RP Patnaik:ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా వచ్చిన గరివిడి లక్ష్మి సినిమా మంచి టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెల్సిందే.అయితే గరివిడి లక్ష్మికి అవకాశాలు ఇస్తానని ఇవ్వకుండా ఆమె వద్ద ట్యూన్స్ కొట్టేశాడంటూ ఈ సినిమాలో విలన్ గా ఆర్పీ పట్నాయక్ ని చూపించడంతో ఫైర్ అయ్యాడు .ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో అసలు తాను చేసిన పాటలు ఎక్కడి నుండి ఇన్స్పైర్ అయ్యాడో స్పష్టంగా వివరించాడు.
అసలు విషయానికి వస్తే ఆర్పీ పట్నాయక్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే గరివిడి లక్ష్మిని కలిసి ఆమె దగ్గర నుంచి జానపద ట్యూన్లు తీసుకున్నారని సినిమాలో చూపించారు.ఇక సోషల్ మీడియా కూడా ఆర్పీ గరివిడి లక్ష్మిని మోసం చేశాడంటూ కోడై కూస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆర్పీ పట్నాయక్ తీవ్రంగా ఖండించారు. గరివిడి లక్ష్మి బాగా పాడతారనే విషయం తనకు కాలేజీ రోజుల నుంచే తెలుసని, కానీ ఆమెతో తనకు ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేదని స్పష్టం చేశారు.
తాము విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో సినిమా సక్సెస్ టూర్ చేస్తున్న సమయంలో దర్శకుడు తేజ, రచయిత కులశేఖర్‌లతో కలిసి ఆమెను మొదటిసారి కలిశామని చెప్పారు. ఆ సమయంలోనే ఆమె కొన్ని పాటలు పాడి వినిపించారని, ఫ్యూచర్ లో అవకాశం ఉంటే పరిశీలిద్దామని అనుకున్నామని వివరించారు. కాబట్టి ఆమె దగ్గర నుంచి ముందే ట్యూన్లు తీసుకున్నాననడం పూర్తిగా అబద్ధమని తేల్చి చెప్పారు.
జానపద పాటల ట్యూన్స్ గురించి మాట్లాడుతూ.. తాము కేవలం ఒకరిపైనే ఆధారపడలేదని, పాటల కోసం ఊరూరా తిరిగామని తెలిపారు. పెద్దాపురంలో భోగం మేళకు చెందిన దాదాపు 85 ఏళ్ల వృద్ధ కళాకారుడిని కలిసినప్పుడు, ఆయన పాడిన పాటలు కూడా ఉత్తరాంధ్రలో వినిపించే పాటలలాగే ఉండటం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. జానపదం అనేది ఏ ఒక్కరి సొంత ఆస్తి కాదని, ఒక ప్రాంతంలో పుట్టిన పాట వేరే ప్రాంతంలో వేర్వేరు రూపాల్లో ప్రచారంలోకి వస్తుందని తన అభిప్రాయాన్ని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప్రజల నోళ్లలో నానడం వల్ల జానపద పాటలు వైరల్ అవుతాయని అలాంటిది అవన్నీ ఒక్కరివే అనడం సరికాదని చెప్పారు.
ఇక ‘చిత్రం’ సినిమాలోని ‘మా మామ పారిపోతున్నది’, ‘రాను రాను అంటూనే చిన్నదో’ వంటి హిట్ పాటల వెనుక ఉన్న అసలు సంగతిని చెప్పుకొచ్చాడు. ఆ పాటలు ఫోక్ సాంగ్స్ అయినప్పటికీ దర్శకుడు తేజ సూచన చేయడంతో కులశేఖర్ లిరిక్స్ ని మార్చారని, తాను దానికి సినిమాటిక్ సంగీతాన్నియాడ్ చేసి మరింత ఫేమస్ చేశానని తెలిపారు. జానపద ట్యూన్ ఆధారంగా ఒక పాటను మళ్ళీ రీ క్రియేట్ చేయడం వేరు, దాన్ని ఒకరే సృష్టించారని చెప్పడం వేరు అని స్పష్టం చేశారు.
అయితే, ఈ సినిమాలో తన పాత్రను చూపించిన విధానంపై ఆర్పీ పట్నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి జరిగింది ఒకటైతే, సినిమా కోసం తనను గరివిడి లక్ష్మిని ముందే కలిసినట్లు చూపించారని ఆరోపించారు. నిర్మాతపై ఉన్న గౌరవంతో అప్పట్లో దానికి ఒప్పుకున్నప్పటికీ, తీరా సినిమా విడుదలయ్యాక లక్ష్మి దగ్గర పాటలు తీసుకుని ఆమెకు అవకాశం ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిగా తాను ప్రేక్షకులకు కనిపిస్తున్నానని బాధపడ్డారు.
చివరగా, జానపద కళాకారుల హక్కుల గురించి మాట్లాడుతూ.. 1995-96 ప్రాంతంలోనే గరివిడి లక్ష్మి బుర్రకథ రికార్డింగ్ కోసం ఒక ఆడియో కంపెనీ రూ. 3,500 పారితోషికం ఇచ్చిందని, అప్పటి రోజుల్లో అది పెద్ద మొత్తమేనని గుర్తుచేశారు. ఐపీఆర్ఎస్ (IPRS) వంటి సంస్థల ద్వారా జానపద కళాకారులు తమ హక్కులు, రాయల్టీల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.చూడాలి మరి గత కొన్ని రోజులుగా నలుగుతున్న ఈ వివాదం ఎక్కడ ఎండ్ కార్డ్ వేసుకుంటుందో !
ALSO READ :గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు.. బయోపిక్‌లో నిజాలు చూపించారా?