ATM Salon: సాధారణంగా ఏటీఎం సెంటర్‌కు వెళ్తే డబ్బులు విత్ డ్రా చేసుకుంటాం. కానీ బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లాలోని దానాపూర్ వాసులు మాత్రం అక్కడికి వెళ్లి స్టైలిష్‌గా జుట్టు కత్తిరించుకుంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఒకప్పుడు ఏటీఎం మిషన్లతో కళకళలాడిన ఆ గది, ఇప్పుడు కత్తెర్లు, దువ్వెనల శబ్దంతో మారుమోగిపోతోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు “బీహార్‌లో ఏదైనా సాధ్యమే” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
బ్యాంకు ఖాళీ చేసింది.. బార్బర్ సెటిల్ అయ్యాడు!
నిజానికి ఆ ఏటీఎం కేంద్రాన్ని సదరు బ్యాంకు వారు కొంతకాలం క్రితమే మూసివేశారు. బ్యాంకు లావాదేవీలు లేక ఆ గది ఖాళీగా పడి ఉండటంతో, ఆ స్థలం యజమాని దానిని వృధా చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ గదిని ఒక సెలూన్ నిర్వాహకుడికి అద్దెకు ఇచ్చారు. దీంతో ఏటీఎం కోసం నిర్మించిన ఆ చిన్నపాటి ఏసీ గది కాస్తా, ఇప్పుడు అత్యాధునిక హంగులున్న మినీ సెలూన్‌గా మారిపోయింది.
అదే ఏసీ.. అదే గ్లాస్ డోర్.. కస్టమర్ల క్యూ!
ఈ సెలూన్ ప్రత్యేకత ఏమిటంటే, బయటి నుంచి చూస్తే ఇప్పటికీ అది ఏటీఎం సెంటర్ లాగే కనిపిస్తుంది. పాత బోర్డులు, ఆ గ్లాస్ డోర్, లోపల ఉన్న ఏసీ సౌకర్యం ఏమీ మారలేదు. అయితే లోపలికి వెళ్తే మాత్రం కరెన్సీ నోట్లకు బదులు సెలూన్ చైర్లు దర్శనమిస్తున్నాయి. ఎండకాలంలో చల్లని ఏసీ గాలిలో తక్కువ ధరకే జుట్టు కత్తిరించుకోవచ్చు కావడంతో స్థానికులు ఈ ‘ఏటీఎం సెలూన్’ వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
Also Read: ప్రేమకు కులం ‘వెలి’.. నవదంపతులకు ఊరి బహిష్కరణ.. మానవత్వం మంటగలిసిన వేళ!
వ్యాపార ఆలోచనకు నెటిజన్ల ఫిదా!
ఈ వార్త వైరల్ కావడంతో జనం రకరకాలుగా స్పందిస్తున్నారు. “డబ్బులు రాకపోయినా పర్లేదు, అందం వస్తుందిగా!” అని కొందరు అంటుంటే, “ఖాళీగా ఉన్న చోటును ఇలా ఉపయోగించుకోవడం గొప్ప ఐడియా” అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, ఒకప్పుడు డబ్బులు డ్రా చేసే చోట ఇప్పుడు హెయిర్ కటింగ్ జరగడం అనేది దానాపూర్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉదంతం మన దేశంలో ప్రజల సృజనాత్మకతకు, అవసరాన్ని బట్టి మారే తత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ATM సెంటర్లో సెలూన్
బీహార్ రాష్ట్రం పాట్నాలోని దానాపూర్ లో కనిపించిన దృశ్యం
బ్యాంకు ఏటీఎం మూసివేసిన తర్వాత ఆ స్థలాన్ని అద్దెకు ఇవ్వడంతో వెలసిన సెలూన్
A Salon in an ATM Center
A scene witnessed in Danapur, Patna, Bihar.
A salon that sprang up after the bank ATM was shut down… pic.twitter.com/YusZpwyxQD— BIG TV Breaking News (@bigtvtelugu) May 11, 2026