Film industry:సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు హీరోలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే.. మరొకవైపు ఇద్దరు దర్శకుల వారసురాళ్ళు నిశ్చితార్థం చేసుకొని పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు మరొక నటి సడన్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు లవ్ టు డే మూవీతో ఒక్కసారిగా ప్రేక్షకులను ఆకట్టుకొని అందరినీ తన వైపు తిప్పుకున్న రవీనా రవి. నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్స్ కి తన గాత్ర దానం చేసి అందరిని ఆకట్టుకుంది.
ఇకపోతే రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సడన్గా రవీనా రవి ఎందుకు పెళ్లి చేసుకుంది? అంటూ కామెంట్ చేస్తున్నారు . ప్రేమ వివాహం చేసుకుందా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనే విషయానికి వస్తే .. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంగా తెలుస్తోంది. ఈమె వివాహం చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు దేవన్ జయకుమార్. గతంలో ఈయనతో కలిసి పనిచేసిన ఈమె ఇప్పుడు ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆదివారం ఉదయం ఈ శుభకార్యం జరగగా.. నటీనటులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రవీనా రవి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె తల్లి శ్రీజ కూడా నటి కావడంతో ఆరేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రవీనా రవి. ఇక 2012 నుంచి పూర్తిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా జవాన్ సినిమాలో దీపికా పదుకొనేకు తెలుగు, తమిళ్ వెర్షన్లలో డబ్బింగ్ చెప్పిన ఈమె.. గేమ్ చేంజర్ లోకియారా అద్వానీకి కూడా డబ్బింగ్ చెప్పింది . అలాగే ఓకే బంగారం, ప్రేమమ్ సినిమాలలో నటించిన మడోన్నా సెబాస్టియన్, 2.0 మూవీలో అమీ జాక్సన్, నవాబ్ చిత్రానికి ఐశ్వర్య రాజేష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలో మడోన్నా సెబాస్టియన్ వంటి పలువురు భామలకు ఈమె డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది.కేరళలో పుట్టినప్పటికీ తెలుగు , తమిళ్ , మలయాళం లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
also read:ముఖ్యమంత్రిగా విజయ్.. జీతం, ఇతర బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
2019 నుంచి నటిగా అడపాదడపా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. లవ్ టుడే సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఆ హీరో పాత్రకి అక్కగా నటించి మెప్పించింది. మనుషులకే కాదు కుక్కలకి కూడా ఈమె డబ్బింగ్ చెప్పింది. 2023లో వచ్చిన వాలాట్టి అనే కుక్కల సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది . ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ చిత్ర దర్శకుడు దేవన్ జయకుమార్ తో ప్రేమలో పడి ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది రవీనా. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.