Kona Venkat:బ్రహ్మానందం.. ఆడియన్స్ ని నవ్వించడంలో బ్రహ్మానందం ఎంత స్పెషల్ అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన తర్వాత కామెడీతో కడుపుబ్బా నవ్వించే నటులు చాలామంది వచ్చారు కూడా. అయితే, ప్రస్తుత తరంలో సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో బ్రహ్మి తర్వాత ఆ స్థానాన్ని కొట్టేశాడని ఆకాశానికి ఎత్తేశాడు ప్రముఖ రచయిత, నిర్మాత కోనా వెంకట్ .
‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆయన.. ఈ సినిమాలో నటించిన సత్య గురించి మాట్లాడుతూ, ఈ తరానికి మరో బ్రహ్మానందం దొరికాడని చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
కామ్రేడ్ కళ్యాణ్’ సూపర్ సక్సెస్ అవడంతో ఈ ఈవెంట్ లో కోనా వెంకట్ సినిమా టీమ్‌తో పాటు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా కోసం కష్టపడిన ప్రతి నటుడు, టెక్నీషియన్ తనకు కామ్రేడ్‌తో సమానమని చెప్పారు. కష్టాల్లోనూ, విజయాల్లోనూ మనతో పాటు నిలబడే వాళ్లే నిజమైన కామ్రేడ్స్ అని తెలిపారు. ఈ సినిమా జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, వారందరికీ ధన్యవాదాలు తెలిపడం విశేషం.
ఈ సందర్భంగా సినిమాలోని ‘ఒరియా పిల్ల’ పాట గురించి కూడా కోనా వెంకట్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో షూట్ చేసిన ఈ పాట అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని చెప్పారు. స్థానికుల నుంచి మంచి స్పందన రావడంతో, అక్కడి కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా సినిమా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఒక తెలుగు సినిమా పాట మరో రాష్ట్రంలోనూ ఇంతటి స్పందన తెచ్చుకోవడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.
ఇక ‘కామ్రేడ్ కళ్యాణ్’ గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని , దాదాపు రెండున్నరేళ్ల క్రితం కొంతమంది కలిసి ఈ ప్రయాణం, ఇప్పుడు ఇంతమంది ప్రేక్షకుల ఆదరణ పొందే స్థాయికి చేరుకుందని చెప్పారు. సినిమా నిర్మాణంలో డేట్లు, లొకేషన్లు, అనుమతులు, సెన్సార్ వంటి విషయాల్లో చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నామని వివరించారు.
ఒక దశలో ఇకపై నిర్మాణ బాధ్యతలు తీసుకోకుండా, కేవలం స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కొనసాగాలని కూడా అనుకున్నట్లు తెలిపారు.
అయితే, సినిమా విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కోనా వెంకట్ చెప్పారు. మొదట్లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధించడానికి సోలో రిలీజ్ కూడా ఒక కారణమై ఉండొచ్చని భావించానని, కానీ ఇతర పెద్ద సినిమా విడుదలైన సమయంలోనూ థియేటర్ ఫుల్ గా ఉండటాన్ని చూసిన తర్వాత తన అభిప్రాయం మారిందని వివరించారుసినిమా నిజంగా ప్రేక్షకులకు నచ్చితే, ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా వాళ్లు ఆదరిస్తారని చెప్పారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ విజయానికి ప్రధాన కారణం తెలుగు ప్రేక్షకులేనని స్పష్టం చేశారు.
సినిమా సక్సెస్‌లో హీరో శ్రీ విష్ణు కీరోల్ పోషించాడని చెప్పుకొచ్చాడు. రచయితలు రాసిన సీన్స్ కి తనదైన కామెడీ ని మిక్స్ చేసి ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేయడం శ్రీ విష్ణు ప్రత్యేకత అని మెచ్చుకున్నారు.ప్రస్తుతం హీరోలు సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారని దాని ప్రభావం థియేటర్లకు వచ్చే సినిమాల సంఖ్యపై కూడా పడుతోందని అలాంటి సమయంలో శ్రీ విష్ణు ప్రతి కొన్ని నెలలకు ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం పరిశ్రమకు మంచిదని తెలిపారు.మొత్తానికి సత్యని బ్రహ్మానందం తో పోలుస్తూ కోన చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ :రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!