Cyber Dandiya: స్వేచ్చ బ్యూరో: ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించటంతోపాటు పోలీస్ ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు ఆదివారం “సైబర్ దాండియా” కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంస్కృతిక వేడుకలను ముఖ్యమైన సైబర్ భద్రత సందేశాలతో మేళవిస్తూ ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ నాయకత్వంలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ పుష్ప ఈ కార్యక్రమానికి మార్గనిర్దేశం చేస్తూ సమన్వయం చేశారు. సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఐటీ కంపెనీల ప్రతినిధులు, యువత, మహిళలు, కుటుంబ సభ్యులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 1500 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ రమేష్ మాట్లాడుతూ సాంస్కృతిక వేడుకలతో పాటు సైబర్ భద్రతపై అవగాహనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో “సైబర్ దాండియా” కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సైబర్ దాండియా వంటి కార్యక్రమాల ద్వారా పోలీసులు ప్రజలతో నేరుగా మమేకమై, కొత్తగా వెలుగు చూస్తున్న సైబర్ ముప్పులు, వాటి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించవచ్చన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టూల్స్, వీడియోలు, ప్రాక్టికల్ డెమాన్ స్ట్రేషన్లను వినియోగించినట్లు తెలిపారు. వివిధ రకాల సైబర్ నేరాలు, నేరగాళ్లు అనుసరిస్తున్న విధానాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు సరళంగా, ఆసక్తికరంగా, సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.
Also read: ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!
సాంకేతికతతో రోజువారీ జీవితం సులభతరమైనప్పటికీ, సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారని సీపీ తెలిపారు. డిజిటల్ అరెస్ట్ స్కాంలు, ఇన్వెస్ట్ మెంట్, ట్రేడింగ్ మోసాలు, ఫిషింగ్, స్మిషింగ్, ఓటీపీ మోసాలు, ఫేక్ లింకులు, పార్ట్ టైమ్ జాబ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీలు, పాస్వర్డ్లు, పిన్ నెంబర్లు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. ముఖ్యంగా అసాధారణంగా అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆన్ లైన్ పెట్టుబడి ఆఫర్లను నమ్మేముందు తప్పనిసరిగా ధృవీకరించుకోవాలన్నారు. సైబర్ మోసానికి గురైన సందర్భంలో బాధితులు వెంటనే స్పందించి 1930 సైబర్ క్రైం హెల్ప్ లైన్ కు కాల్ చేసి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. డీసీపీ క్రైమ్స్ పుష్ప మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ప్రజల్లోని భయం, అత్యాశ, నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, వీడియో కాల్స్, అనుమానాస్పద ఏపీకే ఫైల్స్, లింకులు, నకిలీ పెట్టుబడి పథకాలు, పార్ట్ టైమ్ ఉద్యోగ ఆఫర్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.“క్లిక్ చేసే ముందు ఆలోచించండి – నమ్మే ముందు ధృవీకరించండి” అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆమె సూచించారు. సైబర్ దాండియా వేడుకల్లో యువత, మహిళలు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్సాహభరితమైన దాండియా ప్రదర్శనలను సైబర్ భద్రత అవగాహనతో మేళవించడం ద్వారా, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహనను ఆసక్తికరంగా, సులభంగా అర్థమయ్యే రీతిలో చేరవేశారు. కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, డీసీపీలు అన్నపూర్ణ, లావణ్య, రితిరాజ్, శేషాద్రిని రెడ్డి, శ్రీనివాస్, సంజీవ్ తదితర ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.