Tarun Bhaskar:సాధారణంగా ఈ మధ్యకాలంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అది సూపర్ హిట్ అయింది అంటే కచ్చితంగా ఆ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ప్రకటిస్తూ.. అటు దర్శక నిర్మాతలు కూడా క్యాష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే సీక్వెల్స్ అన్నీ సక్సెస్ అవుతాయా అంటే చెప్పలేని పరిస్థితి. ఒకవేళ కథను అద్భుతంగా తెరకెక్కించగలిగితే మాత్రం సీక్వెల్స్ కూడా సూపర్ హిట్ అందుకుంటాయని ఇటీవలే పుష్ప 2 లాంటి చిత్రాలు నిరూపించాయి కూడా.. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని మళ్లీ పంచడానికి సీక్వెల్ తో వస్తోంది కామెడీ యూత్ ఫుల్ కల్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది?’.
2018లో తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar)దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మించిన చిత్రం ఈ నగరానికి ఏమైంది?. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ (Vishwak sen), అభినవ్ గోమటం , వెంకటేష్, అనిషా ఆమ్బ్రోస్, సిమ్రాన్ చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం అప్పట్లోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక అలాంటి ఈ యూత్ ఫుల్ క్లాసిక్ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా.. సడన్గా ఈ సినిమాలో విశ్వక్ గ్యాంగ్ లో ఒకరైన నటుడు సుశాంత్ పార్ట్ 2 లో భాగం కావడం లేదని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సుశాంత్ పాత్రలో ‘హిట్’ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న శ్రీనాథ్ మాగంటి నటిస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
దీనిపై ఈ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా ఒక లాంగ్ నోట్ విడుదల చేశారు..” సుశాంత్ కేవలం వ్యక్తిగత కారణాలవల్లే ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం నన్ను ఎంతో బాధించింది. సుశాంత్ ఈ సినిమాలో భాగం కావడం లేదు అని తెలిసి కొంతకాలం షాక్ లోకి వెళ్లిపోయాను. అసలు ఈ సినిమా చేయాలా? వద్దా ?అనే డైలమాలో కూడా పడిపోయాను. కేవలం డబ్బు కోసం సినిమా తీయడం నాకు ఇష్టం లేదు. కథలో ఆ ఫ్రెండ్షిప్ వైబ్ పర్ఫెక్ట్ గా కుదిరితేనే ముందుకు వెళ్తానని స్పష్టం చేశాను. అయితే స్క్రిప్టును మళ్లీ మళ్లీ విశ్లేషించుకున్నాక..కార్తీక్ పాత్రను మరో కోణంలో చూపిస్తూ.. సినిమాను పట్టాలెక్కించాలనుకున్నాను. అందులో భాగంగానే సుశాంత్ ఈ ప్రయాణంలో లేకపోయినా సినిమాలో కార్తీక్ పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది” అంటూ తెలిపారు.
ALSO READ;Dhurandhar OTT:బాలీవుడ్ ను షేక్ చేసిన దురంధర్.. తెలుగులో ఏ ఓటీటిలో అంటే..?
మొత్తానికైతే వేరే నటుడితో ఈ పాత్రను రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ నటుడు ఎవరు అన్న విషయం పై మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు తెరపైకి హిట్ నటుడు శ్రీనాథ్ పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం. పైగా “కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు.. ద బాయ్స్ మళ్ళీ వస్తున్నారు” అంటూ తన టీం మీద తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనలో కాన్ఫిడెంట్ పెరుగుతోందని, ఆడియన్స్ ఆశించే అదే మ్యాజిక్ మళ్ళీ తెరపై రిఫ్లెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు తరుణ్ భాస్కర్.