Hariteja: తెలుగు వెండితెరపై తనదైన వాయిస్, కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హరితేజ (Hariteja). ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ చిత్రంలో ఆమె పోషించిన పనిమనిషి పాత్ర ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో హరితేజ ఇంటింటికీ చేరువయ్యారు. అయితే, ఆ పాపులారిటీ ఆమె కెరీర్‌కు ఒక రకంగా శాపమైందని తాజాగా ఓ మూవీ ఈవెంట్‌లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నటిగా తనలోని వైవిధ్యాన్ని చాటుకోవాలని ఉన్నా, పరిశ్రమలో ఒకసారి ఒక పాత్ర క్లిక్ అయితే.. అదే తరహా పాత్రల కోసం నిర్మాతలు, దర్శకులు క్యూ కడతారని, తన విషయంలోనూ అదే జరిగిందని హరితేజ చెప్పుకొచ్చారు.
Also Read- Anthology Movie OTT : గుజరాతీ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి… ముచ్చటగా మూడు కథలతో
చాలా కాలం పాటు హరితేజ అంటే కేవలం కామెడీ చేసే పనిమనిషి పాత్రలకే పరిమితం అనే ముద్ర పడిపోయింది. దీనివల్ల ఆమెకు వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం తలుపు తట్టలేదు. దీనిపై స్పందిస్తూ.. ‘‘ఒక నటిగా నాకు అది చాలా నిరాశ కలిగించింది. ఆ ఇమేజ్‌లో ఇరుక్కుపోయి చాలా కాలం గడిచింది. కానీ, గత రెండేళ్లుగా అయితే పరిస్థితి మారిందనే చెబుతాను’’ అని హరితేజ తెలిపారు. ప్రస్తుతం మేకర్స్ తనను వేర్వేరు కోణాల్లో చూస్తున్నారని, కొత్త తరహా పాత్రలతో తన ముందుకు వస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నెమ్మదిగా ఆ పాత పనిమనిషి ఇమేజ్ నుంచి బయటపడుతున్నానని, తనలోని అసలైన నటిని నిరూపించుకునే సమయం ఆసన్నమైందని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read- Anil Ravipudi: ఆ బ్యానర్‌లో అనిల్ రావిపూడి యానిమేషన్ ఫిల్మ్.. వాస్తవమిదే!
సినిమా ఇండస్ట్రీలో ఒకే తరహా పాత్రలు చేయడం, రావడం కొత్తేమీ కాదని, ప్రతిభ ఉన్న ఎంతోమంది నటులు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారని హరితేజ వాస్తవాల్ని కుండబద్దలు కొట్టారు. ఒక్కసారి ఒక రోల్ హిట్ అయితే, ప్రేక్షకులు కూడా ఆ నటుడిని అదే కోణంలో చూడాలని కోరుకుంటారు, మేకర్స్ కూడా రిస్క్ తీసుకోకుండా అవే ఆఫర్లు ఇస్తుంటారని.. అలా నేను కూడా ఒకే పాత్రలో ఇరుక్కుపోయానని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘లేచింది మహిళా లోకం’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న హరితేజ.. దర్శకులు తనను నమ్మి వైవిధ్యమైన పాత్రలు ఇస్తే తన సత్తా ఏంటో చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ సవాల్ తర్వాత ఆమెకు ఎలాంటి పాత్రలు వస్తాయో, ఎలా తనని తాను నిరూపించుకుంటుందో తెలియాలంటే మాత్రం.. ‘లేచింది మహిళా లోకం’ (Lechindi Mahila Lokam) మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలోని తన పాత్రకు కనుక పేరొస్తే.. ముందు ముందు మరిన్ని మంచి పాత్రలు ఆమె కోసం క్యూ కట్టడం ఖాయమని చెప్పుకోవచ్చు.
Also Read- Peddi Song: ‘రై రై రా రా’.. చరణ్ హుక్ స్టెప్‌ను దించేసిన స్కూల్ పాప.. వీడియో వైరల్!