Lagaan ReRelease: కొన్ని సినిమాలు వస్తుంటాయి..పోతుంటాయి.కాని కొన్ని సినిమాలు పాతుకుపోతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి లగాన్. ఇప్పుడు ఈ ఐకానిక్ స్పోర్ట్స్ డ్రామా తన 25వ వార్షికోత్సవాన్ని (సిల్వర్ జూబ్లీ) పురస్కరించుకుని మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఒక తరం ప్రేక్షకులు థియేటర్లలో చూసిన ఈ అద్భుతాన్ని, ప్రస్తుత తరం కూడా వెండితెరపై చూసి తరించే అరుదైన అవకాశం దక్కబోతోంది.
సరిగ్గా పాతికేళ్ల క్రితం, అంటే 2001 జూన్ 15న థియేటర్లలోకి వచ్చిన ‘లగాన్’ అప్పటి బాలీవుడ్ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది. అప్పట్లో నడుస్తున్న రొటీన్ కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా, 1893 నాటి బ్రిటిష్ పాలన నేపథ్యాన్ని తీసుకుని, దానికి పల్లెటూరి మనుషుల ఎమోషన్స్‌ను, మన దేశంలో ఒక మతంగా భావించే క్రికెట్‌ను మెయిన్ పాయింట్‌గా జోడించి ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు అశుతోష్ గోవారికర్.
అప్పట్లోనే వంద కోట్ల గ్రాస్ వసూలు
నిజానికి ముప్పై కోట్ల భారీ బడ్జెట్‌తో, దాదాపు నాలుగు గంటల నిడివితో పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా తీయడం అప్పట్లో ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. ట్రేడ్ వర్గాల్లో కూడా మొదట్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. విచిత్రమేమిటంటే, అదే రోజు సన్నీ డియోల్ నటించిన పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ కూడా విడుదలై బాక్సాఫీస్ వద్ద హిస్టారికల్ పోటీని ఇచ్చింది. అయినప్పటికీ ‘లగాన్’ తన కంటెంట్ బలంతో థియేటర్ల వద్ద వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలని అందుకుంది. ఈ చిత్రం అప్పట్లోనే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఘనత సాధించింది. అదే సమయంలో నటుడిగా పీక్‌లో ఉన్న ఆమిర్ ఖాన్ తొలిసారి నిర్మాతగా మారి కొత్తగా ప్రారంభించిన ‘ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌కు ఈ విజయం అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపును, బ్రాండ్ వాల్యూను తీసుకొచ్చింది.
భువన్’ పాత్రలో ఆమిర్ అద్భుతమైన నటన
దర్శకుడు అశుతోష్ గోవారికర్ సుదీర్ఘ పరిశోధన చేసి తెరకెక్కించిన ఈ చిత్రం భారతదేశంలో బ్రిటిష్ పాలనలోని క్రూరత్వాన్ని, గ్రామీణ భారత సంస్కృతిని, క్రీడల్లోని ఉత్కంఠను, అంతర్లీనంగా ఉన్న దేశభక్తిని అద్భుతంగా మేళవించింది. వర్షాలు పడక, కరువుతో అల్లాడుతున్న చంపానేర్ గ్రామస్థులపై బ్రిటిష్ అధికారులు విధించిన మూడింతల భారమైన పన్ను (లగాన్) నుంచి విముక్తి పొందేందుకు, అస్సలు పరిచయం లేని క్రికెట్ మ్యాచ్ ఆడి గెలవాలనే సవాల్‌ను స్వీకరించిన వీరుడు ‘భువన్’ పాత్రలో ఆమిర్ ఖాన్ అద్భుతమైన నటన కనబరిచారు.
ఆయనతో పాటు హీరోయిన్ గ్రేసీ సింగ్ అమాయకత్వం, బ్రిటిష్ కప్టెన్ రస్సెల్‌గా పాల్ బ్లాక్‌థార్న్ క్రూరత్వం, ఎలిజబెత్‌గా రాచెల్ షెల్లీ చూపించిన సానుభూతి ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఇస్మాయిల్‌గా రఘుబీర్ యాదవ్, కచ్రాగా ఆదిత్య లఖియా, దేవ్‌జీగా ప్రదీప్ రావత్, గురన్‌గా రాజేష్ వివేక్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ప్రతి క్యారెక్టర్‌కు ఒక పర్పస్ ఉంటూ, క్లైమాక్స్ వైపు కథను నడిపించిన తీరు స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌కు నిదర్శనం.
మ్యాజిక్ చేసిన రెహమాన్ మ్యూజిక్
ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి విజయానికి మరో ప్రధాన బలం సంగీతం. ఆస్కార్ వేదిక వరకు ఈ సినిమా వెళ్లడంలో సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించాయి. జావేద్ అక్తర్ రాసిన సాహిత్యానికి రెహమాన్ ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ‘ఘనన్ ఘనన్’ అంటూ వర్షం కోసం పల్లె జనం ఆరాటపడే పాట, ‘మితవా’ అంటూ భువన్ ఇచ్చే స్ఫూర్తి గీతం, ‘రాధా కైసే నా జలే’ అంటూ సాగే క్లాసికల్ మెలోడీ, దేశభక్తిని నరనరాన ప్రవహింపజేసే ‘చలే చలో’ సాంగ్.. ఇలా ప్రతి ఒక్కటి ఒక ఆణిముత్యం. ప్రేక్షకులను నేరుగా 1890ల నాటి కాలానికి తీసుకెళ్లిన ఆ సంగీతం, భారతీయ సినిమా చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచి నేషనల్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది.
జూన్ 12, 13, 14 తేదీలలో థియేటర్లలో రీ రిలీజ్
భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై అత్యంత బలంగా నిలబెట్టిన చిత్రంగా ‘లగాన్’ రికార్డు సృష్టించింది. 2002లో జరిగిన 74వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో (Best Foreign Language Film) టాప్-5లో అఫీషియల్ నామినేషన్ దక్కించుకోవడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘మదర్ ఇండియా’ (1957), ‘సలాం బాంబే’ (1988) చిత్రాల తర్వాత ఆస్కార్ నామినేషన్స్ దాకా వెళ్లిన మూడో భారతీయ చిత్రంగా లగాన్ చరిత్ర పుటల్లోకెక్కింది. చైనాలో సైతం చైనీస్ భాషలోకి డబ్ అయి పెద్ద ఎత్తున విడుదలైన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. అప్పటి నుంచి ఈ చిత్రం గ్లోబల్ లెవెల్‌లో ఒక కేస్ స్టడీగా మారిపోయింది.
ఇప్పుడు ఈ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ రజతోత్సవాన్ని పురస్కరించుకుని 2026 జూన్ 12, 13, 14 తేదీలలో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా థియేటర్లలో గ్రాండ్‌గా రీ రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత అభిమానులకు ఆ నాటి నోస్టాల్జియాను మరోసారి థియేటర్లలో ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం కాగా, కేవలం ఓటీటీల్లో, టీవీల్లో మాత్రమే ఈ సినిమాను చూసిన నేటి తరం ప్రేక్షకులకు భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయిన ఒక విజువల్ వండర్‌ను, ఆ ఎమోషనల్ అద్భుతాన్ని 4K క్వాలిటీతో పెద్ద తెరపై చూసే అరుదైన అవకాశం దక్కబోతోంది.
ఈ జూన్ నెలలో బాక్సాఫీస్ వద్ద ఎన్ని కొత్త సినిమాలు ఉన్నప్పటికీ, పాతికేళ్లు గడిచినా ‘లగాన్’ మ్యాజిక్ ఏమాత్రం తగ్గలేదని, ఆ క్రేజ్ అలాగే ఉందని నిరూపించడానికి ఈ రీ రిలీజ్ ఈవెంట్ ఒక అద్భుతమైన వేదిక కాబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు !
also read :పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?