Belli Janardhan: తెలుగు సినీ పరిశ్రమలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. తూలికా తనిస్క్ క్రియేషన్స్ పతాకంపై ఇటీవల “పోలీస్ వారి హెచ్చరిక” అనే చిత్రాన్ని నిర్మించి, సినీ రంగ ప్రవేశం చేసిన నిర్మాత బెల్లి జనార్ధన్ ప్రమాదవశాత్తు మరణించారు. ఉగాది పండుగ పూట జరిగిన ఈ విషాదం ఆయన కుటుంబ సభ్యులను, చిత్ర యూనిట్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read also-Rakesh Bedi: ఆమెకు స్టేజ్ మీదే ముద్దు పెట్టడంపై క్లారిటీ ఇచ్చిన ‘ధురంధర్’ నటుడు..
ఈ నెల 22వ తేదీన ఉగాది పండుగను పురస్కరించుకుని, జనార్ధన్ తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారి ఊరైన కట్టంగూరుకు వెళ్లారు. పండుగ సంబరాల్లో భాగంగా అక్కడ ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడానికి ఆయన వెళ్లారు. అయితే, నీటిలోకి డైవ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయన తల అడుగు భాగానికి బలంగా తగిలింది. ఈ తీవ్ర గాయం కారణంగా ఆయన అక్కడికక్కడే ఊపిరి వదిలారు. సంతోషంగా గడపాల్సిన పండుగ రోజున ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం స్థానికులను కలచివేసింది.
బెల్లి జనార్ధన్ కేవలం నిర్మాత మాత్రమే కాదు, ఆయన దేశానికి సేవ చేసిన మాజీ సైనికుడు కూడా. ఆయన మరణవార్త విన్న వెంటనే నకిరేకల్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మార్చి 23వ తేదీన ఆయన స్వగ్రామమైన నకిరేకల్ మండలంలోని “పాలెం” గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సైనికుడు కావడంతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయనకు సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది గ్రామస్థులు, సినీ ప్రముఖులు పాల్గొని అశ్రునయనాలతో నివాళులర్పించారు.
Read also-Mega Youth Force: మెగా పవర్ @ సోషల్ సర్వీస్.. ‘మెగా యూత్ ఫోర్స్’తో రంగంలోకి సుస్మిత!
జనార్ధన్ మరణంపై “పోలీస్ వారి హెచ్చరిక” చిత్ర దర్శకుడు బాబ్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిర్మాతగా తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవాలని జనార్ధన్ గారు ఎంతో తపన పడ్డారు. ఆయన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. సినిమా పట్ల ఆయనకున్న పట్టుదల మా అందరికీ స్ఫూర్తినిచ్చింది. ఇలాంటి చిన్న వయసులోనే, అది కూడా ఒక ప్రమాదంలో ఆయన మరణించడం జీర్ణించుకోలేకపోతున్నాం. ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్ర యూనిట్ తరపున, వ్యక్తిగతంగా నా తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.” ఒక మాజీ సైనికుడిగా దేశానికి సేవ చేసి, సినీ రంగంపై మక్కువతో నిర్మాతగా మారిన బెల్లి జనార్ధన్ ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం సినీ లోకాన్ని విషాదంతో ముంచెత్తింది.