Jana Nayagan Review: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ వెండితెరకు గుడ్ బై చెప్పేసి తీసిన ఆఖరి సినిమా ‘జననాయగన్’.ఇక ఈ సినిమా కోసం తమిళనాడుతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఏ స్థాయిలో వెయిట్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్‌లోనే ఇది గ్రాండ్ సెండాఫ్ అవుతుందని, థియేటర్లలో పూనకాలు ఖాయమని అందరూ కొండంత ఆశలు పెట్టుకున్నారు.మరి ఫ్యాన్స్ ఆశించినట్టుగా సినిమా దళపతికి గ్రాండ్ ఫేర్ వెల్ అయిందా ? అంచనాలు భారీగా మోసిన ఈ జననాయకుడు వాటిని అందుకున్నాడా ..? రండి రివ్యూలో చూసేద్దాం.
కథ
కథ విషయానికి వస్తే పోలీస్ ఆఫీసర్ అమ్రేష్ పూజారి (బాబీ డియోల్). దుర్మార్గుడైన పొలిటికల్ లీడర్ రోజా (ప్రకాష్ రాజ్) చేసే అరాచకాలను అడ్డుకోవాలని చూస్తాడు. కానీ రోజా తన అండదండలతో వేలాదిమంది ముందే అమ్రేష్‌ను ఘోరంగా అవమానిస్తాడు. ఆ పరాభవాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలనుకున్న అమ్రేష్ పూజారిని అతడి లోని ఆత్మ వచ్చి నిలదీస్తుంది. నీతి, నిజాయితీలకు ఈ సమాజంలో పైసా విలువ లేదని, అడుగడుగునా నీచత్వం నిండిపోయిన ఈ జనం కోసం ప్రాణాలు త్యాగం చేయడం అమాయకత్వమని కడిగేస్తుంది. కులమతాలు, పైసలు, మద్యానికి బానిసలైన ప్రజల కోసం ప్రాణాలు తీసుకోవడం వేస్ట్ అని అనుకున్న అమ్రేష్.. అక్కడికక్కడే పూర్తిగా మారిపోతాడు. సమాజంపైనే కక్ష గట్టి, చెడు మార్గంలోనే వెళ్లి దేశాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తాడు.
ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయి క్రిమినల్‌గా ఎదుగుతూ ప్రపంచదేశాలకే సవాలుగా మారతాడు. ఇక ఇండియాను కూడా దెబ్బకొట్టాలని అమ్రేష్ వేసే ప్లాన్లను ‘వెట్రి’ (విజయ్) ఏ విధంగా తిప్పికొట్టాడు? అసలు ఈ వెట్రి ఎవరు? అమ్రేష్ పూజారీకి, వెట్రికి ఉన్న అసలు సంబంధమేంటి? వినాశనం వైపు వెళ్తున్న దేశాన్ని వెట్రి తన మాస్ పవర్ తో ఎలా కాపాడాడు అనేదే సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
సినిమాకి దర్శకుడు హెచ్. వినోత్ టేకింగ్ ఈ సినిమాకు అత్యంత పెద్ద మైనస్ గా మారింది. గతంలో ‘చతురంగ వేట్టై’ (2014), ‘ధీరన్ అధికారం ఒండ్రు’ (2017) లాంటి సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్లతో పాటు అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’ (2019), ‘వాలిమై’ (2022) లాంటి భారీ యాక్షన్ చిత్రాలు తీసిన వినోత్.. ఈ ఆఖరి సినిమా కథ, స్క్రీన్‌ప్లే విషయానికొస్తే తీవ్రంగా నిరాశపరిచాడనే చెప్పాలి.స్క్రిప్ట్ మీద అస్సలు కసరత్తు చేయలేదని ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది కూడాఇక ఆయన రాసుకున్న సబ్‌ప్లాట్లు చాలా పాతకాలం నాటి రొటీన్ ఫార్ములాను గుర్తుచేస్తే అది మీ తప్పు కాదు.
ఎవరెలా చేశారంటే
సినిమాలో కొంచెం ప్లస్ ఏదైనా ఉందంటే అది కేవలం అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే. తన మార్క్ మ్యూజిక్‌తో వీక్ ఉన్న సీన్లను కూడా సాధ్యమైనంత వరకు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన చరిష్మా ఎప్పటిలాగే అదిరిపోయాయి. రెండు మూడు ఎలివేషన్ బ్లాక్స్‌లో విజయ్ నటన, ఆయన మాస్ ఆటిట్యూడ్ అభిమానులకు కొంతలో కొంత కిక్ ఇస్తాయి. అయితే ఇవి ఏవీ కూడా సినిమాను ప్లాప్ నుండి తప్పించలేకపోయాయి.
ఇక విలన్ పాత్ర విషయానికొస్తే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ను రంగంలోకి దించారు. కాని ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ దారుణంగా తయారైంది. విలనిజంతో థియేటర్లలో భయం పుట్టించాల్సింది పోయి, ఆయన చేసే పనులు చూసి జనాలు పడి పడి నవ్వే పరిస్థితి వచ్చింది. అసలు ఆయన సీరియస్ విలనా లేక కామెడీ క్యారెక్టరా అనే డౌట్ ఆడియన్స్ కి రావడం పక్కా.
ఇక కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అని పబ్లిసిటీ చేశారు కానీ, స్క్రీన్ మీద ప్రొడక్షన్ వాల్యూస్, వీఎఫ్ఎక్స్ చూస్తే చాలా నిరాశ కలిగిస్తాయి. ఆ బడ్జెట్ అంతా ఏమైపోయిందో అర్థం కాని పరిస్థితి. ఎడిటింగ్ కూడా అసలు సింక్ లేకుండా, ఎక్కడపడితే అక్కడ కట్ చేసి అతికించినట్టు ఉంది. ఒరిజినల్ సినిమాలో ఉండే కోర్ ఎమోషన్‌ను ఇక్కడ మ్యాచ్ చేయడానికి ప్రయత్నించారు కానీ, అది ఏ దశలోనూ ప్రేక్షకుల మనసుకు హత్తుకోదు. ఇక క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల ఓపికకు పెద్ద పరీక్షే పెడుతుంది. ఎప్పుడెప్పుడు థియేటర్ నుంచి బయటపడదామా అనే ఫీలింగ్ వస్తే మన తప్పు అస్సలు లేదు.
ప్లస్ పాయింట్స్
మైనస్ పాయింట్స్
ఇక ఇండస్ట్రీ అంతా కోడై కూసినట్టుగా ఈ సినిమా మెయిన్ ప్లాట్ అంతా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమానే. ఆ కథకు అమ్రేష్ పూజారీ అనే అంతర్జాతీయ క్రిమినల్ క్యారెక్టర్‌ని యాడ్ చేసి దర్శకుడు హెచ్.వినోద్ ఈ సినిమాను తీశాడు.అమ్రేష్ పూజారీ ఎపిసోడ్‌ని పక్కన పెడితే మిగతా కథంతా ‘భగవంత్ కేసరి’నే.
చివరిగా
ఏది ఏమైనా థియేటర్లలో బొమ్మ పడ్డాక ఫ్యాన్స్‌కి, మూవీ లవర్స్‌కి గట్టి షాకే తగిలింది. విజయ్ లాంటి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోకి ఇలాంటి ఫేర్‌వెల్ ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఒక సూపర్ స్టార్ ఆఖరి సినిమాని ఎంతో అద్భుతంగా తీసే అవకాశం చేతుల్లో ఉన్నప్పటికీ, మేకర్స్ దానిని పూర్తిగా వృథా చేశారనే చెప్పాలి.
also read :‘జన నాయగన్’ రెమ్యునరేషన్స్.. విజయ్ ఒక్కడికే అన్ని కోట్లా?