Pawan Kalyan:గత కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉంది. అటు రాజకీయ వ్యక్తులు ఇటు సినిమాల్లోకి వస్తే.. ఇటు సినిమాలలో సత్తా చాటిన వారు రాజకీయాలలో చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా టీవీకే అంటూ కొత్త పార్టీని స్థాపించి.. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇకపోతే నటనకు శాశ్వతంగా గుడ్ బై చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అటు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడంపై విజయ్ కి ఏదైనా సలహా ఇస్తారా అని మీడియా మిత్రులు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించగా.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎవరికైనా సలహా ఇవ్వడాన్ని నేను అంతగా విశ్వసించను. ప్రతి వ్యక్తికి తన సొంత నిర్ణయం ఉంటుంది. తన సొంత నిర్ణయంతో సొంత మార్గాన్ని తానే ఏర్పాటు చేసుకుంటాడు. ఇక విజయ్ కి ఉన్న స్టార్డం, రాజకీయ అరంగేట్రం పై మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సొంత తెలివితేటలతోనే వారు ముందుకు వెళ్తారు.. ఆయనకు ఎలాంటి సలహాలు అవసరం లేదు. ప్రభావంతమైన వ్యక్తులు తాము పోషించే పాత్రతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావడం ఎల్లప్పుడూ ప్రశంసించదగ్గ విషయం అంటూ పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.
మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఎటువంటి సలహాలు ఇవ్వకుండా నెగటివ్ చేయకుండా బ్యాలెన్స్ గా సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు . మొత్తానికైతే ప్రజాసేవలో ఉన్న ఈ ఇద్దరు టాప్ స్టార్ల మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని ఆయన మాటలు ప్రతిబింబిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ALSO READ:ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మిస్టికల్ థ్రిల్లర్ పోచమ్మ.. ఎక్కడ చూడొచ్చంటే?
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. దాదాపు దశాబ్ద కాలానికి పైగా రాజకీయాలలో ఉన్న ఈయన ప్రజలలో నమ్మకాన్ని అందుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు. అలా ఆ కష్టానికి 2024లో ప్రతిఫలం దక్కింది. తన జనసేన పార్టీని కూటమితో పొత్తు కలుపుకొని పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా కూటమి విజయంలో కీలకపాత్ర పోషించడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. ఆ హోదాకి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ప్రజలకు సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. అలాగే అభిమానులను నిరాశపరచకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరిగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.