Pregnancy After 50| సాధారణంగా 30 ఏళ్లు దాటిన తర్వాత గర్భధారణ గురించి మహిళలు ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అలాంటిది 50 ఏళ్ల వయసులో తల్లి కావడం అంటే మరింత ఆసక్తికరమైన విషయం. ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత హిల్లరీ స్వాంక్ 52 ఏళ్ల లేటు వయసులో మూడో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆమె గర్భవతి అయిన వార్త ఇప్పుడు మరోసారి ఆలస్యంగా తల్లి కావడం, దాని వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై చర్చకు దారితీసింది. అయితే ఈ వయసులో గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు ఉండవచ్చు? వైద్యుల పర్యవేక్షణ ఎందుకు అవసరం? తెలుసుకుందాం.
హాలీవుడ్ నటి హిల్లరీ స్వాంక్ తన భర్త ఫిలిప్ ష్నైడర్, మూడేళ్ల కవల పిల్లలతో కలిసి ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేక వీడియో షేర్ చేశారు. అందులో తన బేబీ బంప్పై వెలిగే చిన్నారి బొమ్మను చూపిస్తూ మూడోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించారు. 2023 ఏప్రిల్లో ఆమె 48 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చారు. వైద్యపరంగా 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భధారణను అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్గా పరిగణిస్తారు. వయసు పెరిగేకొద్దీ కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
వయసు ఎక్కువగా ఉన్న గర్భిణులకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో ప్రీక్లాంప్సియా సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలపై ప్రభావం చూపుతుంది. తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛపోవడం, బిపి తీవ్రంగా పెరిగి స్ట్రోక్ లేదా ముందస్తు ప్రసవం సంభవించవచ్చు.
గర్భధారణ సమయంలో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. దీనివల్ల శిశువు సాధారణం కంటే పెద్దగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రసవ సమయంలో సమస్యలు రావచ్చు. భవిష్యత్తులో తల్లికి టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
వయసు పెరిగేకొద్దీ అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతాయి. ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత సహజంగా గర్భం దాల్చడం చాలా అరుదు. కొందరు మహిళలు వైద్యుల సలహాతో సంతానోత్పత్తి చికిత్సలను పరిశీలించవచ్చు.
వయసు పెరిగే కొద్దీ గర్భస్రావం, మృతశిశు జననం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. శిశువులో క్రోమోజోమ్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
Also Read: విస్కీ ఎలా తాగితే రుచికరంగా ఉంటుంది? నీట్గా, ఐస్తోనా లేదా వాటర్తోనా
అధిక రక్తపోటు, మధుమేహం లేదా ఇతర సమస్యల కారణంగా సిజేరియన్ అవసరం కావచ్చు. 37 వారాలు పూర్తికాకముందే శిశువు జన్మిస్తే దాన్ని ముందస్తు ప్రసవం అంటారు. అలాంటి శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరం కావచ్చు.
Also Read: అతనంటే ఎంతో ఇష్టం.. కానీ ఐ లవ్ యు చెప్పడానికి భయం.. మనసులో మాట చెప్పేందుకు టిప్స్
వయసు ఎక్కువగా ఉన్న ప్రతి గర్భిణికి సమస్యలు వస్తాయని చెప్పలేం. సరైన వైద్య సంరక్షణతో చాలామంది ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిస్తారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, అల్ట్రాసౌండ్ స్కాన్లు, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. గర్భధారణకు ముందు గైనకాలజిస్ట్ను సంప్రదించడం కూడా అవసరం.
గమనిక: ఈ కథనంలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సలహా కోసం వైద్య నిపుణుడిని సంప్రదించాలి.