Renu Desai:రేణు దేశాయ్ తన మంచి మనసుని మరోసారి చాటుకున్నారు.తనకి జ్వరం వచ్చినప్పటికీ తన వద్ద ఉన్న మూగజీవాలను కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నాల గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఇలా చెప్పుకొచ్చారు.అంతే కాకుండా కర్మ, ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, కాశీతో తనకున్న అనుబంధం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రేణు దేశాయ్.
జ్వరంలోనూ ఐదు మూగజీవాలకు ప్రాణదానం!
రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ మూగజీవాలని కాపాడటం కోసం తన వంతు కృషి చేస్తుంటారన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా జంతువుల కోసం ఆమె ఓ ఎన్జీవో ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కూడా. ఇక ఇదే విషయం పై తాజాగా విజువల్ టాక్స్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. గత వారం తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నానని చెప్పారు.అయితే అదే సమయంలో తన ఎన్జీవో హెల్ప్లైన్కు సంబంధించిన బాధ్యతలు కూడా తన వద్దే ఉన్నాయని, ఆ రోజు సహాయం చేసే ఇద్దరు స్నేహితులు అందుబాటులో లేకపోవడంతో, జ్వరంతోనే జంతువులను రక్షించే పనిలో పాల్గొన్నానని తెలిపారు. అలా అనారోగ్యంతో ఉన్నప్పటికీ మూడు పిల్లులను, రెండు కుక్కలను కలిపి ఐదు మూగజీవాలను రక్షించినట్లు చెప్పుకొచ్చారు.
అబద్ధం చెప్పడం నాకు చాలా కష్టం!
అంతే కాకుండా కర్మ సిద్ధాంతంపై తనకు బలమైన నమ్మకం ఉందని , మనుషులకు అబద్ధం చెప్పవచ్చేమో కానీ, మనం చేసే పనులను గమనించే శక్తి ఏదో ఒకటి ఉంటుందని తాను నమ్ముతానని చెప్పారు. దాన్ని దేవుడు అనుకున్నా, యూనివర్సల్ ఎనర్జీ అనుకున్నా.. మనం చేసే పనులకు ఏదో ఒక విధంగా ఫలితం ఉంటుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఇక ప్రస్తుత సమాజంలో చాలామంది కర్మ సిద్ధాంతాన్ని పట్టించుకోవడం లేదని, తమకు నచ్చినట్లు జీవిస్తున్నారని ఆమె తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. అయితే కలియుగంలో మనుషుల ప్రవర్తనను అర్థం చేసుకుంటే ప్రతీ విషయానికీ బాధపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు.భగవద్గీతలో చెప్పినట్లు మాయ నుంచి బయటపడి, మనస్సాక్షి ప్రకారం సరైన మార్గంలో నడవడం ముఖ్యమని అన్నారు. తన పిల్లలకు, స్నేహితులకు కూడా ఇదే విషయం చెబుతుంటానని చెప్పుకొచ్చారు.”నాకు అబద్ధం చెప్పడం చాలా కష్టం. నేను అనుకున్నది నేరుగా చెప్పేస్తాను. అందుకే కొన్నిసార్లు నా జీవితాన్ని నడిపించుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది” అని తన వ్యక్తిత్వం ఎలాంటిదో వివరించారు.
చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికతపై ఆసక్తి
ఇక ఆధ్యాత్మికత అనేది తన జీవితంలో ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదని, చిన్నప్పటి నుంచే ఇంట్లో పూజలు, శ్లోకాలు చదవడం వంటి అలవాట్లు ఉండేవని తెలిపారు. తన తల్లి తనకు చిన్న వయసులోనే రామరక్షా స్తోత్రం నేర్పించారని, గణపతి అథర్వశీర్షం వంటి ఆధ్యాత్మిక సంప్రదాయాలు కూడా కుటుంబంలో భాగంగా ఉండేవని తెలిపారు.అది కూడా తన అమ్మమ్మ, తాతయ్యల వైపు నుంచి ఈ సంప్రదాయాలు వచ్చాయని, దీపావళి సమయంలో లక్ష్మీ పూజ, వినాయక చవితి సందర్భంగా గణపతి పూజ వంటివి తమ ఇంట్లో క్రమం తప్పకుండా జరిగేవని గుర్తు చేసుకున్నారు.అయితే తనకు ప్రత్యేకంగా ఏదైనా కోరిక నెరవేరితే దేవుడికి మొక్కుకుంటాననే అలవాటు లేదని కూడా స్పష్టం చేశారు.
కాశీ నన్ను తన దగ్గరకు పిలిచినట్లుగా అనిపించింది!
ఇక చిన్నప్పటి నుంచి కాశీకి వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికీ, వయసు పెరిగిన తర్వాతే అక్కడికి వెళ్లాలని తన మనసులో అనుకునేదానినని, అయితే 30 ఏళ్ల వయసులోనే వెళ్లాలనే ఆలోచన వచ్చినా, చివరకు 40 ఏళ్లు వచ్చిన తర్వాత 2021 జనవరిలో తొలిసారి కాశీకి వెళ్లానని గుర్తు చేసుకున్నారు.అక్కడికి వెళ్లిన తర్వాత తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి కలిగిందని, ఆ ప్రదేశం తనదేనన్న ఫీలింగ్ కలిగిందని వివరించారు.ఇక “కాశీ నన్ను అడాప్ట్ చేసుకుంది. నేను కాశీని అడాప్ట్ చేసుకోలేదు” అని రేణు చెప్పడం ఇక్కడ విశేషం.తిరుమలకు వెళ్లాలన్నా, కొన్ని ఆలయాలను దర్శించుకోవాలన్నా దేవుడి పిలుపు ఉండాలని చాలామంది నమ్ముతారని, తనకు కూడా కాశీ విషయంలో అలాంటి అనుభూతే కలిగిందని చెప్పారు.
వీఐపీ దర్శనాల కంటే సాధారణ భక్తురాలిగానే వెళ్లడం ఇష్టం!
కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు సాధారణ భక్తుల మాదిరిగానే క్యూలో నిలబడతానని, తనను గుర్తుపట్టి కొంతమంది తెలుగు వారు క్యూలోనే సెల్ఫీలు తీసుకుంటుంటారని చెప్పారు.అయితే సాధ్యమైనంత వరకు వీఐపీ దర్శనాలకు దూరంగా ఉంటానని, పిల్లలు, స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు మాత్రం ఒకసారి కాశీ విశ్వనాథుడిని వీఐపీ దర్శనం చేసుకున్నానని తెలిపారు. మొత్తానికి ఈ పాడ్కాస్ట్లో రేణు దేశాయ్ తన నమ్మకాలు, మూగజీవాలపై ప్రేమ, కాశీతో తనకున్న అనుబంధం గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.
ALSO READ :బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?