Film industry:ఇటీవల కాలంలో టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు అన్ని చిత్రాలు ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు, సినీ ప్రేమికులు భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే చాలు సినిమా చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ ని అలరిస్తున్నారు. అలా తమ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతోంది.ఈ క్రమంలోనే ఆస్కార్ అందుకున్న తొలి ఐరిష్ నటిగా చరిత్ర సృష్టించి.. తన అద్భుతమైన నటనతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక నటి నేడు తుది శ్వాస విడిచారు. మరి ఆమె ఎవరు? అసలేం జరిగింది ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో చెరగని ముద్ర వేసుకున్నారు లెజెండ్రీ నటి, ఆస్కార్ అవార్డు గ్రహీత బ్రెండా ఫ్రికర్. 81 సంవత్సరాల వయసులో ఆమె కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈమే ఐర్లాండ్ లోని డబ్లిన్ నగరంలో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. బ్రెండా ఫ్రికర్ మరణ వార్త వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఒక అద్భుతమైన లెజెండ్రీ నటిని సినీ ప్రపంచం కోల్పోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
also read:బండ్లన్న ఇంట మొదలైన పెళ్లి సందడి.. మెగా ఫ్యామిలీకి ప్రత్యేక ఆహ్వానం!
ఇకపోతే సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డును అందుకున్న మొట్టమొదటి ఐరిష్ నటిగా చరిత్ర సృష్టించారు బ్రెండా ఫ్రికర్. 1989 లో విడుదలైన క్లాసిక్ డ్రామా మూవీ ‘మై లెఫ్ట్ ఫుట్’ సినిమాలో ఆమె కనబరిచిన అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ సహాయనటిగా ఈమెకు ఆస్కార్ అవార్డు లభించింది. అంతేకాదు ‘హోం అలోన్ 2: లాస్ట్ ఇన్ న్యూయార్క్’ లో ఈమె పోషించిన పావురాల మహిళ పాత్ర అలాగే బ్రిటిష్ మెడికల్ డ్రామా సిరీస్ కాజువాలిటీ ఈమెకు ఊహించని గ్లోబల్ స్టార్ డంను అందించాయి. ఈమె తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఏకంగా 50కి పైగా చిత్రాలు, విభిన్నమైన టెలివిజన్ సిరీస్ లలో నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. నటనపై ఆసక్తి ఉన్న ఎంతోమంది యువ నటీనటులకు రోల్ మోడల్ గా నిలిచింది. అలాంటి ఈమె ఇప్పుడు మన మధ్య లేరు అనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె ఆత్మ శాంతించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.