Nithiin: టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ కెరీర్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు వరుస హిట్లతో ఒక వెలుగు వెలిగిన ఈ హీరో, గత నాలుగైదేళ్లుగా బాక్సాఫీస్ వద్ద ఒక సరైన హిట్టు కోసం మొహం వాచి ఉన్నాడు. ‘చెక్’ నుంచి మొదలైన ఈ పతనం ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మీదుగా నిన్నటి ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ వరకు దిగ్విజయంగా కొనసాగుతోంది. వరుసగా అరడజనుకు పైగా డిజాస్టర్లు పడి, మార్కెట్ పూర్తిగా క్లోజ్ అయిపోయినా, నితిన్ మాత్రం ఇంకా “క్రేజీ ప్రాజెక్టులు” అంటూ అనౌన్స్ చేస్తుంటే ఇంకా అలుపు రావట్లేదా నితిన్ అంటూ గొణుక్కుంటున్నాయ్ ఫిలిమ్ సర్కిల్స్.
సొంత బ్యానర్.. సొంత రిస్క్!
నితిన్ కి బయటి నిర్మాతలు ఎవరూ దొరకడం లేదో ఏమో కానీ, ఇప్పుడు తన సొంత బ్యానర్ ‘శ్రేష్ట్ మూవీస్’ మీదనే సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. ‘ఆయ్’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు అంజితో సినిమా అంటే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలే సంక్రాంతి రేసులో పెద్ద తలకాయలు ఉండగా, వరుస ఫ్లాపుల నితిన్ అక్కడ నిలబడగలరా? అన్నది ఇక్కడ మిలియన్ డాలర్స్ క్వశ్చన్. మరోవైపు విఐ ఆనంద్ తో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ఏ స్థాయి ప్రయోగమో తెలియదు కానీ, నితిన్ కి ఇలాంటి ప్రయోగాలు గతంలో ఏమాత్రం కలిసిరాలేదు.
థియేటర్లకి రప్పించే సత్తా కోల్పోయినట్టేనా ?
2002లో ‘జయం’తో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత పదేళ్ల పాటు ఫ్లాపుల ఊబిలో కూరుకుపోయిన చరిత్ర నితిన్ సొంతం. మళ్ళీ ‘ఇష్క్’ తో ఏదోలా గట్టెక్కినా, ఇప్పుడు మళ్ళీ అదే పాత రోజులు రిపీట్ అవుతున్నట్టున్నాయ్ త్రివిక్రమ్ వంటి దర్శకులు ఉంటే తప్ప హిట్ కొట్టలేరన్న ముద్ర నితిన్ పై బలంగా పడిపోయింది. ‘భీష్మ’ తర్వాత నితిన్ తీసిన ప్రతి సినిమా ప్రేక్షకులను థియేటర్ల నుంచి పారిపోయేలా చేసింది. నితిన్ తన ఇమేజ్‌ని కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ పేరును వాడుకోవడం తప్ప, సొంతంగా ఆడియన్స్‌ను థియేటర్లకి రప్పించే సత్తా కోల్పోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.వచ్చే నెలలో మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు కానీ, కంటెంట్ లో దమ్ము లేకపోతే నితిన్ ని ఎవరూ కాపాడలేరు. పదే పదే కొత్త దర్శకులను నమ్ముకుంటూ, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కొట్టుకుపోతున్న నితిన్.. తన కెరీర్ ని తానే ఎండ్ కార్డ్ వేసుకుంటున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి వచ్చే ఏడాది సంక్రాంతి నాటికైనా నితిన్ జాతకం మారుతుందో లేక మరో డిజాస్టర్ తో ఫ్లాపుల రికార్డును పదిలం చేసుకుంటాడో చూడాలి!
also read: Senior Relationships: ఈ సీనియర్ భామల లవ్ స్టోరీస్..ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్!