Iran Conflict: రైట్ ఇప్పుడు ఇరాన్-అమెరికా యుద్ధంలో పైకి మాత్రం బ్రేక్ తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది. కానీ ఇంటర్నల్ గా మాత్రం కథ మరోలా నడుస్తోంది. నివురుగప్పిన నిప్పులాగే ఉంది. ఇది చల్లారిపోయిన యుద్ధం కాదు. ఎప్పుడైనా ఏ క్షణమైనా మళ్లీ రాజుకునేందుకు సిద్ధంగా ఉన్న రణక్షేత్రమిది. ఎవరూ వెనక్కు తగ్గని యుద్ధమిది. అందుకే కథ చాలా వేగంగా నడుస్తోంది. పై చేయి సాధించాం.. ఇక యుద్ధం ముగిస్తాం అన్నట్లుగా అమెరికా ఉంది. మేం తగ్గలేదు. సత్తా చాటుతాం.. ఒప్పందాల్లో కొంత వరకే ఓకే అంటోంది ఇరాన్. అందుకే ఈ ప్రతిష్టంభన తగ్గట్లేదు.
యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం 10 మంది ఇండియన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనలో ప్రాణ నష్టానికి ఇరాన్ దాడులే కారణమని కువైట్ రక్షణశాఖ ప్రకటించింది. టెర్మినల్ వన్ పై డ్రోన్లతో పెద్దఎత్తున దాడి జరిగినట్లు తెలిపింది. విమానాశ్రయంలో సదుపాయాలు, ఆపరేషనల్ ప్రాసెస్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పింది. దాడుల తర్వాత విమాన రాకపోకల్ని ఆపేశారు. ఇరాన్ దౌత్యకార్యాలయ ప్రతినిధిని కువైట్ విదేశాంగ శాఖ పిలిపించి, ఈ దాడులపై అధికారికంగా నిరసన లేఖ అందించింది. ఇద్దరు దౌత్యవేత్తల్ని కువైట్ కు వ్యతిరేకులని ప్రకటించి 24 గంటల్లోగా కువైట్‌ను వీడివెళ్లాలని ఆదేశించింది. ఇరాన్‌కు చెందిన 13 బాలిస్టిక్ క్షిపణులు, 17 డ్రోన్లకు చెక్ పెట్టామని, అయితే వాటి శకలాలు నివాస భవనాలపై పడ్డాయని కువైట్ రక్షణశాఖ తెలిపింది. ఓవైపు సీజ్ ఫైర్ నడుస్తుండగానే ఇంత తతంగం జరిగిందన్న మాట. మరి సీజ్ ఫైర్ ఎందుకన్న ప్రశ్నలకు క్లారిటీ లేదు.
కువైట్‌లో జరిగిన దాడిలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోవడాన్ని ఇండియా ఖండించింది. ఇలాంటి హింసకు ముగింపు పలకాలని పిలుపునిచ్చింది. అమెరికా గెరుక్, ఖేష్మ్ ద్వీపంపై శని, ఆదివారాల్లో అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ఐఆర్‌జీసీ ప్రకటించింది. కువైట్‌లోని అల్ సలేమ్ వైమానిక స్థావరం, బహ్రెయిన్‌లోని ఈసా ఎయిర్ బేస్ సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
Also Read: రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!
చెప్పాలంటే గల్ఫ్ దేశాల్లో పని చేసుకునే మన ఇండియన్లకు ఇప్పుడు గడ్డుకాలమే కనిపిస్తోంది. మాట మాట్లాడితే ఇరాన్.. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మౌలిక వసతులను టార్గెట్ చేస్తోంది. కానీ ఇప్పుడు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను టార్గెట్ చేయడంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లైంది. అంటే యుద్ధం ముగియట్లేదు. ఎవరికీ ఏ క్లారిటీ రావట్లేదు. పని చేసుకునే వాళ్లకు, పని ఇద్దామనుకునే వాళ్లకు అంతటా కన్ఫ్యూజనే ఉంది. ఎందుకంటే దీనిపై ఒక అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా కథ నడుస్తోంది.
ఇందులో భాగంగా ఖేష్మ్ ద్వీపం గొరుక్ ప్రాంతాలపై అమెరికా దాడులు చేసింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన MQ-1 ప్రిడేటర్ డ్రోన్‌ను ఇరాన్ బలగాలు కూల్చివేయడానికి ప్రతిచర్యగా అమెరికా ఈ అటాక్ చేసిందంటున్నారు. వ్యూహాత్మక ప్రాంతాలైన ఖేష్మ్ ద్వీపం గొరుక్ లలో ఉన్న ఇరాన్ సైనిక రాడార్లు, డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను అమెరికా ఫైటర్ జెట్లు బాంబులతో ధ్వంసం చేశాయి. హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే వాణిజ్య నౌకలకు ముప్పుగా మారిన ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను, ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ను అలాగే రెండు సూసైడ్ డ్రోన్లను అమెరికా సక్సెస్ ఫుల్ గా ఎలిమినేట్ చేసింది.
ఇరాన్ నౌకాదళ ప్రధాన స్థావరమైన బందర్ అబ్బాస్ పోర్ట్ సిటీ, సిరిక్, జాస్క్ తీర ప్రాంతాల సమీపంలో అమెరికా దాడులు చేసింది. అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాలలో రహస్యంగా సీ మైన్స్ అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ బోట్లను, అలాగే తీరప్రాంత మిస్సైల్ లాంచర్లను అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లక్ష్యంగా చేసుకుని పేల్చివేసింది. ఇరాన్ తన సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో గల్ఫ్ రీజియన్‌లోని అమెరికా మిత్రదేశాలైన బహ్రెయిన్, అమెరికా సైనిక స్థావరాలున్న కువైట్‌లను లక్ష్యంగా చేసుకుంది. అమెరికాకు చెందిన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రంగంలోకి దిగి, కువైట్ వైపు దూసుకొచ్చిన రెండు బాలిస్టిక్ క్షిపణులను, బహ్రెయిన్ వైపు వచ్చిన మూడు క్షిపణులను గాల్లోనే అడ్డుకుని ఆత్మరక్షణ చర్యలు చేపట్టాయి. సో ఇలాంటి కవ్వింపు చర్యలు రెండువైపులా ఇప్పటికీ అడపా దడపా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
Also Read: అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!
అమెరికా వీటిని ఆత్మరక్షణ దాడులు అని పిలుస్తుండగా, ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ – IRGC మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించింది. అమెరికా దళాలు తమ కమ్యూనికేషన్ టవర్లపై దాడులు చేశాయని ఆరోపిస్తూ, ప్రతీకారంగా అమెరికాకు చెందిన బేస్ లపై ఇరాన్ తిరిగి డ్రోన్ దాడులు చేయడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. మరోవైపు యుద్ధం విషయంలో తాజాగా అమెరికాలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై సైనిక చర్యలు నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి 215 మంది అనుకూలంగా.. 208 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అనవసర, భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ఎండ్ కార్డ్ వేయాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు.
హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో సీనియర్ సభ్యుడైన న్యూయార్క్ డెమోక్రటిక్ ప్రతినిధి గ్రెగొరీ మీక్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో నిర్వహించిన ఓటింగ్‌లో నలుగురు రిపబ్లికన్‌లు ట్రంప్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేయడం హాట్ టాపిక్ గా మారింది. అమెరికన్ కాంగ్రెస్ అధికారికంగా యుద్ధం ప్రకటించడం, సైనిక చర్యలకు ఆమోదం ఇవ్వడం ఇలాంటివి జరిగితే తప్ప.. అమెరికా బలగాలు ఇరాన్ పై ఎలాంటి సీరియస్ యాక్షన్ కు దిగకూడదని ఈ తీర్మానం ట్రంప్‌ను ఆదేశిస్తుంది. అమెరికా ప్రతినిధుల సభ వార్ పవర్స్ రిజల్యూషన్ ను ఆమోదించడం వైట్‌హౌస్‌కు పెద్ద దెబ్బగా మారింది. ఈ పరిణామం.. ఇరాన్‌తో మూడు నెలలుగా జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ముగించేస్తుందని చెప్పలేని పరిస్థితి. తక్కువ తేడాతో ఆమోదం పొందిన ఈ తీర్మానం.. ఇరాన్‌పై ట్రంప్ చర్యలకు వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మాత్రం బహిర్గతం చేసింది. ఇప్పుడు ఈ యుద్ధ అధికారాల తీర్మానం సెనెట్‌కు వెళ్తుంది. అక్కడ ఇందుకు ఆమోదం లభిస్తే.. ఆ తర్వాత అది అధ్యక్షుడు ట్రంప్ వద్దకు వెళ్తుంది. దీన్ని ఆయన వీటో చేయవచ్చు అంటున్నారు.
Also Read: కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!
ఇటీవల కుదిరిన తాత్కాలిక సీజ్ ఫైర్ ను పునరుద్ధరించేందుకు ఇజ్రాయెల్- లెబనాన్‌లు ఒప్పుకున్నాయ్. అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన నాలుగోవిడత చర్చల తర్వాత రెండు దేశాలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఒప్పందంలో భాగంగా.. వివాదాలను పూర్తిగా పరిష్కరించే విషయంపై మరిన్ని ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు ఒప్పుకున్నాయి. ఇందులో ఇరాన్‌కు మద్దతిస్తున్న హెజ్‌బొల్లా పూర్తిగా కాల్పులను నిలిపివేయాలని, దక్షిణ లిటాని సెక్టార్ నుంచి బలగాలు వెనుదిరగాలనే షరతులు కూడా ఉన్నాయి. సో అటు ఇజ్రాయెల్ లెబనాన్ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఇటు ఇరాన్ తో గేమ్ అయితే నడిపిస్తున్నారు. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూనే అన్నీ ముగించే పనిలో ఉన్నారు. అందుకే ఒక్కో లెక్క క్లియర్ చేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా సరే ఇరాన్ డీల్ చేయాలనుకుంటున్నారు. అయితే మధ్యలో ఏదైనా జరగొచ్చు. అందుకే ప్రపంచదేశాల్లో డౌట్లు మాత్రం పోవట్లేదు.
మరోవైపు ఇరాన్ విషయంలో ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధాన్ని తయారు చేయబోమని, ఇరాన్ స్పష్టం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఇరాన్ టాప్ లీడర్ అయతుల్లా.. అమెరికాతో చర్చల్లో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు. అణ్వాయుధం సమకూర్చుకోబోమని వారు ఇప్పటికే హామీ ఇచ్చారని ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. ఫ్యూచర్ లో ఏదో ఒక దశలో తానే ఇరాన్ అధినేతను కలుస్తానని, స్వయంగా చర్చలు జరుపుతానని సూచనప్రాయంగా చెప్పడం కీలకంగా మారింది. అదే సమయంలో ఇరాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని అమెరికా తెలిపింది. ఇరాన్‌పై తమకు క్షేత్రస్థాయిలో బలగాలు అవసరం లేదని, బాంబుల ద్వారా ఆ దేశ సైన్యాన్ని చాలావరకు నాశనం చేశామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకున్నారు.
Also Read: ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!