. కంటతడి పెట్టిన ముచ్చెర్ల అరుణ, ఆలీ ఎమోషనల్ వీడియో#bharatiraja #ali #mucherlaaruna #bharathiraja pic.twitter.com/sSfYI4Rxqp
— Rajababu Anumula (@Rajababu_a) June 10, 2026