Chinese Actor Jin Ze Dies at 33: చైనా సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కెరీర్‌లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ప్రముఖ నటుడు జిన్ జే (Jin Ze) అకస్మాత్తుగా కన్ను మూశారు. నిన్నమొన్నటి వరకు స్క్రీన్‌పై వెలిగిపోయిన ఒక నటుడు, కేవలం 33 ఏళ్ల వయసులోనే అనంత లోకాలకు వెళ్లిపోయాడనే వార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న జాంగ్
జిన్ జే అసలు పేరు జాంగ్ జియావీ. 1993 జనవరి 30న షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో జన్మించిన ఆయన, చిన్నతనం నుంచే గ్లామర్ ప్రపంచం వైపు ఆకర్షితులయ్యారు. బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన జిన్ జే, తన అద్భుతమైన పర్సనాలిటీతో మొదట మోడలింగ్ రంగంలో సంచలనం సృష్టించారు. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది చైనీస్ మోడల్స్‌లో ఆయన ఒకరు. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో 2019లో టెలివిజన్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
also read :పెద్ది టికెట్ రేట్లపై హైకోర్టు సీరియస్.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కోర్టు!
లేడీ ఆడియన్స్ లో యమా క్రేజ్
కేవలం ఏడేళ్ల కెరీర్‌లోనే ఆయన సాధించిన గుర్తింపు సామాన్యమైనది కాదు. ‘హెల్లో జోవాన్’ డ్రామాతో నటుడిగా ప్రయాణం ప్రారంభించిన జిన్ జే, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ఫర్గెట్ యు రిమెంబర్ లవ్’ (2020) లో ఆయన నటనకు యువత ఫిదా అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘బిగిన్ అగైన్’, ‘లీగల్లీ రొమాన్స్’, ‘ఫేక్ ప్రిన్సెస్’, ‘101 మ్యారేజెస్’ వంటి రొమాంటిక్ సిరీస్‌లు ఆయనను స్టార్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా ‘డేంజరస్ లవ్’, ‘డీప్ లవ్ లవ్ అగైన్’ వంటి డ్రామాలు చైనా బయట ఉన్న అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా ఆయనను దగ్గర చేశాయి. చాక్లెట్ బాయ్ లుక్స్‌తో లేడీ ఆడియన్స్ లో ఆయన సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
విడుదలకు సిద్ధంగా ఉన్న Waiting For The Flowers To Bloom, Waiting For Your Return”
ఇటీవలి కాలంలో చైనాలో విపరీతమైన ఆదరణ పొందుతున్న వర్టికల్ మైక్రో డ్రామాల (స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రత్యేకంగా తీసే షార్ట్-ఫార్మ్ కంటెంట్) విభాగంలో జిన్ జే ఒక తిరుగులేని కింగ్‌గా అవతరించారు. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లపై కోట్లాది వ్యూస్ సాధిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన నటించిన సరికొత్త మైక్రో డ్రామా “Waiting For The Flowers To Bloom, Waiting For Your Return” విడుదలకు సిద్ధంగా ఉంది. చనిపోవడానికి కేవలం నెల రోజుల ముందే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయినట్లు, సెట్స్‌లో ఎంతో సంతోషంగా గడిపినట్లు ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంత చురుగ్గా ఉన్న వ్యక్తి సడన్‌గా లేడనే వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.
మిస్టరీగా మారిన జాంగ్ జియావీ డెత్
టాలెంట్ ఏజెన్సీ అధికారిక ప్రకటన ప్రకారం.. జూన్ 4, 2026న చైనాలోని హాంగ్‌జౌలో ఉన్న తన నివాసంలో జిన్ జే మృతి చెందారు. అయితే, ఈ విషయాన్ని జూన్ 6 వరకు అత్యంత గోప్యంగా ఉంచడం, ఆ తర్వాతే అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు అనేక అనుమానాలకు రేకెత్తిస్తుంది. అన్నిటికంటే పెద్ద మిస్టరీ ఏంటంటే.. ఆయన మరణించి ఇన్ని రోజులవుతున్నా ఇప్పటివరకు కుటుంబ సభ్యులు కానీ, ఆయనను మేనేజ్ చేసే ఏజెన్సీ కానీ మరణానికి గల కారణాన్ని (Cause of Death) బయటపెట్టలేదు.
దీంతో చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘వైబో’ (Weibo) లో దీనిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. హెవీ వర్క్ ప్రెజర్ వల్ల గుండెపోటు వచ్చిందా, లేదా నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు . చైనా ఇండస్ట్రీలో ఉండే ఒత్తిడి అని కొందరు అనగా, మరికొందరు పోలీసులు ఈ కేసును పూర్తిగా విచారించి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పుకార్లను నమ్మవద్దని ఏజెన్సీ కోరుతోంది.ఏది ఏమైనా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో, ఇంకా ఎన్నో వండర్స్ క్రియేట్ చేయాల్సిన 33 ఏళ్ల టాలెంటెడ్ యాక్టర్ ఇలా అర్ధాంతరంగా చనిపోవడం చైనా ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి.
also read :జాన్వీ కపూర్ బోల్డ్ సీన్స్ వివాదం.. ఇండైరెక్ట్‌గా బుచ్చిబాబుకు సపోర్ట్ చేసిన లేడీ డైరెక్టర్!