Annagaru Vostaru: సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉంటాయి. ఇక 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు తమిళ భాషలలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే తమిళంలో విడుదల కావాల్సిన విజయ్ జననాయగన్(Jananayagan) సినిమా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పలు సమస్యలు తలెత్తడంతో చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇలా జనవరి 9వ తేదీ విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడటంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాని తిరిగి సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ లేదా జనవరి 23వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలు చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతోంది. ఈ సినిమా వాయిదా పడటంతో మరొక తమిళ హీరో కార్తీ(Karthi) నటించిన సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar). ఈ సినిమా తెలుగులో అన్నగారు వస్తారు(Annagaru Vostaru) పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ విడుదల కావాల్సి ఉండగా, పలు ఫైనాన్స్ సమస్యల కారణంగా వాయిదా పడింది.
డిసెంబర్ 12వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా క్రిస్మస్ బరిలో రాబోతుందంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు అయితే తాజాగా విజయ్ జననాయగన్ సినిమా వాయిదా పడటంతో అదే రోజు కార్తీ వా వాతియార్ సినిమా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా కేవలం తమిళ వెర్షన్ మాత్రమే విడుదల చేస్తారా? లేదా తమిళంతో పాటు తెలుగు వర్షన్ కూడా విడుదల చేయబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు సినిమాలు కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..
ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమాలకు థియేటర్లు సరిపోని నేపథ్యంలో శివ కార్తికేయన్ పరాశక్తి తెలుగు వర్షన్ కూడా వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కార్తీ వా వాతియార్ తమిళ వర్షన్ మాత్రమే విడుదల కాబోతోందని తెలుస్తోంది. మరి ఈ సినిమా విడుదల గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేశారు అలాగే ఈ సినిమాకు 129.03 (“2 Hour’s 9 Mins 3 Sec”) రన్ టైం లాక్ చేశారు. ఇక విడుదల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈయనకు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించారు.
Also Read: Anaganaga Oka Raju Trailer: నాగార్జున వాయిస్ తో అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్!