Keerthy Suresh:చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని, అందరి దృష్టిని ఆకర్షించిన కీర్తి సురేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు గ్లామర్ పాత్రలతోనే కాదు.. మరొకవైపు లేడి ఓరియంటెడ్ పాత్రలతో కూడా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది. అలాంటి ఈమె మరో హీరోయిన్ రాధిక ఆప్టే (Radhika Apte) తో కలసి నటించిన వెబ్ సిరీస్ అక్క. అక్టోబర్ 30న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఇక మహిళలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, హోదా సంపాదించుకొని, తమ చుట్టూ ఉన్న వారిపై ఆధిపత్యం చెలాయించే కథాంశంతో ఈ సిరీస్ రూపొందినట్లు ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఇకపోతే తాజాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ముందుగా కీర్తి సురేష్ మాట్లాడుతూ..” ఆశయాలు ఉన్న మహిళలను చూసినప్పుడు కొందరిలో అభద్రతాభావం ఎందుకు కలుగుతుందో అర్థం కాదు.. ముఖ్యంగా కొంతమంది అభద్రతాభావంతో ఉన్న సహనటులతో కలిసి పని చేసిన సందర్భాలు కూడా నాకు ఎదురయ్యాయి. అయితే మొదట్లో వారి ప్రవర్తన చూసి నాలో ఏదో లోపం ఉందేమో అని అనిపించేది. కానీ షూటింగ్ ముగిసే సమయానికి అసలు విషయం అర్థమైంది. నాలోనే ఆ సమస్య ఉందని అనుకున్నాను.. వాస్తవానికి అవతలి వ్యక్తుల అభద్రతాభావమే నన్ను అలా ఆలోచించేలా చేసింది” అంటూ తెలిపింది కీర్తి సురేష్. మొత్తానికి అయితే ఎదుటి వ్యక్తుల ప్రవర్తన తనలో అనుమానాన్ని కలిగించిందని , కానీ చివరికి అసలు విషయం తెలిసి.. తనలో మార్పు వచ్చిందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
ఇకపోతే రాధిక ఆప్టే మాట్లాడుతూ..” మనకు అండగా నిలుస్తారని భావించిన మహిళలు కూడా కొన్ని సందర్భాలలో మనకు మద్దతు ఇవ్వకపోవచ్చు. కానీ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సినిమా సెట్లలో మహిళల సంఖ్య బాగా పెరిగింది. అందరినీ ఒకేలా చూడడం కూడా మెరుగుపడుతోంది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది.. అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే గతంలో ఇండస్ట్రీలో ఒకరిని చూసి మరొకరు ఓర్వలేక ఆడవారే ఆడవారికి శత్రువులుగా ఉండే వాళ్ళని, కానీ ఇప్పుడు కాలం మారుతోంది అంటూ రాధిక చెప్పుకొచ్చింది.
also read:ముఖేష్ కి ఏమైంది.. ఆమెను టార్గెట్ చేస్తూ మరీ దారుణంగా!
ఇక అక్క వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. కీర్తి సురేష్, రాధిక ఆప్టే తో పాటు మహేష్ మంజ్రేకర్, తన్వి అజ్మీ, అన్షూమన్ పుష్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహిళల ఆశయాలు, ఆధిపత్యం, పరస్పర సంబంధాల చుట్టూ సాగే ఈ వెబ్ సిరీస్ కి ధర్మరాజు శెట్టి దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.