Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్లీ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మెగా 158’ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ‘కాకాజీ’ అనే పవర్‌ఫుల్ టైటిల్ దాదాపు ఖరారైనప్పటికీ, నిర్మాణపరమైన సమస్యలు టీమ్‌ను వేధిస్తున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఈ నెల 20న మొదలవ్వాల్సిన షూటింగ్ ఆగిపోయింది. భారీ బడ్జెట్ కావడంతో కొత్త నిర్మాతల వేటలో డైరెక్టర్ బాబీ ఉన్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా ‘కాకాజీ’ అనే టైటిల్‌ను డైరెక్టర్ బాబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూపించిన బాబీ, ఈసారి అంతకుమించిన పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేశారు. బెంగాల్ నేపథ్యంలో సాగే ఈ కథలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ హైలైట్‌గా ఉండబోతోందని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినా, టైటిల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అయితే, ఇతర సినిమాల లీకులు, ఆర్థిక సమస్యల వల్ల ఈ బ్యానర్ ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బడ్జెట్ విషయంలో క్లారిటీ లేక షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. పైగా ఇప్పుడు కేవీఎన్ ప్రొడక్షన్ వారితో కావట్లేదని.. బాబీ ఈ ప్రాజెక్ట్ కోసం వేరే టాప్ ప్రొడ్యూసర్లను సంప్రదించారని, కానీ బడ్జెట్ భారం వల్ల ముగ్గురు నిర్మాతలు ఈ డీల్‌ను తిరస్కరించారని ఇన్సైడ్ టాక్. చిరంజీవి సైతం ఈ విషయంలో అసహనంగా ఉన్నట్లు సమాచారం. మరి చివరికి ఎవరు ఈ భారీ ప్రాజెక్ట్‌ను టేకాఫ్ చేస్తారో చూడాలి.
నిర్మాణ సమస్యలు ఉన్నప్పటికీ, ఈ సినిమా కాస్టింగ్ మాత్రం అదిరిపోయింది. చిరంజీవి సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఇక విలన్‌గా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటిస్తుండటం విశేషం. చిరంజీవి కూతురి పాత్రలో ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్ ఎంపికైంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా మ్యూజికల్ గా కూడా నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది.
also read:శ్రీదేవి ఆత్మ ప్రత్యక్షం? చంపింది ఆయనే అంటూ సంచలన వ్యాఖ్యలు?
వచ్చే ఏడాది ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ సమస్యలు కొలిక్కి వస్తే వచ్చే నెలలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మెగాస్టార్ క్రేజ్‌కు తగ్గట్లుగా ఈ ప్రాజెక్ట్ భారీగా ఉండటమే ప్రస్తుతం ఇబ్బందిగా మారింది. అయితే, బాబీ ఎలాగైనా ఈ సినిమాను ట్రాక్ ఎక్కించి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక త్వరలోనే ఈ నిర్మాణ సమస్యలన్నీ తొలగిపోయి, చిరంజీవి ‘కాకాజీ’గా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కష్టాలు దాటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గర్జించడం ఖాయం!