Pokiri Secrets : టాలీవుడ్ సినిమా రికార్డుల్ని పోకిరి కి ముందు పోకిరికి తర్వాత అని విభజించవచ్చంటే తెలుగు బాకాఫీస్ పై పోకిరి సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్థమవుతుంది. అయితే ఈ సినిమా కథని మొదట్లో చాలా సింపుల్ గ్యాంగ్‌స్టర్ స్టోరీగా రాశాడట పూరి. కానీ ఆతర్వాత హీరో ఒక “అండర్‌కవర్ పోలీస్” అనే ట్విస్ట్ యాడ్ చేయడంతో సినిమా మరో లెవల్ కి వెళ్లిపోయింది. ఇక మొదటగా ఈ సినిమా కథని మహేష్ బాబు కంటే ముందే రవితేజకు వినిపించాడట పూరి. కానీ అనుకోని కారణాల వల్ల అది మహేష్ బాబు వద్దకు చేరింది. మహేష్ పండుగాడు కావాలని రాసి పెట్టి ఉంది మరి.
మొదట్లో ఉత్తమ్ సింగ్
విశేషమేమిటంటే, ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ మొదట్లో ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ అనుకున్నాడట పూరి. కానీ చివరి నిమిషంలో ‘పోకిరి’గా మార్చారు. అయితే సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఈ పోకిరి టైటిల్ ఏంటి నెగెటివ్ గా అంటూ డౌట్స్ రేజ్ చేశారట చాలా మంది. ఎందుకంటే అప్పటి వరకు మహేష్ కి క్లాస్ ఇమేజ్ ఉండేది మరి, కానీ మహేష్ కి ఈ టైటిల్ పిచ్చ పిచ్చగా నచ్చడంతో అదే ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత అదే బ్రాండ్ అయిపోయింది. ఇక మహేష్ బాబు హెయిర్ స్టైల్ నుండి ఆయన వేసుకున్న ‘డబుల్ షర్ట్స్’ వరకు అప్పట్లో యూత్ కి ఒక పెద్ద ఫ్యాషన్.
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా
ఈ సినిమాలోని “ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో.. వాడే పండుగాడు”, “ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా!”, “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” వంటి డైలాగులు రెండు దశాబ్దాలు గడిచినా నేటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయంటే సినిమా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందో అర్థమవుతుంది.ముఖ్యంగా సినిమా మొదట్లో అల్లరి చిల్లరగా, ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన పండుగాడు చివరికి వచ్చేసరికి అండర్ కవర్ ఆఫీసర్ కృష్ణ మనోహర్‌గా రివీల్ అయ్యేసరికి నోరెళ్లబెట్టారు ఆడియన్స్. ఒకరకంగా ఈ ట్విస్టే సినిమాని మరో రేంజ్ కి తీసికెళ్లిపోయింది.
జగడమే’ పాటను మూడంటే మూడు గంటల్లో
ఇక సినిమాకి మణి అందించిన మ్యూజిక్ మరో లెవల్. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ BGM టాప్ నాచ్. ఇందులోని ‘జగడమే’ పాటను మూడంటే మూడు గంటల్లోనే కంపోజ్ చేశారంటే మీరు నమ్ముతారా. పూరి స్టోరీ నారేషన్ కి మణి అంతలా సింక్ అయిపోయాడు మరి. ఇక దేవదాసు తో సూపర్ హిట్ కొట్టిన ఇలియానాకు ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఇక విలన్ గా ప్రకాష్ రాజ్ ఫెర్ఫామెన్స్ సినిమాని మరో లెవల్ లో పెట్టేసింది. ఈ పోకిరి సౌండ్ ఒక్క ఇక్కడే కాదండోయ్… హిందీలో సల్మాన్ ఖాన్‌ను ‘వాంటెడ్’తో మళ్ళీ ఫామ్‌లోకి తెచ్చి బాలీవుడ్ లోనూ రీ సౌండ్ చేసింది. ఇక కోలీవుడ్ లో విజయ్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన ఘనతా ఈ సినిమాదే.
రీమేక్ అయి అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్
ఒక్క హిందీ, తమిళ్ లోనే కాకుండా కన్నడ, బెంగాలీ భాషల్లోనూ రీమేక్ అయి అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడం విశేషం. ఒక తెలుగు సినిమా ఇన్ని భాషల్లో రీమేక్ అయ్యి, అన్ని చోట్లా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే రేర్ అని చెప్పాలి. సినిమాలో శ్రుతిని అదేనండి ఇలియానాను పండుగాడు టీజ్ చేస్తూ పాడే పాట ‘జగడమే’ గుర్తుందా.. ఆ పాటలోని ఎక్కువ భాగం ఎటువంటి ఖరీదైన సెట్స్ లేకుండా, కేవలం సహజమైన లొకేషన్లలో (రోడ్లు, గల్లీల్లో) షూట్ చేశారు. ఆ ‘రా అండ్ రస్టిక్’ ఫీలే ఆడియన్స్ కి కనెక్ట్ అయింది.
స్లమ్ డాగ్ మిలీనియర్’ తో ఆస్కార్
ఇక ఈ సినిమాకి సౌండ్ మిక్సింగ్ చేసిన సౌండ్ ఇంజనీర్ ఎవరో తెలుసా? రసూల్ పూకుట్టి. మన దేశానికి ‘స్లమ్ డాగ్ మిలీనియర్’ సినిమాతో ఆస్కార్ తెచ్చింది ఆయనే. ఆయన పని తనంవల్లే ఫైట్ సీక్వెన్స్‌లలో గన్ షాట్స్, పంచ్ సౌండ్స్ సాలిడ్ సౌండ్‌తో వినిపిస్తాయి. “ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా!” ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెల్సిందే. అయితే ఈ డైలాగ్ ముందు స్క్రిప్ట్ లో లేదు తెలుసా. అవును… ఆ సీన్ జరుగుతున్నప్పుడు షూటింగ్ స్పాట్ లో రాసేశాడు పూరి. రాసేటప్పుడు కూడా పూరి ఊహించి ఉండడు ఆ డైలాగ్ అంత ఫేమస్ అవుతుందని.ఇక సినిమా క్లైమాక్స్ ఫైట్ మరియు ఇంపార్టెంట్ సీన్స్ ని ఎక్కువగా విశాఖపట్నం సముద్ర తీరంలో షూట్ చేశారట. ఆ వెదర్, ఆ లొకేషన్స్ సినిమాలోని సీరియస్‌నెస్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేశాయి.
తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ నే మార్చేసింది
అలా ఏప్రిల్ 28, 2006న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటి వరకున్న రికార్డులనే కాదు, తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ నే మార్చేసిందని చెప్పాలి. ఇక కేవలం 70 రోజుల్లో 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఏకంగా 70 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ పండిట్స్ మైండ్స్ ని బ్లాక్ చేసింది.ముఖ్యంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ 35mm థియేటర్లో 175 రోజులకు పైగా ఆడి ఒకే థియేటర్లో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన తొలి సినిమాగా ‘పోకిరి’ హిస్టరీ క్రియేట్ చేసింది.
తొలి 30 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన మొదటి సినిమా
ఇక అప్పటి వరకు తెలుగులో తొలి 30 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన మొదటి సినిమా ఇదే అంటే ఆడియన్స్ ఎంతలా పండుగాడి యాక్షన్ కి ఫిదా అయ్యారో అర్థమవుతుంది. అప్పటి వరకు రొమాంటిక్ అండ్ సెన్సిబుల్ సినిమాలతో చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో ఉన్న మహేష్ ని గ్యాంగ్ స్టర్ గా రగ్గడ్ లుక్‌లో చూపించిన తీరుకి కాసుల వర్షం కురిపించారు ఆడియన్స్. ఇక థియేటర్ల వద్ద క్యూ లైన్లని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎంటర్ అయ్యారంటే సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయిందో చెప్పక్కర్లేదు. అందుకే 20 కాదు మరో 60 ఏళ్ళయినా పండుగాడి మ్యాజిక్ ని టాలీవుడ్ అస్సల్ మర్చిపోలేదు.
also read :సినిమా ముచ్చట్లు ..తెర వెనుక సంగతులు